భయమెరగని బామ్మ

6 Dec, 2019 00:18 IST|Sakshi

ఏజ్‌లెస్‌

బెదిరిస్తే ఏమవుతుంది..? ఏమీ కాదు అలా బెదిరించిన వారే తోకముడుస్తారు.. అంటూ సమస్యల పరిష్కారానికై ముందుకు సాగుతోంది 92 ఏళ్ల ఈ చెన్నై బామ్మ. పేరు కామాక్షి. చెన్నై బెసెంట్‌ నగర్‌లో ఉంటున్న ఈ బామ్మను కలిస్తే చాలు మనం మరిచిపోయిన ఎన్నో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సమస్యల పరిష్కారానికి మనమూ కదలాలనిపించేలా చేస్తుంది.

‘నేను ముసల్దానినైపోయాను. అలాగని ఇప్పుడప్పుడే ఈ లోకాన్ని విడిచివెళ్లాలనుకోవడం లేదు. నేను భోజనం చేయడానికి ఇప్పుడు నా పళ్లెంలో చాలా పనులున్నాయి. ముందు వాటి సంగతి చూడాలి’ అంటోంది కామాక్షి పాటి. చుట్టుపక్కల కాలనీవాసులే కాదు కార్పొరేషన్‌ అధికారులు కూడా ఆమెను చూస్తే జంకుతారు. ఆమె బాధ్యతను తెలుసుకొని ప్రేమగా పలకరిస్తారు, గౌరవిస్తారు. పరిచయం లేని వారికి కూడా మన ఇంట్లోని బామ్మలాగానే కనిపిస్తారు. అది ఎంతవరకు అంటే.. చుట్టుపక్కల ఎవరైనా పౌర ప్రమాణాల ఉల్లంఘనకు పాల్పడనంతవరకే.  

తెల్లవారు ఝాము నుంచి రాత్రి పది వరకు
తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కామాక్షి పాటి ఏదైనా సమస్యను పరిష్కరించడానికి వెనకాడరు. ఈ వయస్సులో కూడా ఆమెకు నచ్చని ప్రభుత్వ ప్రతిపాదన ఏదైనా వస్తే దానిని నిరసిస్తూ వీధుల్లోకి వస్తారు లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్న అధికారినైనా నిలదీస్తారు. ఇంతకీ ఈమె ఎవరంటారా .. తంజావూరులో పుట్టిన కామాక్షి పాటి బెంగుళూరులో చదువుకుంది. పెళ్లై ఢిల్లీ వెళ్లింది. ‘ఢిల్లీలో ఆ మూడు దశాబ్దాలు నా జీవితంలో ఉత్తమమైనవి. 1948లో అక్కడికి వెళ్లాను. నవజాత దేశంలో అల్లకల్లోల రాజకీయాల సమయం. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండేవి. కానీ, ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు’ అని నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. ‘1981లో తిరిగి చెన్నైకి వచ్చాను. ఇక్కడ మారిన వాతావరణం, సంస్కృతి చూసి షాక్‌ అయ్యాను. సర్దుబాటు చేసుకోవడానికి కొన్నాళ్లు పట్టింది’ అని చెబుతారు.

అనుకోకుండా కార్యకర్తగా..
చెన్నై బెసెంట్‌నగర్‌లోని కామాక్షి ఉంటున్న ఇంటి ముందు రహదారి ఓ సమస్యగా మారింది. ప్రజలు దీనిని బహిరంగ మరుగుదొడ్డిగా ఉపయోగించేవారు. చనిపోయిన జంతుకళేబరాలను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఖననం చేసేవారు. ఇళ్లలోని వ్యర్థాలను పోసి వెళుతుండేవారు. విసిగిపోయిన కామాక్షి పదే పదే అధికారులకు విజ్ఞప్తులు చేసేది. అధికారులు ఆ విజ్ఞప్తులను తీసుకునేవారు. కానీ, ఏదో సాకు చెప్పి అప్పటికి తప్పించుకునేవారు. ‘రహదారికి ఇరువైపులా చెట్లు ఉండాలి’ అని వారికి గుర్తు చేసేది. మూడేళ్లు నిరంతర విజ్ఞప్తులు, నిరసనల తర్వాత కార్పొరేషన్‌ అధికారులు రహదారిని అందంగా తీర్చిదిద్దడంతోపాటు రోడ్‌సైడ్‌ పార్క్‌ను నిర్మించడంతో ఆమె తన మొదటి విజయాన్ని సాధించింది.

కామాక్షి పాటి: అలుపెరుగని అవిశ్రాంత కార్యకర్త  

ఆమె 80వ పుట్టినరోజు సందర్భంగా అప్పటి చెన్నై కమిషనర్‌ ఈ పార్కు  ఆధునీకరణ బాధ్యతను ఆమెకు అప్పగించారు.అప్పటికి ఆమె కార్పొరేషన్‌ అధికారులు, స్థానిక చట్టసభ సభ్యులతో పరిచయాలను ఏర్పరుచుకుంది. కామాక్షి పర్యవేక్షణ ఎంత బాగుంటుందో 12 ఏళ్లుగా ఆమె నిర్వహిస్తున్న పార్క్‌ చెబుతుంది. ‘నేనెప్పుడూ అలవాటు ప్రాముఖ్యతను చెబుతాను. ఒక స్థలాన్ని పునరుద్ధరించినా, ఒకసారి శుభ్రపరిచినా అంతటితో ఏమీ ముగిసిపోదు. దానిని నిరంతరాయంగా కొనసాగించాలి. ఒక బాధ్యతగా తీసుకోవాలి’ అని ఆమె సలహా ఇస్తారు. రోడ్డు, పార్క్‌ పని పూర్తయింది. ఇక పౌర సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చారు కామాక్షి.

బెసెంట్‌ నగర్‌లోని చుట్టుపక్కల వాసులు తమ మనోవేదనలను, పరిపాలనకు సంబంధించి సమస్యలు పరిష్కరించేలా చూడమని కామాక్షికి దగ్గరకు వచ్చేవారు. దీంతో ఆమె తరచూ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ఆమె సాధించిన విజయాలలో బెసెంట్‌ నగర్‌ బీచ్‌లోని కార్ల్‌ జెష్మిత్‌ మెమోరియల్‌ పునరుద్ధరణ అతి ముఖ్యమైనది. శిథిలావస్థలో ఉన్న ఈ మెమోరియల్‌లో మద్యం సేవించడం, గోడలపై పిచ్చి రాతలు రాయడం, స్మారక చిహ్నంపై మూత్రవిసర్జన చేయడం వంటివి గమనించిన పాటి అది పూర్తిగా బాగయ్యేంతవరకు అధికారులను వదిలిపెట్టలేదు.

బెదిరింపులు బేఖాతరు
కామాక్షి పాటి విజయం.. రహదారులు, ష్మిత్‌ మెమోరియల్‌ పునరుద్ధరుణతో ఆగలేదు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించే షాపులను అడ్డుకోవడం, కాలిబాటలను విస్తరించే విధానాల కోసం బెసెంట్‌ అవెన్యూలో నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. రాత్రి 10 దాటిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు ఆపాలని, పిల్లలు, వృద్ధుల నిద్రకు అవరోధం కలిగించకుండా చూడాలని కోరుతుంది. బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఉండటం ఇష్టమైన కామాక్షికి అవినీతి వైఖరులకు పాల్పడే వారితో ఎప్పుడూ గొడవగానే ఉంటుంది.

నా విధానాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇచ్చేవారున్నారు. కానీ, వారెవరూ ఇటువంటి బాధ్యత తీసుకోరు. వీధుల్లో చెత్త వేయద్దని నిలదీస్తే యువకులు స్పందించే తీరు బాధిస్తుంటుందని కామాక్షి తెలుపుతుంది. నిరసన తెలపడం కష్టమైన పనికాదు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి’ అని  కోరుతుంది కామాక్షి. కాటికి కాళ్లు చాపుకున్న ముసలివాళ్లు ఏం చేస్తారులే అనుకోవద్దు. తలుచుకుంటే కొండను కూడా పిండిచేయగలమని నిరూపించగలరు. ముళ్ల మార్గాలనూ నందనవనంగా మార్చగలరు.
– ఆరెన్నార్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా