వధూవిరులు

26 Feb, 2016 23:07 IST|Sakshi
వధూవిరులు

అందం చందం సంప్రదాయ అలంకరణల సొంతం. అమ్మాయిల రూపాన్ని ఒద్దికగా, కనులకు పండగలా మార్చేసే సుగుణం సంప్రదాయ అలంకరణకే ఉంది. ఆ అలంకరణలో పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిది. అమ్మాయి పూలజడతో ముస్తాబు అయ్యిందంటే వేడుకకు సిద్ధమైంది అని అనుకునేవారు. ఇప్పుడు ఏ వేడుకకైనా కళ రావాలంటే అమ్మాయి పూలజడతో సిద్ధమవ్వాలని ఇంటిల్లిపాదీ ముచ్చటపడుతున్నారు. దీనికి కారణం ఇప్పుడు పూలజడల్లోనూ ఆధునికత అందంగా చేరిపోవడమే! నిన్నమొన్నటి వరకు మోయలేని భారాన్ని పిల్లల నెత్తిన ఎందుకు పెట్టడం అనుకునేవారు సైతం ఇప్పుడు చిన్నారులను కుందనపు బొమ్మలా తీర్చిదిద్దాలని ఆరాటపడుతున్నారు. అందుకేనేమో ఇప్పుడు పువ్వులతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలు కూడా జడ ఒంపుల్లో చేరిపోవడానికి వేగిరపడుతున్నాయి.
 
పూలజడల్లో మల్లెమొగ్గలు, కాడమల్లె, కనకాంబరాలు, మరువం ఇలాంటి పువ్వులను మాత్రమే ఉపయోగిస్తారు. మోయడానికి బరువుగా ఉంటాయి కాని, చూడటానికి అందంగా ఉంటాయి. కృత్రిమమైనవి వద్దనుకున్నవారు అసలు పూల జడలను ఎంపిక చేసుకుంటారు.
 
గులాబీల జడ...
ఈకాలం అమ్మాయిలు 90 శాతం మంది ఇష్టపడే పూల జడ ఇది. పూల జడ వేసుకున్నామన్న బరువు కూడా తెలియదు. గులాబీ రేకులు తీసి, కుట్టి, మల్లెమొగ్గలు పెడతాం. పూలజడకు బేస్ ఉంటుంది. బిళ్లలుగా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్‌గా కావాలనుకున్నవారు దూరం దూరంగా అమర్చుకోవచ్చు. హెవీగా కావాలనుకున్నవారు దగ్గరగా వాడచ్చు. అర్ధచంద్రాకారంగా పైన ఉన్నదాన్ని వేణి అంటారు. దీన్ని కూడా పెటల్స్‌తో తయారుచేస్తారు. గోల్డ్ కలర్ టిష్యూ లేస్‌తో తయారుచేస్తారు.
 
ముత్యాల జడ...
పూలజడ చిన్న చిన్న వేడుకలకూ వేసుకోలేం. అలాగని జడను సింపుల్‌గా వదిలేయలేం. పెళ్లికి పూలజడ సంప్రదాయబద్ధంగా నిండుగా ఉండాలి, రిసెప్షన్‌కి సింపుల్‌గా ఉంటే చాలు. ఇందుకుముత్యాల జడ మంచి ఆప్షన్. పెళ్లికూతురు, పెళ్లికొడుకు దగ్గరి బంధువుల
 అమ్మాయిలు కూడా ఈ జడను వేసుకుంటే వేడుకకు మరింత కళ.
 
మల్లెల జడ..

వివాహ వేడుకల్లో మల్లెపూల జడది ప్రత్యేక ఆకర్షణ. మల్లెల సువాసన మనసును ఆహ్లాదభరితం చేస్తుంది. వాటి తెలుపు ప్రశాంతతను చేకూర్చుతుంది. తలంబ్రాల చీరకు మల్లెపూల జడ అదనపు అందాన్నిస్తుంది.
 
బంగారు జడ...
బయట అంతా బంగారు రంగు టిష్యూ లేస్‌తో డిజైన్ చేసి, లోపల మల్లెమొగ్గలు, పైన అర్ధచంద్రాకారంగా రెండు వేణిలను అమర్చాలి. ఒక వేణికి మల్లెమొగ్గలు, మరో వేణికి మల్లెపూలు వాడితే మరింత అందంగా ఉంటుంది. ఈ జడ తలంబ్రాల సమయంలో ఎక్కువ ఇష్టపడతారు.
 
మీరూ ట్రై చేయవచ్చు...
కాస్త సృజనను జోడిస్తే ఆకట్టుకునే జడలను మీరూ అందంగా రూపొందించవచ్చు. అందుకోసమే ఈ చిట్కాలు...మామూలుగా చాలా మంది రెడీమేడ్‌గా లభించే సాదా బిళ్లలు తెచ్చి జడంతా పెట్టేసుకుంటారు. కాని పూలతో వచ్చిన నిండుతనం మరి వేటికీ రావు. అందుకే బిళ్లల చుట్టూతా పూలతో సింగారిస్తే మరింత అందంగా కనిపిస్తుంది జడ.ముందుగా సిద్ధం చేసిన పూల జడలను గాలి తగలని బాక్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే 2-3 రోజుల వరకు అవి తాజాగా ఉంటాయి. బయటకు తీసిన 5 గంటల నుంచి పువ్వులు నెమ్మదిగా తాజాదనం కోల్పోతాయి. నీళ్లు చల్లితే నల్లబడతాయి. అందుకని పొడిగానే ఉంచాలి.
 
చీర రంగులను బట్టి పూలజడలు...
పసుపు, నారింజ, ఎరుపు రంగులో చీర ఉంటే గులాబీ రేకులు, కనకాంబరాలు వాడాలి.తెలుపు రంగు చీర అయితే- మల్లెమొగ్గలు, కాడ మల్ల్లె, లిల్లీలు, చమేలి పూలు, మధ్య మధ్యలో ముత్యాలు, ఆర్టిఫీషియల్ గోల్డ్ ఫ్లవర్స్, మోటివ్స్... అదనంగా జత చేయాలి.ఆకుపచ్చ రంగు చీర అయితే సంపెంగ, మరువం వాడుతూ ఇతర పువ్వులను, మోటివ్స్‌ను, రకరకాల జడబిళ్లలను ఉపయోగించవచ్చు. వయోలెట్ కలర్ అయితే ఆర్కిడ్స్, డబుల్ షేడెడ్ పువ్వులు కావాలనుకుంటే కార్నిషన్ వాడాలి. పూల జడల ధరలు డిజైన్‌ను బట్టి ఉంటాయి. ఖరీదైన జడబిళ్లలు వాడాలంటే ఖర్చు దానికి తగిన విధంగానే ఉంటుంది. జడబిళ్లలు, ఇతర యాక్సెసరీస్ హైదరాబాద్ ఇతర ముఖ్య పట్టణాల మార్కెట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

 - కల్పన రాజేష్, పూలజడల డిజైనర్, ఎల్.బి.నగర్, హైదరాబాద్

 

>
మరిన్ని వార్తలు