రమ్యంగా...రికార్డ్ మ్యాజిక్

11 Feb, 2014 23:53 IST|Sakshi
రమ్యంగా...రికార్డ్ మ్యాజిక్

 నా చేతుల్లో ఏమీ లేదంటూ ఖాళీ చేతులు చూపిస్తుందా అమ్మాయి... ఆ ఖాళీ చేతుల్లో నుంచి తెల్లపావురం రెక్కలు విచ్చుకుంటూ గాల్లోకి ఎగిరిపోతుంది. ఉన్నట్టుండి గాలిలో ఒక గొడుగు విచ్చుకుంటుంది... అంతే వేగంగా అమ్మాయి చేతిలో నుంచి సీడీలు పుట్టుకొచ్చేస్తాయి. ప్రేక్షకుల్ని కనికట్టు చేస్తున్న ఆ అమ్మాయి రమ్యశ్రీ! టీనేజ్‌లోనే జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న లేడీ మెజీషియన్...మైనారిటీ అయినా తీరక ముందే తాజాగా పన్నెండు గంటల నిర్విరామ ప్రదర్శనతో రికార్డుల్లోకెక్కిన పిడుగు...
 
 వేదిక మీద ఏకధాటిగా పన్నెండు గంటల సేపు సాగిన ఇంద్రజాల ప్రదర్శన అది. రక్తదానం ఆవశ్యకత, నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ, మద్యపాన నిషేధం, ఇంధన పొదుపు, మహిళా సాధికారత... ఇలా మొత్తం పన్నెండు అంశాలపై ప్రదర్శన సాగింది. విజ్ఞానాన్ని మేళవించిన వినోదకార్యక్రమం అది. సామాజిక బాధ్యత స్పృహతో సాగిన ఇంద్రజాల ప్రదర్శన. ప్రేక్షకులను ఇంద్రజాలంతో కనికట్టు చేసిన మెజీషియన్ 17 ఏళ్ల రమ్యశ్రీ. ‘‘ఇంద్రజాలం గొప్ప మాధ్యమం. ఏ విషయాన్ని అయినా ఇంద్రజాలంతో చెబితే ఇట్టే గుర్తుండిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసే శక్తి ఇంద్రజాలానికి ఉంది. మెజీషియన్‌గా సామాజిక బాధ్యత ఉందనుకుంటున్నాను. అందుకే నా కార్యక్రమాల్లో ఎక్కువ సామాజికాంశాలే ఉంటాయి’’ అంటున్నారీ అమ్మాయి.
 
 కుటుంబమంతా...
 జానపద కాలం నుంచి కథల్లో తరచూ ఇంద్రజాలమహేంద్రజాల విద్యలు తెలిసిన వాడు... అనే పదమే వినిపించేది. ఇక నుంచి ఇంద్రజాల విద్య తెలిసిన అమ్మాయి అని స్త్రీ పాత్రనూ పరిచయం చేస్తూ కథల్ని తిరగరాసుకోమంటోంది రమ్యశ్రీలోని ప్రతిభ. ఈ సృజనాత్మకత ఆ కుటుంబంలోనే ఉంది. రమ్య తండ్రి రఘుబాబు మెజీషియన్, తల్లి నాగమణి మ్యాజిక్ మెటీరియల్, వెంట్రిలాక్విజమ్ బొమ్మలు చేస్తారు. మణి తల్లి సీతాదేవి కూడా ఇదే పని చేసేవారు. రఘుబాబు అదే సంగతి చెప్తూ... ‘‘రమ్యకి ఐదేళ్ల వయసులోనే నాతోపాటు స్టేజి మీద చిన్న చిన్న మ్యాజిక్కులు చేయడం అలవాటు చేశాను. మొదట్లో రెండు నిమిషాలు, మూడు నిమిషాలు చేయిస్తూ నిడివి పెంచాను. ఆరేళ్ల వయసులో తానొక్కతే ప్రదర్శన ఇచ్చింది. గత పన్నెండేళ్లుగా ఈ రంగంలో రోజుకో కొత్త అంశం నేర్చుకుంటోంది. రమ్యకు తొలిగురువును నేనే. ఆ తర్వాత బీహార్‌లోని బ్రిజ్‌మోహన్, కేరళలో నిపుణుల దగ్గర కొత్త టెక్నిక్స్ నేర్చుకుంది. తిరుపతిలో రవిరెడ్డి దగ్గర కళ్లకు గంతలు కట్టుకుని మోటర్‌బైక్ నడపడం నేర్చుకుంది. ఇప్పటికి రెండువేలకు పైగా ప్రదర్శనలిచ్చింది. పది పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో బహుమతులందుకుంది’’ అని వివరించారు.
 
 ‘‘మా అబ్బాయి వికాస్‌కీ, రమ్యకీ ఇద్దరికీ మా వారు మ్యాజిక్ నేర్పించారు. రమ్య ఇష్టంగా నేర్చుకుంది. ఇంద్రజాల ప్రదర్శనలు జరిగే గాలా షోలలో మేము తయారు చేసిన మ్యాజిక్ వస్తువుల స్టాల్ పెట్టేవాళ్లం. అలా రమ్య రెండేళ్ల పాపాయిగా ఉన్నప్పుడే ముంబయిలో ఇంద్రజాల ప్రదర్శన చూసింది’’ అంటారు రమ్య తల్లి నాగమణి.
 
 సీనియర్ల ప్రదర్శనలే పాఠాలు!
 రమ్య తాను గత జనవరి 27వ తేదీ చేసిన 12 గంటల ప్రదర్శనను ఉటంకిస్తూ... ‘‘ఆ ప్రదర్శనతో నాకు ఐఎస్‌ఓ సర్టిఫికేట్ వచ్చింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ ది రికార్డ్స్‌కి అప్లయ్ చేశాను. గాలా షోలలో 30-40 మంది మెజీషియన్ల ప్రదర్శనలను గమనించడం మంచి ఎడ్యుకేషన్’’అంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన సందర్భాలను ఉదాహరిస్తూ... ‘‘ఏదైనా మ్యాజిక్ అంశం మిస్‌ఫైర్ అయినా కూడా దానికి అనుగుణంగా అప్పటికప్పుడే మార్చుకోవాలి. దానిని మేనేజ్ చేసి మరోలా ప్రెజెంట్ చేయాలి. లింకింగ్ రింగ్స్‌లో ఒక రొటీన్‌లో తేడా వస్తే మరో రొటీన్ చేస్తాం. ఒక్కోసారి ఈ తేడా సీనియర్ మెజీషియన్‌కు కూడా అర్థం కాదు. ఏదేమైనా సగంలో వదిలేయకుండా మరో రకంగా తిప్పుకోగలగాలి’’ అని ఈ అమ్మాయి వివరించారు. ‘‘ప్లేయింగ్ కార్డ్‌లు, సీడీలతో కనికట్టు చేయడానికి ఎక్కువ సాధన చేయాలి. సాధారణంగా రోజూ గంట సేపు ప్రాక్టీస్ చేయాలి. ఈ 12 గంటల ప్రదర్శనకు ముందు ఒక్కో కాన్సెప్ట్‌కి కొంత సమయం కేటాయించుకుని రోజుకి ఏడెనిమిది గంటలు ప్రాక్టీస్ చేశా. నిలబడడం, నడవడం వంటి ఫిట్‌నెస్ సాధించడానికి రెండు నెలలు శ్రమించా.
 
 పన్నెండు గంటల ప్రదర్శనకు 4 నెలలు ప్రాక్టీస్ చేశా’’నన్నారు.మహిళలు పెద్దగా ఆసక్తి చూపని రంగంలో అడుగుపెట్టి నంబర్‌వన్‌గా నిలిచిన రమ్య ట్రెండ్‌సెట్టరే. ‘‘రమ్య అత్యున్నత ప్రతిభ ఉన్న మెజీషియన్. భారతీయ మెజీషియన్లకు గర్వ కారణం’’ అని సీనియర్ మెజీషియన్ డా.బి.వి. పట్టాభిరామ్ ప్రశంసించారు. రమ్య గనక తన కృషిని ఇలాగే కొనసాగిస్తే లిమ్కా, గిన్నిస్ రికార్డుల్లో స్థానం సాధిం చడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
 
 నన్ను మించిపోయింది!
 నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు రమ్య చాలా ఆసక్తిగా గమనించేది. తనని లేడీ మెజీషియన్‌ని చేయాలనుకున్నాను. నేను కోరుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా సాధించి... దేశంలో నంబర్‌వన్ లేడీ మెజీషియన్ అయింది.
 - రఘుబాబు,
 మెజీషియన్
 
 నాన్నే నాకు ఆదర్శం!
 నాన్న ఉద్యోగం చేస్తూ కూడా తనకిష్టమైన ఇంద్రజాలాన్ని కొనసాగించారు. నేను సి.ఎ చేస్తున్నాను. ఉద్యోగం చేస్తూ మ్యాజిక్‌ను కొనసాగిస్తాను. మ్యాజిక్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్లలో కనిపించే అబ్బురాన్ని చూడాలనిపిస్త్తుంది.
 - రమ్యశ్రీ, మెజీషియన్
 
 - వాకా మంజులారెడ్డి
 
 

మరిన్ని వార్తలు