మా ఊరి పెద్దల చేతుల్లో ప్రతిరోజూ అత్యాచారం

28 Feb, 2016 23:23 IST|Sakshi
మా ఊరి పెద్దల చేతుల్లో ప్రతిరోజూ అత్యాచారం

జోగిని వ్యవస్థను ప్రోత్సహించినా శిక్షార్హులే!
 
 లీగల్ కౌన్సెలింగ్
 
నేనొక సోషల్ వర్కర్‌ని. మాదొక మారుమూల గ్రామం. అక్షరాస్యత చాలా తక్కువ. మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఎక్కువ. మహిళల పరిస్థితి ఘోరం. మీరు చెబితే నమ్మరేమో. ఒక అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఒక దేవస్థానానికి అంకితమిచ్చి, వివాహంలాంటిది జరిపించారు. ఆ అమ్మాయి మా ఊరి పెద్దల చేతుల్లో ప్రతిరోజూ అత్యాచారానికి గురౌతూనే ఉంది. అదేమంటే ఆమె జోగిని కనుక అది సహజమంటున్నారు. నేనేమైనా సహాయం చేయగలనా?
 - కల్పన, ఆదిలాబాద్.

 ఇలాంటి వ్యవస్థలు ఇంకా ఉన్నందుకు సభ్యసమాజం సిగ్గుపడాలి. ఒక స్త్రీని ఊరుమ్మడి సరుకుగా మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలో ఈ జోగిని వ్యవస్థ ఉంది. వీరినే దేవదాసీలు, బసివినులు, మాతమ్మలు, తమ్మమ్మలు అని అంటుంటారు. పండుగలు, జాతరలు, ఊరేగింపులు వంటి సందర్భాలలో వీరిని చూస్తుంటాము. విచిత్ర వేషధారణలో, అనేక విన్యాసాలు చేస్తూ వీరు కనిపిస్తారు. వీరు లేకుండా కొలుపులు, జాతరలు ప్రారంభం కావు. కేవలం అప్పుడే వారికి ప్రాధాన్యత ఇస్తారు. మిగతా సమయాల్లో ఊర్లోని మగాళ్ల కోర్కెలు తీర్చే యంత్రాల్లాగే చేస్తారు. వీరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేవదాసి (అకింతం) నిషేధ చట్టం 1988 ఉంది. ఈ చట్టప్రకారం ఏదైనా హిందూ దేవత, విగ్రహం లేదా దేవస్థానానికి సేవ చేసే నిమిత్తం అంకితమివ్వబడే స్త్రీని దేవదాసి అంటారు. ఒక స్త్రీని దేవదాసిగా/బసివిని/జోగినిగా అంకితం చేయడం నేరం. అలా అంకితం చేసే కలాపం నిర్వహించినా, పాల్గొన్నా, ప్రోత్సహించినా రెండు నుంచి మూడు సంవత్సరాల శిక్ష, మూడువేల రూపాయల వరకు జరిమానా పడుతుంది. మీరు చెప్పిన కేసులో ఆ అమ్మాయి అమ్మానాన్నలే ఆమెను దేవదాసిగా అంకితమిచ్చారు. తల్లిదండ్రులే స్వయంగా అలా దేవుడికి అంకితమిస్తే రెండు నుండి ఐదు సంవత్సరాల శిక్ష పడుతుంది. పోలీసు కంప్లైంట్ ఇవ్వవచ్చు. లేకుంటే మీ స్వచ్ఛంద సంస్థ తరపున మేజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టవచ్చు. తల్లిదండ్రులను, నిర్వహించినవారిని, హాజరైన వారినీ, ప్రోత్సహించిన వారినీ పార్టీలుగా చేయవచ్చు.
 
నేను టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నా భర్తనుండి కోర్టుద్వారా విడాకులు తీసుకున్నాను. మాకు 5, 6 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు. నా భర్త పిల్లల కస్టడీ కోరుతూ ఆశ్రయించారు. జడ్జిగారు మమ్ములను లోపలికి పిలిపించి, పిల్లలు చిన్నవాళ్లు కాబట్టి తల్లికే కస్టడీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ అని, బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమని చెప్పారు. దానికి మా వారు బాబును తనకి ఇమ్మని, పాపను నన్నే ఉంచుకోమని ప్రపోజల్ పెట్టారు. కేస్ ఇంకా మొదలు కాలేదు. నా సందేహం ఏమిటంటే, పిల్లలను ఇలా విడదీసి పంచుకోవడం న్యాయమా? నాకు విషయం తలచుకుంటేనే దుఃఖం వస్తోంది. మరో ముఖ్యవిషయం. మావారు ఒక క్రిమినల్ కేసులో నిందితుడు. రిమాండ్‌కి కూడా వెళ్లి వచ్చారు. ఒకవేళ అతనికి శిక్ష పడితే పిల్లలపై తీవ్రప్రభావం చూపిస్తుంది కదా! ఈ విషయంలో పిల్లలిద్దరి కస్టడీ నాకు వచ్చే అవకాశం ఉందా?
 - పి.సత్యవతి, విశాఖపట్నం

 మీకు తప్పకుండా పిల్లలిద్దరి కస్టడీ వస్తుంది. ఎందుకంటే కస్టడీ కేసులో పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు టీచర్ కనుక పిల్లల చదువు విషయంలో, పెంపకం విషయంలో తగిన జాగ్రత్త తీసుకునే అవకాశం ఉందని కోర్టువారు అనేక కేసుల్లో తీర్మానించారు. పిల్లలిద్దరూ ఒకేచోట పెరిగితే వారి మధ్య బంధాలు బలంగా ఉంటాయని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు వృద్ధిపొంది, ఒకరికొకరు తోడుగా ఉంటారని అనేక తీర్పులు ఉన్నాయి. మీకు ఇంకొక ప్లస్‌పాయింట్ ఉంది. మీ భర్త రిమాండ్‌కు వెళ్లివచ్చారు. శిక్ష కూడా పడే అవకాశం ఉంది. తండ్రి క్రిమినల్ కేసులో ఇరుక్కొని, జుడీషియల్ కస్టడీకి వెళ్లి వచ్చి, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, అవన్నీ పిల్లల మానసిక పరిస్థితిపై ఎంతో ప్రభావం చూపి, వారి ఎదుగుదలపై దుష్ర్పభావం పడుతుందని న్యాయమూర్తులు అనేక కేసుల్లో తీర్పునిచ్చి, అలాంటప్పుడు కస్టడీ తల్లికే ఇవ్వాలని తీర్మానించారు. మీ కే సు విచారణకు వస్తే మీరు మీ భర్తకు సంబంధించిన క్రిమినల్ కేసు ఆధారాలను కోర్టు ముందు ఫైల్ చేయాలి. మీ ఆవేదన తీరుతుంది. తండ్రికి ఎటూ విజిటింగ్ హక్కులు ఉండనే ఉన్నాయి.
 మేము ఒక గ్రౌండ్ ఫ్లోర్‌లో వుంటున్నాము.

నా భర్త ఉద్యోగి. నేను గృహిణిని. ఇటీవలే మాకు వివాహమైంది. మా ఇంటి గుమ్మం ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే మెట్ల ఎదురుగా వుంటుంది. పైకి వెళ్లేవాళ్లు, కిందికి వచ్చేవాళ్లు కనిపిస్తుంటారు. సమస్యేమిటంటే ఒక పోకిరీ వ్యక్తి అస్తమానం పైకీ కిందికీ వెళుతూ నావైపే తదేకంగా చూస్తున్నాడు. అతను పైపోర్షన్‌లో ఉంటున్నాడు. మొదట్లో పట్టించుకోలేదు. నేనే తలుపులు బిగించుకుని ఉంటున్నాను. అస్తమానం అలా వుండలేను కదా. ఇటీవలకాలంలో అతను చాలా అసభ్యమైన సైగలు చేస్తున్నాడు. వివిధ హావభావాలు (శృంగారపరమైన) ప్రదర్శిస్తున్నాడు. నేను గమనించకుండా వుంటే ఏదో ఒక శబ్దం చేసి అటు చూసేలా చేస్తున్నాడు. నేనెంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. ఎవరికీ చెప్పుకోలేను. గట్టిగా మందలించలేను. పైగా నా భర్త చాలా అనుమానం మనిషి. సలహా ఇవ్వండి.
 - ఒక సోదరి, హైదరాబాద్

 నిజంగా మీ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. కొందరు దుర్మార్గులు ఇలా ఆడవారిని మానసికంగా హింసించడం ఎక్కువైంది. దీనివల్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ముందుగా ఆ అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరా వుందేమో కనుక్కోండి. ఉంటే తప్పుకుండా రికార్డ్ అవుతుంది. యాక్షన్ తీసుకోవచ్చు. లేకుండా షీ టీమ్స్ వారికిగానీ, లేకుంటే మహిళా ప్రొటెక్షన్ సెల్‌కి గానీ ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు వారు మహిళా హెల్ప్‌లైన్స్ నిర్విస్తున్నారు. మీ పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదు ఆన్‌లైన్‌లో ఇవ్వవచ్చు. కొన్ని ఆధారాలు కావాలి కదా. మీరు మీ సెల్‌ఫోన్‌లో అతని చేష్టలు చిత్రీకరించే ప్రయత్నం చేయండి. లేకుంటే మీకు నమ్మకస్తులైనవారు అవి చూసేలా చేయండి. మహిళలకు అసభ్యమైన సైగలు చేసినా ఏ పదజాలం వాడినా అసభ్యమైన పాటలు  పాడినా, బూతు బొమ్మలు చూపినా, చూసేలా చేసినా, భావ ప్రకటనలు చేసినా, అసభ్యమైన హావభావాలు ప్రదర్శించినా అది నిర్భయ చట్టం కిందకు అంటే సె.354ఏ కిందకు వస్తాయి. ఒక సంవత్సరం శిక్ష, జరిమానా పడే అవకాశం వుంది.
 

మరిన్ని వార్తలు