ఆయనలో భాగమే... కొత్త ఏడాది!

31 Dec, 2016 23:41 IST|Sakshi
ఆయనలో భాగమే... కొత్త ఏడాది!

మధ్యలో పరుగులో చేరినా చివరికి మెడల్‌ సాధించాడు అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలు. ఆయన గొప్ప మేధావి, మహా వేదాంతి, కరడుగట్టిన యూదుమత ఛాందసుడు (క్రీ.శ. 5–67). క్రైస్తవ్యాన్ని కాలరాసేందుకు భీకరోద్యమాన్ని నడిపి హత్యలు, విధ్వంసాల దౌర్జన్యకాండతో యెరూషలేము ప్రాంతాన్నంతా హడలెత్తించాడు. పిదప సిరియాలో కూడా క్రైస్తవులపై దహనకాండను జరిపేందుకు వెళ్తుండగా రాజధాని దమస్కు పొలిమేరల్లో ఆకాశ దర్శనరూపంలో యేసు ఆయనకు సాక్షాత్కరించాడు. యేసు మరణించి సజీవుడయ్యాడన్న క్రైస్తవుల విశ్వాసం ఉత్త బూటకమని నమ్మే సౌలుకు యేసు సాక్షాత్కారంతో వెంటనే కనువిప్పు కలిగింది. అప్పటి నుండి పౌలుగా మారి క్రైస్తవాన్ని ప్రకటిస్తూ, చర్చిలు నిర్మించాడు. తన 62 ఏళ్ల జీవితంలో 32 ఏళ్లు దైవపరిచారకుడిగా గడిపాడు. దానికి ముందు 30 ఏళ్లు దైవ వ్యతిరేకిగా జీవించాడాయన. జీవితం చివరి సగభాగంలో పౌలు అద్భుతమైన వక్తగా, రచయితగా, మచ్చలేని విశ్వాసిగా, క్రైస్తవోద్యమ నాయకుడిగా బలమైన ముద్ర వేశాడు. తాను స్థాపించిన ఫిలిప్పీ చర్చికి రాసిన లేఖలో పౌలు తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ‘నా గతాన్నంతా వెనుకే వదిలేసి, దేవుడు నా ముందుంచిన గురివైపు దీక్షతో పరుగెత్తుతున్నా’ అంటాడు పౌలు (ఫిలిప్పీ 3:13, 14).

అపరాధాలు, అవమానాలు, వైఫల్యాలకుప్పగా ఉన్న ‘గతం’ చాలామంది దృష్టిలో ఒక గుదిబండ. పౌలుకు కూడా అలాంటి గతం ఉంది. క్రైస్తవుల్ని చంపి, చర్చిల్ని ధ్వంసం చేసిన తన గతాన్ని తలుస్తూ కృంగిపోయి, అపరాధభావనతో నిర్వీర్యంగా పౌలు తన శేషజీవితాన్ని గడపవచ్చు. కానీ దేవుడిచ్చిన వినూత్నపథంలో, గతాన్ని వదిలేసి దేవుడు పెట్టిన గురి వైపు దృష్టంతా పెట్టి జీవితం చివరి సగభాగంలో కూడా పౌలు అద్భుతంగా పరుగెత్తాడు. జీవితానికొక లక్ష్యమంటూ ఎంచుకున్నాక చివరి సగభాగాన్ని ప్రతిక్షణం విలువైనదన్నట్టు అర్థవంతంగా గడిపాడు.

ఉదాత్తమైన లక్ష్యమంటూ లేని వారికి జీవితాన్ని వ్యర్థం చేసుకునేందుకు వెయ్యి కారణాలు. కాని కాలం విలువ ఎరిగి ఒక సమున్నత లక్ష్యం కోసం జీవించే వారికి జీవితంలో ప్రతి రోజూ పండుగే! దేవుని తీర్పు సింహాసనం ముందు దోషిగా తలవంచుకు నిలబడినప్పుడు వ్యర్థం చేసుకున్న మన జీవితం విలువ అర్థమవుతుంది. దేవుని చేతికి గడియారం ఉండదు. దేవునిదంతా ఆయనతో నిండిన అనంతమైన కాలమే! అందులోని సూక్ష్మాతిసూక్ష్మమైన ఒక భాగం ఆయన మనకిచ్చిన జీవిత కాలం! దేవుని అనంత కాలంలోని ఒక ఖండమే ‘పాత ఏడాది’గా ముగిసి ‘కొత్త ఏడాది’ అనే మరో ఖండపు ముంగిట్లో నిలబెట్టింది. ఈ ఏడాదిని చివరి దాకా ఆనందంగా అనుభవించే అపురూపమైన విధానాన్ని దేవుడు వివరిస్తున్నాడు. ‘జీవితం’ అనే ఈ గొప్ప బహుమానం విలువ తెలియాలంటే ముందుగా దాన్నిచ్చిన దేవుని విలువ మనకర్థం కావాలి. ఆ దేవునిలో ఎదగడానికి ఈ ఏడాది ప్రయత్నిద్దాం. కొందరు అభాగ్యుల జీవితాల్లోనైనా ఆనందం నింపడానికి ఉన్నదాంట్లోనే కొంతైనా వెచ్చిద్దాం. పగ, కోపం, మోసం, స్వార్థం, అసూయ వంటి అమానవీయ లక్షణాలకు దూరమై ప్రేమ, క్షమాపణ, త్యాగం, నిస్వార్థం, పరోపకారం వంటి దైవిక లక్షణాలకు దగ్గరవుదాం. జీవితమంతా సౌలులా బతికినా, ఈ ఏడాది కొన్నాళ్లైనా పౌలులా బతుకుదాం. ‘నూతన సృష్టి’గా (2 కొరింథీ 5:17) ఈ లోకంపై మనదంటూ ఒక ముద్ర వేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్‌!        – రెవ. డాక్టర్‌ టి.ఎ. ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు