రిక్షాతో... ఓ రికార్డు ప్రయాణం

7 Oct, 2014 22:59 IST|Sakshi
రిక్షాతో... ఓ రికార్డు ప్రయాణం

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి కాశ్మీర్‌లోని లఢక్ ప్రాంతానికి రోడ్డు మార్గాన దూరమెంతో తెలుసా? మూడువేల కిలోమీటర్లు. నిజమే అక్షరాలా అంతే. అంతదూరాన్ని సైకిల్ రిక్షాలో ప్రయాణిస్తున్నాడో వ్యక్తి. ఆశ్చర్యపోయినా ఇది నిజం. కోల్‌కతాకు చెందిన 44 ఏళ్ల సత్యేన్‌దాస్ ఈ పనికి పూనుకున్నాడు. ప్రయాణాన్ని మొదలుపెట్టాడు కూడా.

ఈ ఏడాది జూన్ 11వ తేదీ సత్యేన్‌దాస్ ప్రయాణం కోల్‌కతా నుంచి లఢక్‌కు మొదలైంది. రిక్షా మీద అతడి రాబడి రోజుకు రెండు వందలు మించదు. అలాంటిది ఇంత ఖర్చుతోకూడిన సాహసోపేతమైన ప్రయాణం ఎలా చేస్తున్నారంటే... ‘పేదరికమే’ అంటాడతడు. ‘‘ఎనిమిదేళ్ల కిందట ఒక సారి పూరీ నగరానికి వెళ్లాలనుకున్నాను. కానీ చేతిలో డబ్బుల్లేవు. భార్యకీ, కొడుక్కీ నా రిక్షాలో అయినా సరే తీసుకెళ్తానని ఒట్టేశాను. అన్నట్లే రిక్షాలోనే తీసుకెళ్లాను. దాంతో ఎంత దూరమైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రిక్షా తొక్కగలననే ధైర్యం వచ్చింది. దాంతో ఇంత దూరం వెళ్లే సాహసం చేస్తున్నాను. నాకు లఢక్‌కు వెళ్లి రావడానికయ్యే ఖర్చులన్నీ కోల్‌కతాలోని నక్‌తాలా ప్రాంతంలోని ఆగ్రాణి క్లబ్ భరిస్తోంది. ఈ పర్యటన నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఈ ప్రయత్నమే లేకపోతే దేశంలో ఇన్ని ప్రదేశాలను చూసే అవకాశమే వచ్చేది కాదు’’ అంటున్నాడు సత్యేన్‌దాస్ సంబరంగా.

కోల్‌కతా నుంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, శ్రీనగర్, కార్గిల్ మీదుగా లఢక్‌లోని ఖర్‌దుంగా కనుమ చేరుకుని సత్యేన్‌దాస్ తన మూడు వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. సముద్రమట్టానికి 17, 582 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాల శిఖరం మీద కూర్చుని తన విజయాన్ని ఆస్వాదించాడు. ‘‘కాశ్మీర్ ప్రజలు తామింత వరకు సైకిల్ రిక్షాను చూడనేలేదన్నారు. వాళ్లకు సైకిల్‌రిక్షాను చూపించింది నేనే’’ అంటారు ఆనందంగా.

ఇంతకీ ఈ సైకిల్ రిక్షా పర్యటన ఉద్దేశం ఏమిటంటే... పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రయాణాన్ని సాగించాలని ప్రపంచానికి చాటి చెప్పడమే. ఈ సామాజికాంశంతోపాటుగా గిన్నిస్ రికార్డు సాధించే ఆలోచన కూడా ఉంది. నక్‌తాలాలోని ఆగ్రాణి క్లబ్ నిర్వహకులు పార్థో దేవ్ ఇదే విషయాన్ని చెబుతూ...‘‘అతడికి కాశ్మీర్ పర్యటన ఇది తొలిసారి కాదు. 2008లో శ్రీనగర్ వరకు సైకిల్‌రిక్షా మీద ప్రయాణించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని రొహటాంగ్ పాస్ మీదుగా కూడా ప్రయాణించాడు’’ అన్నారు.

ఈ పర్యటన కోసం అతడికి ఎనభై వేల రూపాయలు సమకూర్చింది ఆగ్రాణి క్లబ్. అలాగే అతడి ప్రతి మైలురాయిని రికార్డు చేయడానికి కెమెరా, సిబ్బందితో ఓ వాహనం కూడా అనుసరించింది. ఇన్ని సౌకర్యాలు వెంట వస్తున్నా సత్యేన్ దాస్ వాటిని వాడుకోలేదు. రాత్రి, పగలు తన సైకిల్ రిక్షా మీదనే గడిపాడు.
 
 

మరిన్ని వార్తలు