జ్ఞాన సేద్యం

17 Jun, 2017 23:42 IST|Sakshi
జ్ఞాన సేద్యం

కోసల రాజ్య రాజధాని శ్రావస్తి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసించే సుమంగళుడు నిరుపేద. పొట్ట గడవడం కూడా కష్టంగా ఉండేది. పంట చేలలోని పరిగలు ఏరుకుని జీవిస్తుండేవాడు. ఒకరోజున శ్రావస్తికి వెళ్ళాడు. అక్కడ రాజుగారు ప్రసేనుడు భిక్షువులకు ఆహార పదార్థాల్ని దానం చేయడం చూశాడు. తానూ భిక్షువుగా మారితే తిండికి ఇబ్బంది ఉండదు అనుకున్నాడు.

ఒకరోజు బుద్ధుని ప్రబోధం విని, భిక్షువుగా మారాడు. భిక్షుసంఘంలో పాటించే నియమాలు, చదువు, శిక్షణలు ఎంతో కఠినం అనిపించాయి. పట్టుమని పదిరోజులు కూడా సాధన చేయలేకపోయాడు. భిక్షువుగా జీవిస్తే ధర్మం తెలుస్తుంది. జ్ఞానం, గౌరవం కలుగుతాయి. నిజమే! కానీ సాధన చేయడమే అతి కష్టంగా తోచింది. ఈ జీవితం కంటే పాత జీవితమే సులువు అనిపించి, ఆరామాన్ని వదిలి గ్రామం దారి పట్టాడు.

మండు వేసవి, వడగాలులు, చెట్టు నీడన కూడా నిలవలేని ఎండతీవ్రత. అయినా, మండుటెండలో వరి కుప్పలు నూర్చుతున్న రైతుల్ని చూశాడు. వంటినిండా దుమ్ము, నూగు, చెమటతో తడిసి ముదై్దన శరీరాలు... వారి పరిశ్రమ చూసి ఆలోచనలో పడ్డాడు.
కష్టపడకపోతే ఫలితం దక్కదు. జ్ఞానార్జన కూడా వ్యవసాయమే అనుకుని వెనుదిరిగి ఆరామానికి వెళ్లాడు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు. అతి తక్కువ కాలంలో మంచి భిక్షువుగా, జ్ఞానిగా పేరుపొందాడు. – డా. బొర్రా గోవర్దన్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు