-

ఒక థ్రిల్లింగ్ ప్రయాణం

16 Jun, 2016 08:43 IST|Sakshi
ఒక థ్రిల్లింగ్ ప్రయాణం

 హాలీవుడ్ రొమాంటిక్ థ్రిల్లర్ / ది టూరిస్ట్

జనూస్ - రెండు తలల దేవుడు. రోమన్లు ప్రాచీన కాలంలో ఆరాధించిన ఈ దేవుడు పేరు మీదగానే జనవరి నెలకి నామకరణం చేశారంటారు. ఈ రెండు తలలకు రకరకాల అర్థాలు చెబుతారు. ఒక ముఖం - ఆరంభం; మరొకటి - అంతం. ఒకటి - గతం; రెండోది - భవిష్యత్. ఒకటి -యుద్ధం, మరొకటి - శాంతి. ‘ది టూరిస్ట్’ సినిమాలో హీరోయిన్ ఎల్సీ (ఏంజెలినా జోలీ) జునూస్ రూపు ఉన్న బ్రాస్‌లెట్ చేతికి ధరిస్తుంది. దేవుడు జునూసే కాదు - ప్రతి మనిషికి రెండు ముఖాలుంటాయి. ఒకటి - మంచి, ఇంకొకటి - చెడు. అలాగే ఒకటి - కనుమరుగైన గతం, మరొకటి - కనురెప్ప విప్పబోతున్న భవిష్యత్. ఎవరన్నా ఓ వ్యక్తిని కోరుకుంటే -  తప్పదు. ఆ రెండు ముఖాల్ని స్వీకరించాలి. అలాంటి సమస్య ఎల్సీకి ఎదురైంది.

  ఫ్లోరియన్ హెంకెల్ వాన్ డోనర్స్‌మర్క్ - ఇంత పొడుగు పేరున్న ఈ జర్మన్ దర్శకుడు ఇంగ్లీష్, జర్మన్, రష్యన్, ఫ్రెంచ్, ఇటాలియన్ - అయిదు భాషల్లో ప్రావీణ్యుడు. డెరైక్షన్ మీద ఆసక్తితో యూనివర్సిటీలో శిక్షణ పొందాడు. 2005లో  ‘ది లైఫ్ ఆఫ్ అదర్స్’ అనే సినిమా తీసిన తర్వాత - ఆత్మహత్యల మీద ఓ డార్క్ సినిమా తీద్దామని స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు. అటువంటి సమయంలో ‘ఆంధోని జిమ్మర్’ అనే ఫ్రెంచ్ సినిమా చూశాడు. హిచ్‌కాక్ స్క్రీన్‌ప్లేని తలదన్నేలా ఊహించని మలుపులతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ అది.


‘ఆంథోని జిమ్మర్’ రీమేక్ చేస్తే బాగుంటుందనుకున్నాడు. కాని నిర్మాణ సంస్థ ఇతర దర్శకులతో సినిమా చేద్దామనుకుంది. ఒక దశలో డెరైక్టర్‌గా హెంకెల్, హీరోయిన్ ఏంజెలినా జోలీ ఫైనలైజ్ అయ్యాక - ‘సృజనాత్మక విభేదాలు’ ఏర్పడడంతో హెంకెల్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

 
కాని కొన్ని కథలు కొందరికి రాసిపెట్టి ఉంటాయి. అలా హెంకెల్‌కి ‘ది టూరిస్ట్’ సినిమా డెరైక్ట్ చేసే అవకాశం దొరికింది. రెండు వారాల్లో స్క్రిప్ట్, తోటి రచయితలతో కలిసి రాశాడు హెంకెల్. 58 రోజుల్లో మొత్తం సినిమా షూట్ చేశాడు. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తి కావడానికి హీరో జానీడెప్ ప్రధాన కారణం.

  

ఇంతకీ కథేమిటంటే -
అలెగ్జాండర్ పియర్స్ పేరుమోసిన ఓ వైట్‌కాలర్ క్రిమినల్. (హీరో పాత్రకి ఈ పేరు పెట్టడానికి ఓ కారణముంది - అలెగ్జాండర్ పియర్స్ అనే అతను పేరుమోసిన క్రిమినల్. జైలు నుంచి పారిపోయే ప్రయత్నంలో నరమాంస భక్షకుడిగా మారిపోయాడు. (ఇతని మీద ‘ది లాస్ట్ కన్‌ఫెషన్ ఆఫ్ అలెగ్జాండర్ పీర్స్’ అనే సినిమా కూడా వచ్చింది.) మన ‘టూరిస్ట్’లో అలెగ్జాండర్ విషయానికొస్తే - ప్రముఖ కంపెనీల్లోని అవకతవకలని ఆధారం చేసుకుని - కొన్ని వేల కోట్ల రూపాయలు మోసం చేసి సంపాదిస్తాడు. ఒకవైపు ఎఫ్‌బిఐ, మరోవైపు రష్యన్ మాఫియా అతనికోసం వెదుకుతుంటారు. వాళ్లకి అలెగ్జాండర్ కావాలి. అంతకన్నా మించి అతను దాచిన ఆ డబ్బు కావాలి కాని అలెగ్జాండర్‌ని పట్టుకోవడం కష్టం. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీతో తన రూపురేఖలు మార్చేసుకున్నాడు. ఎక్కడో రహస్యంగా ఉన్న అతణ్ణి బయటికి తీసుకొచ్చే ఒకే ఒక్క సాధనం - అలెగ్జాండర్ ప్రియురాలు ఎల్సీ.


ఆమె తన ప్రియుడు ఎక్కడున్నాడు, ఏమైపోయాడని ఎదురుచూస్తోంది. పోలీసులు ఎల్సీ ప్రతి కదలికను గమనిస్తున్నారు. అలెగ్జాండర్ శత్రువుల వ్యూహం ముందే పసిగట్టాడు. ఎల్సీకి ఓరోజు అలెగ్జాండర్ నుంచి లెటర్ వచ్చింది. తను ఇప్పుడెలా ఉన్నాడో ఎవరికీ తెలియదు కాబట్టి - ఎల్సీ ఎవరో ఒక అమాయకుడ్ని పట్టి, వలలోవేసి, పోలీసుల దృష్టిలో అతనే అలెగ్జాండర్‌గా నమ్మించాలి. పోలీసులు అతణ్ణి పట్టుకున్నా, అరెస్ట్ చేసినా, చంపేసినా - అలెగ్జాండర్‌కి బాధ లేదు, ఎల్సీకి బాధ లేదు. గేమ్ స్టార్టయ్యింది. ఎల్సీకి ట్రైన్‌లో ఓ మతగురువు ప్రొఫెసర్ పరిచయమయ్యాడు. అతడే అలెగ్జాండర్‌గా.. తన వెంటబడుతున్నాడని వారిని నమ్మించాలి. కాని ఆ ప్రొఫెసర్ (జానీ డెప్) నిజంగానే ఎల్సీ ప్రేమలో పడ్డాడు. పోలీసులు, రష్యన్ మాఫియా చేతుల్లో అతనికి ప్రాణాలు పోయేంత ప్రమాదం ఏర్పడింది. ఎల్సీకి అతని మీద జాలి కలిగింది. ఎల్సీకి కూడా అలెగ్జాండర్ కావాలి. ఎందుకంటే ఎల్సీ అలెగ్జాండర్ ప్రియురాలు మాత్రమే కాదు, అతడ్ని పట్టుకోవడానికి వచ్చిన ఎఫ్.బి.ఐ. ఏజెంట్. చివరికి అలెగ్జాండర్ ఎక్కడున్నాడు - ప్రొఫెసర్ పరిస్థితి ఏమవుతుంది - ఈ ఆర్టికల్‌లో రాస్తే ఆ థ్రిల్ పోతుంది. ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది.

 - తోట ప్రసాద్

మరిన్ని వార్తలు