కబీ కభీ మేరే దిల్ మే...

22 Jul, 2014 10:58 IST|Sakshi
కబీ కభీ మేరే దిల్ మే...

 సందర్భం: నేడు ముఖేష్ కుమార్ జయంతి
 
సంవత్సరం సరిగ్గా గుర్తు లేదుగానీ, నా మిత్రుడు మోతీలాల్,  ముఖేష్‌ను నాకు పరిచయం చేస్తూ ‘‘ఈ కుర్రాడిని నీకు అప్పగిస్తున్నాను. మంచి పాటగాడు. నువ్వు తీర్చిదిద్దితే వృద్ధిలోకి వస్తాడు’’ అని చెప్పాడు. సంగీతంలో తర్ఫీదు పొందని గొంతు అతనిది. అయినప్పటికీ చక్కగా ఉంది.  కొన్ని నెలల తరువాత ఒక సినిమాలో ‘భాయి బంజారే’ అనే పాట పాడడానికి అవకాశం ఇచ్చాను.

శాస్త్రీయత, బెంగాలీ శైలి మిళితమైన నా పాటలు  ముఖేష్‌కు  పూర్తిగా కొత్త.  ఈ కారణం వల్లే పాడడానికి ఇబ్బంది పడి ఉంటాడు. మరో వైపు నిర్మాత మెహబూబ్ ఖాన్ ‘‘పాట త్వరగా పూర్తి చేయండి’’ అని  ఒత్తిడి తెస్తున్నాడు. అతని కోసం ఆ   పాటను నేను పాడక తప్పలేదు. పాట రికార్డింగ్ తరువాత ముఖేష్ అన్నాడు ‘‘దాదా!...ఈ పాట మీరు తప్ప ఎవరూ పాడలేరు. మీ పాట పాడే అదృష్టం నాకు ఉందో లేదో’’ అని. ఆ క్షణంలో అతడిని చూస్తే.... అకస్మాత్తుగా  తన చేతుల్లో నుంచి ఆడుకుంటున్న బొమ్మను కోల్పోయి దీనంగా చూస్తున్న పసిపిల్లాడు  గుర్తుకు వచ్చాడు. బాధగా అనిపించింది.
 
ప్రతిభ ఎన్ని రోజులని దాగుతుంది? కాలక్రమంలో నా పాటలే కాదు...ఎందరో సంగీత దర్శకుల దగ్గర పాడాడు. ‘రాజ్‌కపూర్‌కు ముఖేష్ గొంతు అయితేనే సరిపోతుంది’ అనిపించుకున్నాడు. సైగల్ స్థాయిలో భావోద్వేగాలు ప్రతిఫలించే పాటలెన్నో పాడాడు.  తాను నడిచొచ్చిన దారిలో సహాయపడిన వ్యక్తులను గుర్తు పెట్టుకోవడం... ముఖేష్‌లో ఉన్న గొప్ప లక్షణం.

‘‘ఈయన లేకపోతే ముఖేష్ అనే వాడు లేడు’’ అని ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఒక పెద్దమనిషికి నన్ను పరిచయం చేసినా, మోతీలాల్ అనారోగ్యం కారణంగా ఆగిపోయిన అతని సొంత చిత్రం ‘ఛోటీ ఛోటీ బాతే’కు సంబంధించిన నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకున్నా... తాను అభిమానించే వ్యక్తుల కోసం తపించే నైజం ఆయనకే సొంతం.

1923 జూలై 22వ తేదీన ఢిల్లీలో పుట్టిన ముకేష్ కుమార్.. అమెరికాలోని డెట్రాయిట్లో ఉండగా 1976 ఆగస్టు 27న మరణించారు. చనిపోయే వరకు ఆయన గళం సుస్వరాలను పలికిస్తూనే ఉంది.
 
- ప్రముఖ సంగీత దర్శకుడు అనిల్ బిస్వాస్ జ్ఞాపకాలలో నుంచి...

మరిన్ని వార్తలు