భంగపడ్డ బెస్తవాడు

14 Feb, 2015 23:14 IST|Sakshi
భంగపడ్డ బెస్తవాడు

ఒక ఊరిలో గోపీనాథ్ అనే బెస్తవాడు ఉండేవాడు.  అతను చాలా పిసినిగొట్టు. ఒకరోజు అతను ‘అడవిలో ఒక చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఉన్నాయి’ అనే విషయం విన్నాడు. ఆ మరునాడు ఎవ్వరికీ చెప్పకుండా తెల్లవారక ముందే బండి తోలుకుని అడవికి వెళ్ళాడు, దేవుడా ఇంకెవరూ ఆ చెరువు దగ్గరకు రాకూడదు. నా ఒక్కడికే బోలెడన్నీ  చేపలు దొరకాలి అని దారంతా ప్రార్థిస్తూనే ఉన్నాడు. రెండు గంటల ప్రయాణం తర్వాత గోపీనాథ్ చెరువు దగ్గరకు చేరుకున్నాడు. ఆ చెరువులో వందలాది చేపలు ఉన్నాయి.
 గోపీనాథ్ ఆనందానికి అంతేలేదు. వెంటనే బండిలోంచి వల తీసి చెరువులోకి విసిరాడు. మధ్యాహ్నం అయ్యేసరికి తన దగ్గరున్న బుట్టల నిండా చేపలు పట్టాడు. ‘ఈ రోజు నా పంట పండింది. ఈ చేపలు సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటే ఎంతో డబ్బు వస్తుంది’ అనుకుంటూ ఆనందంగా తిరుగు ప్రయాణం అయ్యాడు.

దారిలో ఒక గుంటనక్క చేపల వాసన పసికట్టింది. దానికి ఎన్నో రోజుల నుండి చేపలు తినాలని ఉంది. అయితే చెరువులో చేపలు పట్టుకోవడం చేతకాకపోవడంతో దాని కోరిక తీరలేదు. దాంతో చెట్టు చాటు నుండి గోపీనాథ్ ప్రయాణిస్తున్న బండిని నక్కి నక్కి చూసింది. చేపలను ఎలా తస్కరించాలా అని చాలాసేవు ఆలోచించింది. చివరకు ఆ నక్కకు ఒక గొప్ప ఉపాయం తట్టింది. వెంటనే అడ్డతోవన పరుగెత్తి, గోపీనాథ్ వస్తున్న దారిలో నేలమీద వెల్లకిలా పడిపోయింది.

 దారికి అడ్డంగా పడున్న నక్కను చూసాడు గోపీనాథ్. ‘ఆహా ఏమీ నా అదృష్టం! ఈ నక్క చర్మాన్ని సంతలో అమ్ముకుంటే చాలా ధనం వస్తుంది’ అనుకుంటూ నక్కను ఎత్తి బండిలో వేసుకుని, తిరిగి బండిని తోలసాగాడు. కొద్దిదూరం వెళ్ళాక నక్క నెమ్మదిగా లేచి చేపలు తినటం మొదలెట్టింది. దాని కడుపు  నిండాక ఒక్కొక్క చేపను నేలమీద జారవిడవసాగింది.

 అలా బండిలో ఉన్న బుట్టలన్నీ ఖాళీ అయ్యాక నిశ్శబ్దంగా బండి దిగి అడవిలోకి పారిపోయింది నక్క. గోపీనాథ్ సంతకు చేరుకుని వెనక్కు తిరిగి చూస్తే అక్కడ ఇంకేం ఉంది? చేపలూ లేవు. నక్కా లేదు. దాంతో పెద్ద పెట్టున రోదించాడు. ఆ సమయంలో నక్క తన స్నేహితులతో చేపల విందు చేసుకోసాగింది. దాని తెలివితేటలకు మిగతా నక్కలన్నీ ఎంతో మెచ్చుకున్నాయి.
 నీతి: దురాశ దుఃఖానికి చేటు

మరిన్ని వార్తలు