కడుపునొప్పి... అది 24 గంటల నొప్పేనా?

8 Dec, 2015 23:19 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. నిల్చునే సమయంలో, నడిచే సమయంలో తల తిరిగినట్లు అయి పడిపోతానేమో అని ఆందోళనగా ఉంటోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి. హోమియోపతిలో చికిత్స ఉందా?
 - లక్ష్మి, ఖమ్మం

 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు బహుశా ‘వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలేచినప్పుడు గానీ, నడుస్తున్నప్పుడు గానీ ఉన్నట్టుండి తలతిరగడం, తద్వారా పడిపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలుంటే ఆ సమస్యను ‘వర్టిగో’ అంటారు.దాదాపు 20 శాతం నుంచి 30 శాతం వరకు ఈ సమస్య ఉంటుంది. ఇది ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... పెరిఫెరల్, సెంట్రల్, ఇతర కారణాలతో వచ్చే వర్టిగో.

పెరిఫెరల్ వర్టిగో: ఈ సమస్య ఉన్నవారిలో తల తిరగడానికి కారణం మూలాలు చెవి లోపలి భాగంలో ఉంటాయి. చెవిలో వెస్టిబ్యులార్ సిస్టమ్ అనే భాగం ఉంటుంది. ఇది శరీరాన్ని అదుపు తప్పకుండా కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పెరిఫెరల్ వర్టిగో సమస్య వచ్చినప్పుడు తల తిరగడం సమస్య మొదలవుతుంది. శరీరం అదుపు తప్పడం, ముందుకు తూలడం జరగవచ్చు. బైక్ నడుపుతున్నప్పుడు ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
 
సెంట్రల్ వర్టిగో: కొన్నిసార్లు తలతిరగడానికి మెదడులోని సమస్యలు, నాడీమండల సమస్యలు కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల తలతిరుగుతుంటే దాన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. ఇతర కారణాలతో వచ్చే వర్టిగో: రక్తహీనత, రక్తపోటు ఎక్కువగా లేదా తక్కువగా  ఉండటం, జ్వరం, తీవ్రమైన వ్యాధుల బారిన పడిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.
 
కారణాలు:  మెదడులో కణితులు, మెదడులో రక్తం గడ్డకట్టడం  సర్వైకల్ స్పాండిలోసిస్, పార్కిన్‌సోనిజమ్, నరాల బలహీనతల వంటివి దీనికి కారణమవుతాయి  చేతులు లాగడం, తిమ్మిర్లు కూడా దీనికి దోహదం చేస్తాయి.
 
లక్షణాలు: వికారం, తలనొప్పి, చెమటలు పట్టడం, వినికిడి సమస్యలు, నిద్రలేవగానే లేదా నడుస్తున్నప్పుడు, ముందుకు వంగి పనిచేస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్లు తిరగడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
 
నిర్ధారణ: సీటీస్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్‌రే, ఆడియోమెట్రీ, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేస్తారు.
 
చికిత్స: హోమియోలో బెల్లడోనా, జెల్సీమియమ్, చైనా, కాకుసల్ ఇండికస్, కోనియమ్, బ్రయోనియా, పల్సటిల్సా, ఆర్సెనికా వంటి మందులు సమర్థంగా పనిచేస్తాయి.
 - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
 ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్.

 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. ఐదేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. అయితే రుతుక్రమం తగ్గిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని చదివాను. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎక్స్‌రే తీయించి ఆస్టిపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది.
 - పద్మ, కోదాడ
 
క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు.

దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం.

ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటివి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే  మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు. ఇక ముందుగా మీకు స్పష్టం చేయాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్‌ను ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ చేయడం జరగదు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్‌ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి.
- డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
 చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్.
 
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఇటీవల మా అబ్బాయికి తరచూ కడుపునొప్పి వస్తోంది. రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటే దానంతట అదే తగ్గిపోతుంటుంది. సాధారణ నొప్పే కదా తగ్గిపోతుందిలే అని అంతగా పట్టించుకోలేదు. నొప్పి మళ్లీ మళ్లీ వస్తోంది. మా ఊళ్లో డాక్టర్‌కు చూపిస్తే ’కొన్ని మందులు వాడితే తగ్గిపోతుంద’ని రాసిచ్చారు. మాకు తెలిసిన వారు అది ఒక్కోసారి ప్రాణాంతకమైన 24 గంటల నొప్పికి దారితీయవచ్చేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు 24 గంటల నొప్పి అంటే ఏమిటి? మా అబ్బాయికి కడుపునొప్పి ఎందుకు వస్తోంది?  దయచేసి వివరాలు చెప్పండి.  
 - ఝాన్సీ, శృంగవరపుకోట
 
కడుపునొప్పిని చాలా కారణాలు ఉంటాయి. ప్రతి కడుపునొప్పీ అపెండిసైటిస్ (24 గంటల నొప్పి) కాదు. మీరు ముందుగా వైద్య నిపుణులను సంప్రదించి, మీ అబ్బాయికి అసలు కడుపునొప్పి ఎందుకు వస్తోందో ముందుగా నిర్ధారణ చేయాలి. దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.
 
ఇక మీరు పేర్కొన్న 24 గంటల నొప్పి (అపెండిసైటిస్)లో అకస్మాత్తుగా బొడ్డు చుట్టూ నొప్పి వస్తూ అది పొట్ట కింది భాగానికి వ్యాపిస్తూ ఉంటుంది. దాంతో పాటు వాంతులు కావడం, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అపెండిసైటిస్ ఉంటే వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేయడం మంచిది కాదు. కడుపులో చిన్నపేగు, పెద్దపేగు కలిసే చోట చిన్న ట్యూబ్ ఆకారంలో అపెండిసైటిస్ ఉంటుంది. అందులోకి ఏవైనా మలిన పదార్థాలు, రాళ్లు, పురుగులు చేరితే అకస్మాత్తుగా ఈ నొప్పి వస్తుంది.

అపెండిసైటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కెటారల్ అపెండిసైటిస్, రెండోది అబ్‌స్ట్రక్టివ్ అపెండిసైటిస్. కెటారల్ అపెండిసైటిస్‌ను మందులతో నయం చేయవచ్చు. అబ్‌స్ట్రక్టివ్ అపెండిసైటిస్‌కు మాత్రం శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక శస్త్రచికిత్సలలో కీ-హోల్ ప్రక్రియ ద్వారా తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయవచ్చు.

వైద్య పరీక్షల ద్వారా అది ఏ రకం అనేది నిర్ధారణ చేశాకే అపెండిసైటిస్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అపెండిసైటిస్ ఉండి, చికిత్స ఆలస్యం అయితే అది పగిలి పొట్టలోకి ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే అలా బొడ్డుచుట్టూ నొప్పి వస్తూ కిందికి పాకుతుంటే అత్యవసరంగా డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతుంటారు.
 - డాక్టర్ టి.ఎల్.వి.డి. ప్రసాద్‌బాబు
 సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ .

మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com
నిర్వహణ: యాసీన్

మరిన్ని వార్తలు