సిన్మా అయితే ఓ.కే.... శ్రీహరికోటా....అదేంటి!!!

15 Jul, 2018 00:41 IST|Sakshi

ఒక సినిమా విడుదలైతే దానిగురించి తెరముందు, తెరవెనుక జరిగిన విషయాలన్నీ సమస్తం చెప్పగలిగిన నేటి యువతరంలో శ్రీహరికోటనుంచి ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాలలో ఏ ఒక్కదాన్ని గురించి అయినా స్పష్టంగా చెప్పగలవారెందరున్నారు? అలాగే సాటిమనిషి బాగోగుల గురించి తాపత్రయపడిన మహానుభావుల జీవితాలు ఎలా సాగాయో తెలుసుకుని వాటినుంచి ఎంతమంది స్ఫూర్తి పొందుతున్నారు? ఇవి నావి కావు... యువతరం గురించి కలాంగారి ఆవేదనాభరిత ప్రశ్నలు అవి.

అత్యంత భయంకరమైన క్యాన్సర్‌ వ్యాథికి ఔషధం కనుక్కున్న మేడమ్‌ క్యూరీ పోలండ్‌లో పుట్టింది. చిన్నతనంలో తల్లి చనిపోయింది. తండ్రి ఫిజిక్స్‌ పాఠాలు చెప్పేవాడు. ఇంగ్లీష్‌ చదువులకు ఆమెను ప్యారిస్‌ పంపాడు. డబ్బుపెట్టి మంచి గది తీసుకోలేక ఎముకలు కొరికే చలిలో ఒక చిన్న పూరిపాకలో ఉంటూ చదువుకునేది. డబ్బుచాలక రొట్టె నీళ్ళలో ముంచుకు తినేది. ట్యూషన్లు చెబుతూ, ఇంగ్లీష్‌లో యూనివర్శిటీ ఫస్ట్‌ వచ్చింది. ఇంగ్లీష్‌ ఎం.ఎ చేసి కూడా తండ్రి సూచన మేరకు మళ్ళీ ఫిజిక్స్‌ మొదలు పెట్టింది.

పూరిపాకనే ప్రయోగశాలగా మార్చుకుని అలా చదువు కొనసాగిస్తుండగా ప్రేమ ప్రయత్నంలో మోసపోయి ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయింది. తరువాత తాను నిలదొక్కుకుని నిబ్బరంగా ఆలోచించి..‘‘ఒక చిన్న దెబ్బ తగిలితే ఆత్మహత్యా? నాకోసం తపిస్తున్న నా తండ్రి నా తోడబుట్టిన వాళ్ళు... వారిపట్ల నాబాధ్యత ఇదేనా’’ అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ‘‘...కాదు, కాదు... ఎక్కడ కింద పడ్డానో అక్కడే పైకి లేవాలి. నాకు జరిగిన మోసాన్ని ఒక పీడకలగా మర్చిపోవాలి’ అని దృఢంగా నిశ్చయించుకుంది.

తన శక్తిని మొత్తాన్నీ ఫిజిక్స్‌ మీద పెట్టింది. మళ్ళీ వివాహం చేసుకుని గర్భిణీ అయి ఉండి కూడా, భర్తతో కలిసి శాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసాల పరంపర కొనసాగిస్తూ, క్యాన్సర్‌కు చికిత్స చేయతగిన మూలకాన్ని కనిపెట్టి యురేనియం అని ధ్వనించేటట్లుగా తన మాతృదేశంపేరుని జోడించి ‘పొలేరియం’ అని పేరుపెట్టి తన దేశభక్తి చాటుకుంది. ఆమెచేసిన కృషికి గుర్తింపు లభించి ‘నోబెల్‌ బహుమతి’ లభించింది. ఆమెతో కలిసి పనిచేసినందుకు ఆమె భర్తకు, ఆమె గురువుకు మరో రెండు నోబెల్‌ బహుమతులొచ్చాయి. దానితో బాగా ఐశ్వర్యం కూడా వచ్చింది.

ఆ సంతోషం ఎక్కువకాలం నిలవకుండానే తండ్రి చనిపోయాడు... మరికొద్ది రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో భర్త కూడా చనిపోయాడు. అప్పటికి ఆమె వయసు 40 దాటలేదు. క్యాన్సర్‌కు ఔషధం కనిపెట్టడానికి రోజుకు 18 గంటలు కష్టపడి ఆరోగ్యాన్ని ఎంతగా త్యాగం చేసేసిందంటే.. ఆమెకే  బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చింది.అయినా ఆమె వెరవలేదు. ఆ పరుగు,  ఆ పట్టుదల, ఆ కసి ఆగలేదు...ఈ సారి కెమిస్ట్రీలో మరొక ‘నోబెల్‌’ బహుమతి తెచ్చుకుంది. ఆమె దార్శనికత వలన ఆమె కూతురికి, అల్లుడికి కూడా మరో రెండు నోబెల్‌ బహుమతులొచ్చాయి. అంటే ఆమె ఒక్కతే ఆరు నోబెల్‌ బహుమతులకు కారణమయింది.

ఆమే తన పరిశోధనలకు పేటెంట్‌ తీసుకుని ఉంటే తదనంతరకాలంలో ఆమె వంశీకులకు బిల్‌గేట్స్‌ కన్నా వెయ్యిరెట్ల ఐశ్వర్యం వచ్చి ఉండేది. కానీ ‘‘అది భూమిలోంచి వచ్చింది, ప్రకృతి ఇచ్చింది. అది ప్రజలకు అందాలి. ఆ పేటెంట్‌ తీసుకోవడానికి నేనెవర్ని. నాకు అక్కరలేదు.’’ అని చెప్పేసింది. చివరగా తను కోరుకున్నదేమిటంటే తన సమాధిలో పిడికెడు మట్టి...అదీ తన జన్మభూమినుంచి తెచ్చి చల్లాలని కోరుకుంది.ఎవరి జీవితాలూ వడ్డించిన విస్తళ్ళు కావు. గులాబీ పువ్వు కింద ముళ్ళు చూసి భయపడిన వాడు జీవితంలో అక్కడే ఉంటాడు. ఆ పువ్వు సౌందర్యాన్ని, సౌరభాన్ని చూడాలనుకున్నవాడు ముందుకే అడుగేస్తాడు.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు