నీకిచ్చిన మాటమీదే నిలబడ్డానమ్మా...

9 Sep, 2018 01:31 IST|Sakshi

‘‘నేను నా కుటుంబంలో, సమకాలీన సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఒక మంచిసభ్యుడిగా ఉంటాను’’ అనేది అబ్దుల్‌ కలాం విద్యార్థులచేత చేయించిన మూడవ ప్రతిజ్ఞ. ‘‘ఇతను మాకు చాలా విలువైన, గొప్ప సభ్యుడు లేదా సభ్యురాలు’’ అని మొట్టమొదట సంతోషించాల్సింది మన కుటుంబమే. ‘ ఈ పిల్ల లేదా పిల్లవాడు మా కొడుకు’’ అని మొదట తల్లిదండ్రులు పరవశించిపోవాలి. అలా వారు సంతోషించడానికి మీరు అన్నివేళలా మీ పరీక్షల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. ‘‘మా పిల్లలు అబద్ధమాడరు. పవిత్ర హృదయంతో ఉంటారు. ఒక లక్ష్యం పెట్టుకుని, చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు. ఒకరిని పాడుచేసే లక్షణం మా పిల్లలకు ఎప్పుడూ లేదు’’అని తల్లిదండ్రులు గర్వంగా ప్రకటించుకోగలగాలి. పిల్లలు ఆ విశ్వాసాన్ని వారికి కలిగించాలి.

రామాయణంలో రామచంద్రమూర్తిని చూసి తల్లి సంతోషించింది. తండ్రి మురిసి పోయాడు. ‘మా అన్నయ్య ఇంత గొప్పవాడు’ అని తమ్ముళ్ళు పొంగిపోయారు.. ‘రాముడు మా రాజు’ అని చెప్పుకుని ప్రజలు ఆనందపడ్డారు. రాముడు గుహుడితో అంత ప్రేమతో ప్రవర్తించబట్టే ‘రాముడు నా స్నేహితుడు’ అని ఆయన సంతోషపడిపోయాడు. విభీషణుడు రాక్షసుడు, సుగ్రీవుడు వానరుడు. అలాగే ఋషులు...పండితులు, విద్వాంసులు, మంత్రులు... ఇలా రాముడు ఎక్కడుంటే అక్కడి వారందరూ సంతోషించారు.

కలాం చదువుకుంటున్న రోజుల్లో మద్రాస్‌లోని ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో చదువుకునే అవకాశం వచ్చింది. ఫీజుకట్టడానికి డబ్బుల్లేవు. ఆయన సోదరి జోహ్రా తన గాజులు, గొలుసులు తాకట్టుపెట్టి డబ్బిచ్చింది. కష్టపడి సంపాదించి తాకట్టు నగలు విడిపిస్తానని ఆమెకు మాటిచ్చాడు. కళాశాలలో ప్రవేశించిన తరువాత తన మాట నిలబెట్టుకోవడానికి చాలాకాలం పడుతుందేమోనని అనుమానించి స్కాలర్‌ షిప్‌ కోసమని– ‘చదువు’ అన్న మూడక్షరాలు తప్ప నాలుగో అక్షరంతో సంబంధం లేకుండా చదివాడు. అదొక ఉపాసన. అలా కష్టపడ్డాడు. ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ అన్న పుస్తకం విద్యార్థులు తప్పక చదవాల్సిన పుస్తకం. దానిలో ఆయన ఇవన్నీ వివరించాడు. ఆయన కష్టపడడాన్ని చూసి ఆచార్యులు సయితం ఆశ్చర్యపోయారట. అంటే.. ఇంత సంస్కారం, ఇంత క్రమశిక్షణ ఎలా సాధ్యం ?

మీరు మీ కుటుంబంలో మంచి సభ్యుడయితే మీ చుట్టుపక్కల వాళ్ళని, మీరుంటున్న సమాజాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. కలాం బాల్యంలో ఒకరోజు  వాళ్ళ అమ్మ రొట్టెలు చేసిపెడుతుంటే అవి కమ్మగా ఉన్నాయని అన్నీ తినేసారు. వాళ్ళ అన్నయ్య ‘బుద్ధి ఉందా నీకు, అమ్మకు కూడా లేకుండా అన్నీ తినేసావు..’ అని కోప్పడితే అమ్మకు లేకుండా తిన్నానన్న బాధకొద్దీ కలాం కళ్ళవెంట నీళ్ళు ధారగా కారిపోతున్నాయి. అది చూసి జాలిపడిన అమ్మ కలాంను దగ్గరకు తీసుకుని ‘‘నేను తినాల్సినవి నీవు తిన్నావని బెంగపెట్టుకోకు. నీ కన్నతల్లిగా నేనే కాదు, ఈ దేశమాత కూడా గర్వపడేవిధంగా నీవు ఉత్తమ పౌరుడివి కావాలి’’ అంటూ బుజ్జగించింది.

ఈ పుస్తకం ఉపోద్ఘాతంలో కలాం – ‘‘నేను ఈ లోకం వదిలిపెట్టిన తరువాత నీవు ఏ లోకంలో ఉన్నా మొదట వచ్చి నీకే నమస్కరించి.. అమ్మా! నీకు మాటిచ్చినట్లే నా ఆఖరిశ్వాస వరకూ బతికాను..అని చెబుతాను’’–అని రాసుకున్నారు.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు