మూడుముడులకు నారుమడులు

12 Dec, 2016 14:47 IST|Sakshi
మూడుముడులకు నారుమడులు

పెళ్లి వేడుకల కోసం మనసు విహంగంలా విహరించినా కాళ్లు నేలపైనే ఉండాలనే విషయాన్ని గుర్తించి నిరాడంబర వివాహాలకు మొగ్గు చూపుతోంది ఈ తరం. సాదాసీదాగా పెళ్లి చేసుకొని  పొదుపు చేసిన సొమ్ముతో మరో పది కుటుంబాల్లో వెలుగులు నింపాలనే నవతరం దంపతుల ఆదర్శం ఆ పెళ్లిళ్లకే కొత్త కళను చేకూరుస్తోంది! అలా రైతుల ఇంటి సంతోషాల నారు వేసిన ఓ జంట కథ ఇది.
 
వరుడు అభయ్. వధువు ప్రీతి కుంభారే. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో వారి మధ్య ప్రేమ మొగ్గ తొడి గింది. నాగపూర్‌లో ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌గా అభయ్‌కు, ముంబై  ఐడీబీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ప్రీతికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రీతి స్వస్థలం మహారాష్ట్రలోని యావత్‌మాల్. అభయ్ స్వస్థలం అదే రాష్ట్రంలో ఉన్న అమరావతి పరిధి లోని ఓ గ్రామం. ఈ రెండూ కూడా రైతు ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రాంతాలు. ఈ వధూవరులు తమ పెళ్లి ఖర్చుల కోసం దాచుకున్న సొమ్ముతో ఆత్మహత్యలు చేసుకున్న ఆయా గ్రామాల రైతు కుటుంబాలకు  సహాయపడాలనుకున్నారు. అందుకోసం నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటామని కుటుంబ సభ్యులను కోరారు. ఇరువైపులా కుటుంబాలు సంతోషించటమే గాక రైతు కుటుంబాలను పెళ్లికి ఆహ్వానించే బాధ్యతను తీసుకున్నారు.
 
మంత్రఘోష లేదు.. మంగళ వాద్యాలు లేవు
సంప్రదాయాన్ని పక్కనబెట్టి అమరావతిలోని అభియంతా భవన్‌లో ఈ జంట ఒకటయ్యారు. అక్కడ పెళ్లి వాతావరణం మచ్చుకైనా కనిపించ  లేదు. బాజా భజంత్రీలు లేవు. పెళ్లి తర్వాత పడవ కారులో ఊరేగింపులు, టపాసులు మోత, తీన్‌మార్ దరువుల ఊసే లేదు. వంటల ఘుమఘుమలు, నోరూరించే పిండి వంటలు లేనే లేవు. చపాతి, అన్నం, పప్పు, కూరలు వంటి సామాన్య భోజనంతో అతిథులను సంతృప్తిపరచారు. రివాజుగా వచ్చే ఆచారాలు, సంప్రదాయాలను దరిచేరనివ్వలేదు. వేదికపైనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల గురించి వివరించే వివిధ రకాల గోడచిత్రాలు, బ్యానర్లను వేదికనిండా అతికించారు. పెళ్లిలో రైతు నాయకులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా ముందువరుసలో కొలువు తీరారు.
 
పది రైతు కుటుంబాలకు తలా 20 వేలు
కొండలా పేరుకుపోయిన అప్పులు, వరుస పంట నష్టాలతో తనువు చాలించటంతో అండదండలు కోల్పోయిన 10 మంది రైతుల కుటుంబాలకు తలా రూ. 20 వేల చొప్పున ఇచ్చారు ఈ దంపతులు. వారి పిల్లలను ఇంటర్మీడియట్ వరకు పిల్లలను చదివించే బాధ్యతను కూడా తీసుకున్నారు. దీంతోపాటు అభయ్ స్వగ్రామం ఉమ్‌బర్దా బజార్ లోని ఐదు లైబ్రరీలకు రూ. 52 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను ఇచ్చారు. తమ జీతాల్లోంచి పెళ్లి కోసమని దాచుకున్న డబ్బును దీనికోసం వాడారు. చంద్రకాంత్ వాంఖేడే, అర్జున్ థోసరే లాంటి  రైతు నాయకులు రైతుల ఆత్మహత్యలపై చేసిన ప్రసంగాలు అతిథులను కంటతడి పెట్టించాయి.

ఎన్నో పెళ్లిళ్లకు హాజరైన తమకు ఈ పెళ్లి ప్రత్యేకమని.. ప్రీతి, అభయ్‌లతో పాటు తమకు ఇది జీవితాంతం గుర్తుండే అనుభవమని వారు చెప్పారు. ‘మేము కూడా నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు మా వంతు సహాయ పడతాం’ అని పెళ్లికి హాజరైన యువతీ యువకులు ప్రతిన పూనారు. రైతు కుటుంబాల్లో వెలుగులు పంచేందుకు పెళ్లి మండపాన్నే వేదికగా చేసుకున్న అభయ్ ప్రీతి దంపతులకు ఇది ఒక జీవిత కాలపు మధురానుభూతి. - దండేల కృష్ణ

మరిన్ని వార్తలు