ప్రసాదాలు కావాలా?

19 Oct, 2019 02:40 IST|Sakshi

ఫుడ్‌ ప్రింట్స్‌

పండగ రోజు కొనే లడ్లు, కజ్జికాయలు ఎక్కడైనా దొరుకుతాయి. కాని ఆ షాపులో ఉండ్రాళ్లు, ఉగాది పచ్చడి, పులిహోర, గారెలు, బూరెలు కూడా దొరుకుతాయి. ప్రత్యేక పూజలకు నైవేద్యాలు చేయడం ఒక్కోసారి వీలు కాకపోవచ్చు. ఆ షాపుకు వెళితే పేలాల పిండి, అట్లు, కట్టెపొంగలి, చక్కెర పొంగలి దొరుకుతాయి. కొని దేవునికి పెట్టుకోవడమే. విజయవాడ కస్తూరిబాయి పేటలోని అనుభవ ఫుడ్స్‌  వారు రెండు దశాబ్దాలుగా వినియోగదారులకు శుచిగా ప్రసాదాలను అందిస్తున్న తీరుపై ఈ వారం ఫుడ్‌ ప్రింట్స్‌...

ఉమ్మడి కుటుంబాలు అంతరించి చిన్నచిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. పండుగ రోజుల్లో, శుభకార్యాలప్పుడు పిండి వంటలు, సంప్రదాయ వంటలు  తయారు చేసుకునే సమయం లేకపోతోంది. ‘అటువంటి వారి కోసం మేము పండుగరోజుల్లో  ఉండ్రాళ్లు, కుడుములు, అట్లు, ఉగాది పచ్చడి,  కట్టెపొంగలి, రవ్వ పులిహోర, పాలతాలికలు, మోదకాలు వంటివి తయారు చేసి అందచేస్తున్నాం’ అంటున్నారు అభినవ ఫుడ్స్‌ యజమాని మండవ చైతన్యకుమార్‌. నోములు, వ్రతాలు చేసుకునేవారు నైవేద్యానికి పిండివంటలు కావాలని ముందుగా కోరినట్లయితే  తయారు చేయించి అందజేస్తామని ఆయన అన్నారు.

అమ్మ ఆలోచనల నుంచే...
‘రెండున్నర  దశాబ్దాల క్రితం మేము హోమ్‌పుడ్స్‌ పెట్టినప్పుడు కస్టమర్లకు వంటకాలను వినూత్నంగా అందించాలని మా అమ్మ ఎం.ఎం.దేవి ఆలోచించారు. షాపుకి వచ్చిన కస్టమర్లకు చిన్న కప్పుల్లో పులిహోర, చక్రపొంగలి రుచి చూడమని పెట్టేవారు. దాంతో కస్టమర్లకు సంతోషం కలిగేది. కొంతకాలం తరవాత ఆ వంటకాలను ఆర్డర్ల మీద తయారు చేసి ఇవ్వమని కోరడం మొదలుపెట్టారు. రెండు దశాబ్దాల క్రితం వినాయకచవితి, దసరా, శ్రీరామనవమి, దీపావళి పండుగల్లో ఆయా సంప్రదాయ వంటల్ని ఆర్డరుపై మా అమ్మగారు తయారు చేయించి అందించారు.

మొదట్లో మా అమ్మగారే స్వయంగా  వండేవారు. ఆ తరవాత కొందరు మహిళలకు రుచిగా తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు. ఇప్పటికీ మా హోమ్‌పుడ్స్‌లోని సంప్రదాయ వంటల్ని మహిళల చేతే చేయిస్తాం. భగవంతుడికి నైవేద్యం పెడతారనే ఉద్దేశ్యంతో మడిగా వండిస్తాం. ప్రసాదాలను తయారు చేయడంలో శుచికి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తాం. పండుగ రోజుల్లో తెల్లవారు జాము నుంచే వంటలు వండటం ప్రారంభిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనాలు సమయం వరకు కస్టమర్లకు అందిస్తాం’ అన్నారు చైతన్య కుమార్‌.

ప్రతిరోజు....
పులిహోర, దద్ధ్యోదనం, గారెలు, పూర్ణాలు (బూరెలు), చక్రపొంగలి, చలిమిడి, పాలతాలికలు వంటివి ప్రతిరోజు ఉదయం నుంచి వేడివేడిగా అందుబాటులో ఉంటాయి.  ‘ఇంటికి బంధువులు వచ్చినప్పుడు గంటలు తరబడి వంటలు చేస్తూ కూర్చోకుండా మా దగ్గర నుంచి అప్పటికప్పుడు తీసుకువెళతారు’ అంటున్నారు చైతన్య కుమార్‌. విజయవాడ నగరంలో వినాయకచవితి, దసరా, శ్రీరామనవమి వంటి పండుగలకు పందిళ్లు వేసి సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అటువంటి సమయాల్లో పెద్ద స్థాయిలో నైవేద్యం పెట్టి భక్తులకు పంపిణీ చేయడానికి అనుభవ వారికే ఆర్డర్లు పెడుతున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల వారు తమ ఆఫీసు పూజలకు ఇక్కడ తయారుచేసిన ప్రసాదాలనే నివేదిస్తున్నారు.
– ఉప్పులూరు శ్యామ్‌ప్రకాష్, సాక్షి, విజయవాడ
ఫొటోలు: పవన్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా