అమరావతిలో నహుషుడు ‘నారా’!

2 Apr, 2019 00:16 IST|Sakshi

రెండో మాట

‘‘ప్రపంచంలో కెల్లా స్వేచ్ఛగా జరిగే దేశం మనదేనండోయ్‌. మన ప్రజాస్వామ్యదేశంలో మరో గొప్ప ఆవిష్కరణ ఏంటో తెలుసా? ‘ఎలెక్టోరల్‌ బాండ్‌’, అదో ద్రవ్య సంబంధమైన బంధ పత్రం! రాజకీయ  నిధుల్ని పారదర్శకంగా ఇచ్చిపుచ్చుకోనిచ్చే బాండ్‌ అది. అంటే రాజ కీయంగా సమకూర్చి పెట్టే నిధులకు పారదర్శకత ఉండాలనే అడ్డుగోడ ఉండదు. అందువల్ల ఎన్నికల్లో పోటీ చేయగోరే వారెవరికీ ప్రజాసేవలో ఎలాంటి రికార్డు ఉండనవసరం లేదు. ఎవరైనా సరే కరడుగట్టిన నేర గాళ్లు, బేరగాళ్లు, అవకాశవాదులు, సివిల్‌ సర్వెంట్లు వెర్రిబాగులోళ్లు ఎవ రైనా సరే అన్నార్తులకు, నిరుద్యోగులకు, రుణానందలహరిలో ఈదు లాడుతున్న వారికి వకాల్తా పేరిట ఎన్నికల్లో నిలబడొచ్చు. ఈ  పరిస్థితుల్లో మన పెట్రోల్‌ మాదిరే మన ప్రజాస్వామ్యం కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సరుకు’’
– సుప్రసిద్ధ వ్యంగ్య సామాజిక విమర్శకులు జి. సంపత్‌

ధర్మక్షేత్రే, కురుక్షేత్రే అన్నా కురుపాండవ యుద్ధం అన్నా, లంకా దహనం అన్నా లేదా రామరావణ యుద్ధమన్నా.. అన్నీ ధర్మం కోసం, సత్యం కోసం, అధర్మ నిర్మూలన కోసం అంతిమంగా సత్యప్రతిష్ఠాపన కోసం జరిగిన సంగ్రామాలే, శాంతి  స్థాపన యుద్ధవిజయంతో కానీ సాధ్యపడదని నిగ్గుతేల్చిన ఘట్టాలే! ధర్మ సంస్థాపన కోసం ప్రజాధర్మ పక్షాన రాముడికి, దుష్టుల పక్షాన రావణుడికి మధ్య జరిగిన యుద్ధాన్ని పోలిన ఆనాటి సంగ్రామ లక్షణాలన్నీ 2019 జనరల్‌ ఎన్నికల పరంగా బహుశా మొదటిసారిగా యావద్భారతంలోనూ మీదు మిక్కిలి భీక రంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణల్లోనూ సాగుతున్నాయి.. ఇందులోని పాత్రల స్వరూప స్వభావాలను పురాణ పాత్రల ద్వారా పూర్వరంగంలో వర్తమాన ఆధునిక శిష్ట–దుష్టపాత్రలకు వర్తింపచేస్తూ అన్యాపదేశంగా వివరిస్తూ తక్షణం జరగవలసిన పనిని నిర్దేశిస్తూ ఒక ఇతిహాస ప్రియుడు, అజ్ఞాత మిత్రుడు నాకు రాసిన విజ్ఞానదాయకమైన  లేఖను పాఠకుల సౌకర్యార్థం, అవగాహన నిమిత్తం యథాతథంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను. నన్ను గెలిపించకపోతే మీ భవిష్యత్తు అంధకారమేనని రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తూ శాసించగోరుతూ అఘోరి స్తున్న దుష్టస్వభావం గల  పాలకులున్న చోట, నా కోడీ, నేను లేకపోతే లోకానికంతకూ చీకటే నన్న మనస్తత్వం గల పాలకుడున్న రాష్ట్రంలో ఈ వివరణ అవసరమని భావించి ఈ తరంవారికి అవగాహన కోసం ఆ ఇతిహాస పాఠాన్ని ఇక్కడ అందజేస్తున్నా:

నా విష్ణుః పృథ్వీపతి అనేది పురాణ వాక్యం. అంటే విష్ణువు అంశ లేనిదే ప్రభువు కాజాలడని అర్థం. అలాగే రామరాజ్యం అంటే కేవలం శ్రీరామచంద్రుడు పాలించిన రాజ్యం అని కాక, అట్లాంటి పరిపాలన ఒనగూరితే, ఏ కాలమైనా అది రామరాజ్యమే అనబడుతుంది. అయితే, ఇందులో కొంత దాగి ఉన్న అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ‘నహుషుడు అనే చక్రవర్తి తన పరిపాలనలో ధర్మం నాలుగు పాదాలా నడిపించాడు. అతని సుగుణాలను చూచి మురిసిపోయి, దేవేం ద్రుడు శాపాన్ని అనుభవించే కాలంలో అమరావతికి తమ ప్రభువుగా నహుషుణ్ణి దేవతలందరూ కలిసి కూర్చోబెట్టారు. అటువంటి నహు షుడు రానురానూ ధర్మాన్ని వదిలివేసి, అన్ని దుర్గుణాలను అలవరచు కొని చివరకు సప్తర్షులచే తన పల్లకీ మోయించి, మహా పతివ్రత అయిన శచీదేవిని చెరపట్టాలని చూచి, అగస్త్య మహర్షి శాపంచే కొండచిలువై భూపతనం చెంది, ధర్మరాజు ద్వారా చివరకు శాప విమోచనం పొందాడు. ఈ ఇతిహాసం ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే– విష్ణువు అంశ లేనిదే ప్రభువు కాజాలడనే కాదు. దానిని (పదవిని) నిలుపు కోవాలంటే ధర్మమార్గ పరిపాలన తప్పరాదని. పుణ్యంవల్ల, ధర్మం వలన విష్ణువు అంశ కలిగి, తద్వారా పదవి ప్రాప్తించినా, అది తదుపరి కాలంలో రాక్షసత్వం పొడసూపితే, వినాశనం తప్పదని. అందుచేత ప్రభువైనంత మాత్రాన, తనలో ‘విష్ణ్వంశ’ ఉందని విర్రవీగరాదు.

‘ఇక, పరిపాలకులందరిలో ‘విష్ణ్వంశ’ ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం, ఆ పాలకులకు విష్ణ్వంశ ఆ పదవి సాధించే పుణ్య సము పార్జన ఇదివరలో అంతో ఇంతో చేయటంవల్ల వచ్చిందే అనేది నిర్వివా దాంశం. అయితే, ఇది నిలబెట్టుకోవడం అనేదే గొప్ప విషయం. ఒక నల మహారాజు, రఘు మహారాజు, శిబి చక్రవర్తి, మాంధాత పేర్లు చిరస్మర ణీయాలయినాయి ఇందువలననే. అయితే మరో విషయం ఏమిటంటే ప్రజలు తాము చేసే పాపాలలో ఆరవ వంతు పాలకులకు అంటు తుందని నమ్మకం, పురాణ వాక్యం. అందుచేత రాజైనవాడు (యథా రాజా తథా ప్రజా) చాలా ధర్మమూర్తి అయి, తన ప్రజలను పాప కార్యాల పట్ల నిరాసక్తులై ఉండేటట్లు పాలించాలి, లేదా ఆరవ వంతు పాప స్వీకరణకు సిద్ధమవ్వాలి. సైనికుల అరాచకాలు, ఉద్యోగుల అవి  నీతి, పాలకవర్గ దుర్మార్గాలు, స్వకుల పక్షపాతాలు ఇవన్నీ ఈ కోవ లోనివే. మరో విషయం ఏమిటంటే ఒక ప్రదేశంగానీ, ఒక ప్రదేశ పౌరుల దురదృష్టం కానీ, ఆ ప్రాంతానికి దుర్దశా కాలం అనుభవింప జేస్తుంది. మరి ఆయా సమయాల్లో పాలకులలో ‘విష్ణ్వంశ’ ఏమయినట్లు? అంటే, పాలకుని లేదా ఆ ప్రదేశ పౌరులకు ఉన్న పుణ్యలేశం కరిగిపోయిన తర్వాత మరల ఒకానొక మంచివాడు లేదా మహాత్ముడు తారసిల్లేవరకు ఆ ప్రాంతానికి అటువంటి దుర్గతి తప్పదు.

దీనికి తార్కాణాలుగా చెప్పా లంటే– మలజ, కరూశ దేశ ప్రాంతాలు తాటక, మారీచ, సుబాహుల చేరిక, ఆక్రమణల వలన పుష్కల, సారవంతమైన భూములై ఉండి కూడా ( మన అమరావతీ రాజధాని ప్రాంత భూములవలె, 3 పంటలు పండే) బీడు భూములై, నిరుపయోగమై, నివాస యోగ్యం కాకుండా పోయినాయి. మళ్లీ శ్రీరామచంద్ర మూర్తి తన తమ్ముడు లక్ష్మణ స్వామితో కలిసి, గురువర్యులు విశ్వామిత్ర మహర్షిని అనుసరించి ఆ ప్రాంతానికి వచ్చే వరకు ఈ ప్రాంతోద్ధరణ జరగలేదు. అదే విధంగా, ‘ప్రాగ్జ్యోతిష పురాన్ని రాజధానిగా ఏలిన నరకాçసుర పరిపాలనలో అస్సాం ప్రదేశం (అసమ ప్రదేశంగా అనేక ఎత్తుపల్లాలతో) అవినీతి మయమై, రాక్షస పాలనలో 16వేల మంది రాజకుమార్తెల చెరవాసంతో దుర్మార్గ పరిపాలనకు గురైంది. సాధుహింస, భక్త హింస పెచ్చుమీరింది. మధురానగర పరిపాలన కూడా కంసుడు రాజుగా ఇలాగే సాగింది. తన తండ్రిగారయిన ఉగ్రసేనుని కూడా విచక్షణా రహితంగా ఖైదు చేసి కంస పాలన సాగింది. మళ్లీ శ్రీకృష్ణుడిచే దుష్ట సంహరణతో ఆ ప్రాంతాలకు పూర్వ వైభవం, వేలాదిమంది మహిళా జనానికి విమోచన కలిగినాయి.

ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే.. చాలామంది పాలకు లకు, తాము విష్ణ్వంశ కల్గినవాళ్లం, దైవాంశ సంభూతులమనే అహంకార భావన చాలా తీవ్రంగా ఉంది. ప్రజాసేవకులమనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అధికార దుర్వినియోగం చేస్తూ, తాము చేసేదంతా ప్రజా సంక్షేమం కోసం అని దబాయించే నైజం కూడి ఉన్నది. చుట్టూతా చేరే పరిజనం కూడి నేతి బీరకాయలో నేతిచందంవలె, నేతలలో లేని దైవ త్వాన్ని తాము దర్శిస్తూన్నామని పాలకులకు వంతపాడుతున్నారు. ఈ పరిజన (వంధిమాగధుల) భజనలో, పాలకులు తాము చేసేవి అన్నీ గొప్ప గొప్ప పనులనీ, తాము చాలా ఉన్నతులమని, తమకు సాటి లేదని, తమను ఎన్నుకోకపోతే ఆ ప్రాంతం దౌర్భాగ్య స్థితిలోకి వెళ్లి పోతుందని, విపరీత వాగ్దోరణితో ప్రజానీకాన్ని భయభ్రాంతులను చేస్తున్నారు. దీనికి కొన్ని మాధ్యమాలు, పత్రికాధిపతులు కూడబలు క్కుని విష ప్రచారం కల్పిస్తున్నారు. ఇది చాలా విపరీత ధోరణి. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందం.

ఇదివరలో ఒక మహాత్ముడు ఏమని చెప్పారంటే.. (పేరు చెప్పటం ఇష్టం లేదు. ఆయన సనాతన ధర్మంలో ప్రాతస్మరణీయులు) పత్రికాధి పతులు తమకున్న వ్యాపారాలు, ఆదాయ వనరులు, పత్రిక నిర్వహ ణలో ప్రతిబింబించకుండా చూడాలి. ప్రజాక్షేమమే పత్రిక నిర్వహణకు పరాకాష్ట అయి ఉండాలి. మంచిని ప్రోత్సహించాలి. చెడును సమూ లంగా ఎదుర్కోవాలి. సత్య దూరాలకు ఊతమివ్వ కుండా తరిమికొ ట్టాలి అంతిమంగా ప్రజానీకానికి సుదూర కాలానికి కూడా మంచి జరిగే పనులకు వెన్నెముకై నిలవాలి. పారదర్శకత లోపించి స్వల్ప మోతాదు లలో విషప్రయోగ పూరి తంగా వార్తలను వ్రాయటంవలన జాతి మొత్తం నష్టపోయే అవకాశం, నీతిమాలిన పనులకు ప్రోత్సాహ కారకులుగా, అడ్డదారుల్లో సంపాదనా పరులుగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పరిచే వారుగా ఎక్కువమందిని తయారుచేసిన వార్తా పత్రికలై, ఏదో ఒకరోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. అభివృద్ధి నిజంగా జరిగినదా లేదా అనే విచక్షణా జ్ఞానాన్ని, నిష్పక్షపాతంగా బేరీజు వేసుకొనే పద్ధతిని విడనాడ రాదు. ప్రజా సంక్షేమమే పత్రికలకు పరా కాష్ట అవ్వాలి.చివరగా– అనేకమంది మేధావులు. విద్యావంతులు అనుభవ జ్ఞులు, ఆధ్యాత్మికవేత్తలు, గురువులు, స్వామీజీలు, తల్లులు, తండ్రులు, నాయకులు అందర్నీ– వారూ వీరూ అని కాక, వేడుకునేదేమంటే నీతి మంతులైన పౌరులను తయారు చేయండి. దానికి ప్రాథమికంగా మనల్ని మనం సంస్కరించుకోవాలి.

మన రాష్ట్రానికి మన దేశానికి మంచి జరిగేలా అడుగులు వేయాలి. అసత్య ప్రచారాలు చేయరాదు. నమ్మరాదు. చెడు జరుగుతూంటే చూస్తూ నిర్లిప్తంగా, మనకెందుకులే అని మిన్నకుండరాదు. మాకు ఓటు వేయకపోయినా, మమ్ములను గెలిపించి సీట్లు వచ్చేలా చేయకపోయినా, ఈ ప్రదేశం/ఈ జిల్లా/ ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయబడదు– అనే బెదిరింపు ధోరణిలో జరు గుతున్న ప్రచారానికి, మీడియా తీవ్ర నిరసన తెలపాలి. అలా మాట్లాడే వారిని తప్పనిసరిగా మందలించాలి. ఇదివరలో ఒకసారి ఒక పత్రికలో (సాక్షి కాదు) ఆంధ్రప్రదేశ్‌కు చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన అధికారిపై దురారోపణలు చేయగా, ఆయన్ని కన్నతల్లికి అది తెలిసి ప్రాణం వదిలింది. చివరిసారిగా అధికారి తన తల్లితో అన్నమాటలు: ‘అమ్మా! నీ పెంపకంలో పెరిగిన నేను నీకు తలవంపులు తెచ్చే ఏ పనీ చేయలే  దమ్మా!’. ఇప్పుడు చెప్పండి– ఈ కాలపు పత్రికలు ఎంత విషాన్ని చిమ్ము తున్నాయో? తమ స్వార్థం, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర, దేశ సామర  స్యాన్ని, సంక్షేమాన్ని నాశనం చేస్తున్నారు. దేశోద్ధారణ చేస్తున్నాను అనుకునే ముసుగులో చేయని అరాచకాలు లేవుగాక లేవు. శ్రీ రామాయణ, భాగవత, భారత ఇతిహాసములతో పునీతమైన ఈ భరత భూమికి సంపూర్ణ రక్షణ కలుగుగాక– అని ఆశిస్తూ!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

మరిన్ని వార్తలు