‘నేను సైతం’ అంటున్న షర్మిలమ్మ!

22 Jan, 2019 00:34 IST|Sakshi

రెండో మాట

2014 నుంచీ జగన్‌కి ఆసరాగా అగ్రగామి శక్తిగా షర్మిల రాజకీయ ప్రచారాన్ని 3,000 కి.మీ. పర్యంతం అంతకుముందే ఘనంగా నిర్వహించిన సంగతి రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు. తిరిగి ఆమెను తాజా ఎన్నికల ప్రచారంలోకి దిగి జగన్‌కు కొండగా అండగా నిలబడకుండా బెదరగొట్టజూడ్డమే ఓటమివైపు ప్రయాణిస్తున్న ‘తెదేపా’ గందరగోళపు శ్రేణుల లక్ష్యం. సమాజంలో అనేకవిధాల వంచనకు గురి అవుతున్న సామాన్య మహిళలపట్ల సామాజికులు సకాలంలో స్పందించని సందర్భాలనేకం. నేడొక విద్యా వంతురాలిగా, సామాజిక కార్యకర్తగా రాజకీయ చైతన్యంగల కుటుంబంనుంచి ప్రభవిల్లిన షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ఎవరు ప్రయత్నించినా సహించరాదు.

‘‘మానవ జాతిలో స్త్రీ–పురుష విభజన అనేది కేవలం జీవశాస్త్ర సంబంధమైనదేగానీ అదొక చారిత్రక సంఘటనగా భావించరాదు. (The division of the sexes is a bilogical fact, not an event in history). ఈ రెండు శక్తులు కలిస్తేనే మానవులు (మానవ–మానవి) అవుతారు. మానవజాతి, ఆదాము, అవ్వ మానవాళికి అందివచ్చిన తొలి మానవులు. ఇందులో ‘సెక్స్‌’ పేరిట కృత్రిమ విభజనకు ఆస్కారం లేదు. ‘సెక్స్‌’ పదాన్ని తరచుగా స్త్రీతో సంబంధానికే స్త్రీ దృష్ట్యానే వర్తింపచేసిన వాడు మగవాడు. ఇది అతని దాష్టీకానికి, ఆధిక్యతా ధోరణికి నిదర్శనం. కేవలం జీవశాస్త్ర సంబంధమైన ప్రాకృతిక ఏర్పాటును (ప్రిమోర్టియల్‌ మట్స్‌న్‌) చెదరగొట్టడానికి ప్రయత్నించినవాడు పురుషుడేగానీ స్త్రీ మాత్రం కాదు!’’
– 20వ శతాబ్ది సుప్రసిద్ధ ఫ్రెంచి మేధావి, మహిళా ఉద్యమ నాయకురాలు సిమన్‌ ది బోవా (‘ది సెకండ్‌ సెక్స్‌’ గ్రంథకర్త)

స్త్రీ–పురుష వివక్ష సమస్య కాల పరిస్థితులకు అతీతంగా నేటికీ సాగుతూ, మరిన్ని వెర్రితలలు వేస్తున్న దిశగా ప్రయాణిస్తోంది. సమస్త రంగాలనూ పీడిస్తున్న ఆ వివక్ష కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయంతో మరింతగా పేట్రేగిపోతోంది.  ధర్మవరం ‘తెదేపా’ నాయకుడు ఎకాఎకిని ‘మహిళ’ల్ని చెంపదెబ్బలు కొట్టండనే పిలుపిచ్చాడని వార్త! తెదేపా వాళ్లలో వికటించిన ఈ అన్య ‘జన్యు’ వ్యాధి లక్షణం వల్లనే బహుశా దివంగత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడైన జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి అయిన క్రియాశీల మహిళా కార్యకర్త షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సాగుతున్న అనాగరిక ప్రచారం. ఇందుకు 2014 ఎన్నికల లోనే తెరలేపారు. దానికి కొనసాగింపుగానే త్వరలో జరగబోయే సార్వ త్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరొకసారి అదే బాపతు ప్రచార యుద్ధం మరొకసారి ప్రారంభించారు. ఇందుకు సోషల్‌ మీడియాను మాధ్యమం చేసుకుని తమ పేర్లు తెలిపే దమ్ములేక గాలివాటు ప్రచారా నికి దిగారు. మొదటినుంచీ జగన్‌కి ఆసరాగా, అగ్రగామి శక్తిగా ఉంటున్న షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పేరిట పాదయాత్ర ప్రారం భించి 3,000 కిలోమీటర్ల పర్యంతం కొనసాగించిన సంగతి రాష్ట్ర ప్రజ లకు కొత్త కాదు. ఆమెపై ఏదో రకంగా బురదజల్లి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా తెదేపా శ్రేణులు తాజా దాడికి తెగిం చాయి.  కానీ, షర్మిల మొదటిసారి చేసినట్టే, ఈసారి కూడా తన వ్యక్తి త్వాన్ని కించపరిచే ప్రచారానికి ఒడిగట్టిన వారిపై పోలీసు ఉన్నతాధికా రులకు, సైబర్‌ క్రైమ్‌ అధికార గణానికి  ఫిర్యాదు చేయవలసి వచ్చింది.

పర్యవసానంగా అధికారులు కొన్ని వెబ్‌సైట్లలో కొంతమంది ‘ఆవారా’ గాళ్లను గుర్తించినట్టు ప్రకటించారు. ఈ పరిణామం కాంగ్రెస్‌కు అమ్ముడు పోయిన ‘తెదేపా’లో గత్తరకు, గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు ‘తెదేపా’ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్‌ పార్టీలోని మహిళల్నే ముంచే స్థితికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి, టీవీలలో బాహాటంగా ప్రసార మవుతున్నాయి. ఇప్పుడు అలాంటి శక్తులే షర్మిలను లక్ష్యంగా చేసుకుని దొంగదాడికి దిగాయి. నేడొక విద్యావంతురాలిగా, సామాజిక కార్యక ర్తగా రాజకీయ చైతన్యంగల కుటుంబంనుంచి ప్రభవిల్లిన షర్మిల వ్యక్తి త్వాన్ని కించపరచడానికి ఎవరు ప్రయత్నించినా కూడా పౌరశక్తి సహిం చరాదు. అందుకే ఒక చైతన్యం గల స్త్రీగా షర్మిల పోలీసు ఉన్నతా ధికారులవద్ద ఫిర్యాదు చేసిన సందర్భంగా ఒక ఆలోచనాత్మకమైన ప్రకటన కూడా విడుదల చేయవలసి వచ్చింది: ‘‘మహిళల సమానత్వం, స్వేచ్ఛ అన్న మాటలు కేవలం కాగితాలకు, చర్చలకే పరిమితం కారాదు. ఆచరణలో అవి ప్రతిఫలించాలి. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నాకు జరి గిన అవమానం నా ఒక్కదానికే జరిగినట్లు నేను భావించటం లేదు. ఇలాంటి తప్పుడు రాతలు ఇంకెంతోమంది మహిళలమీద కూడా రాస్తు న్నారు. స్త్రీలపట్ల శాడిజం (విద్వేషం), చులకన భావంతో ఈ రాతలు రాస్తున్నారు.

ప్రజాస్వామ్యం, మానవహక్కులు, సమానత్వం, మహిళల స్వేచ్ఛ వంటి మాటలు వాస్తవరూపం దాల్చాలంటే మనం (మహిళలు) గొంతెత్తి వెబ్‌సైట్‌లు, సోషల్‌ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారా లను బయటపెట్టాలి.  కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న నా విజ్ఞాపనకు మద్దతు పలకాలని ప్రజాస్వామ్యవాదులు, పాత్రికే యులు, మహిళలు, రాజకీయ నాయకులను కోరుతున్నాను. నాపై దుష్ప్రచారం చేస్తున్నవారు, చేయిస్తున్న వారికి బదులుగా ఈ రోజున ఇలా దోషిగా నిలబడి నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావ టం ఒక్క నాకే కాదు, మహిళలందరికీ అవమానకరం. ఈ విష ప్రచారం వెనుక ‘తెలుగుదేశం’ పార్టీ పాత్ర ఉంది’’ అని బాహాటంగానే ఆమె ఆరో పించారని ఇక్కడ గమనించాలి.  షర్మిల మాటల్నే మరొక రూపంలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కూడా వివరించారు. ‘మహిళల భద్రతకు పెద్ద పీట వేయాలన్న’ ఆయన మాటలకు విలువ రావాలంటే ఇప్పటి దాకా మహిళలపై సాగుతున్న వివక్షకు, హింసకు తక్షణం స్వస్తి చెప్పిం చగల్గాలి. ఎప్పుడో వైదిక యుగం నాటి గార్గి, మైత్రేయి లాంటి విద్వ న్మణులు చెలాయించిన పురాణ కాలంనాటి మహిళల సంగతి మనకు తెలియకపోవచ్చు, బహుశా మాతృస్వామిక యుగం చెలామణీలో ఉన్న దశలో మాత్రమే అలాంటి స్వేచ్ఛ, ప్రతిష్ట సాధ్యమై ఉండవచ్చు.

కానీ సాధికారతకు స్త్రీ పురుష వివక్ష ఉండటానికి వీలులేదన్న గాంధీజీ... మహిళలు తమ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి, తమపై జరిగే అవమానాలను, హింసను ఎదుర్కొనడానికి ఏనాడో ఒక విలువైన చిట్కాను సూచించారు: ‘‘మహిళలు తమ ఆత్మరక్షణార్థం తమకు అందు బాటులో ఉన్న సహజ ఆయుధాల్ని– తమ నోటిపళ్లను, చేతిగోళ్లనూ యథేచ్ఛగా ఉపయోగించుకోవాలి. అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా, నిర్భయంగా రోడ్లపై నడిచి వెళ్లగలిగినప్పుడే దేశ స్వాతంత్య్రానికి అర్థమూ, విలువా’’ నన్నాడు. ఈ రోజున ‘నేను సైతం’ (మీ–టూ) అంటూ మహిళా లోకం ఎందుకు తెగబడవలసి వస్తోంది? సామాజిక, ఆర్థిక, కుల, మత, వర్గ అసమానతలకు, సంఘర్షణలకు తావిచ్చే ధనికవర్గ పెట్టుబడి దోపిడీ దారీ వ్యవస్థ నరనరాన సామాజికుల్ని– ముఖ్యంగా అట్టడుగు వర్గాలను మరీ పీడిస్తున్నందున. అందుకే అడుగడుగునా రిపబ్లిక్‌ రాజ్యాంగం నిర్దే శించిన లౌకిక వ్యవస్థను తూట్లు పొడుస్తూ దేశ స్వార్థ రాజకీయ పాల కులు అసమ సామాజిక ఆర్థిక వ్యవస్థకు ‘చౌకీదార్లు’గా నిలబడినందునే రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌–‘నేటి భారత దేశంలో దోపిడీ వ్యవస్థలో ‘దళిత మహిళలతోపాటు సంపన్న మహిళలు కూడా దళితులే (భర్తలచాటు భార్యలే)నన్నాడు.

ఈ దృక్పథాన్ని అంతకుముందు 19వ శతాబ్దం నాటి శాస్త్రీయ సోషలిజం సిద్ధాంత కర్తలు కారల్‌ మార్క్స్, ఫ్రెడ రిక్‌ ఎంగెల్స్‌ మరికొంత వివరంగా స్పష్టంగా విస్తరించి వర్గ సమాజంలో ‘భర్త బూర్జువా(యజమాని), భార్య ప్రొలిటేరియట్‌ (శ్రమజీవి/పనిమనిషి)’ అని నిర్వచించారు. అందుచేతనే మార్క్స్‌ ‘స్త్రీ పురుషుల మ«ధ్య సంబంధం మనిషికీ మనిషికీ మధ్య అతి సహజమైన బంధం. మరో మాటలో చెప్పాలంటే, ఏమేరకు మనిషి తన వ్యక్తిగత ఉనికిని కాపాడుకుంటూనే సంఘజీవిగా నిరూపించుకోగలుతున్నాడన్నదే అసలు అగ్ని పరీక్ష’ అన్నాడు. కాలం చెల్లిన వలసపాలకుల చట్టాలను దుమ్ముదులిపి భావ ప్రకటన స్వేచ్ఛను ‘దేశ ద్రోహనేరంగా’పరిగణించి అరెస్ట్‌లు చేస్తున్నారు. కనుకనే పెక్కుమంది వీటికి నిరసనగా పద్మశ్రీలు, పద్మభూషణ్‌ బిరుద బీరాలను తృణప్రాయంగా భావించి పాలకుల ముఖాన తిప్పి కొడుతున్నారు. విశ్వవిద్యాలయాల యువతీ యువకులు చైతన్యమూ ర్తులై తిరగబడవలసిన దుస్థితిని పాలకులు కల్పించారు. గౌరీలంకేష్‌ లాంటి పత్రికా సంపాదకుల్ని, పన్సారే, దభోల్కర్, కల్బుర్గిలాంటి సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తల్ని, ప్రొఫెసర్లను భిన్నాభిప్రాయ ప్రకటనకుగాను హత్యగావిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయ ప్రకటనలు, తీర్పులపై పాలకులు గుర్రు పెంచుకుంటున్నారు. ఈ సామాజిక సంకుల సమరంలో భాగమే షర్మిలమ్మ ఎదురీత కూడానని మరిచిపోరాదు.

ఈ జీవన యాత్రలో షర్మిల ఒంటరికాదు. సంఘ దురాచారాలకు, అన్యాయాలకు, దోపిడీ స్వభావాలకు వ్యతిరేకంగా గతంలో ఉద్యమించిన వీరేశలింగం, గిడుగురామ్మూర్తి దంçపతు లను, చిలకమర్తి, భండారు అచ్చమాంబ, కొమర్రాజు, సూర్యదేవర రాజ్యలక్ష్మి, నందగిరి ఇందిరాదేవి లాంటి సంస్కర్తలను మహిళా స్వాతంత్య్ర యోధులను షర్మిల తలచుకుని తిరిగి రంగంలోకి దూకాలి. అంతేకాదు, ప్రపంచ వ్యాపితంగా మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఫ్రెంచి విప్లవ కాలంనాటి తొలి బ్రిటీష్‌ మహిళ, ప్రసిద్ధ మహిళా తత్వవేత్త, స్త్రీ పురుష సమానత్వం కోసం, ఆడపిల్లల విద్యా వ్యాప్తికి దోహదపడిన మేరీ ష్త్రల్‌స్టోన్‌ క్రాఫ్డ్, ప్రసిద్ధ అమెరికన్‌ స్త్రీవాద ఉద్యమ నాయకురాలు అమేలియ జంక్స్, సిమన్‌ దిబోవా (ఫ్రాన్స్‌), లూసీ స్టోన్‌ బెట్టీ ఫ్రీడన్, మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమించి, సాధించి ప్రెసిడెంట్‌ అబ్రహం లింకన్‌కు వెన్నుదన్నుగా నిలిచిన ఉమెన్స్‌ లాయల్‌ నేషనల్‌ లీగ్‌ స్థాపకురాలు సుసన్‌ బ్రౌనెల్‌ ఆంథోనీ మహిళా యువతకు ఆదర్శప్రాయులు.

అలాగే ఈ ప్రసిద్ధ మహిళా మణులతోపాటు మహిళా హక్కుల సాధనలో వెన్నుదన్నుగా నిలిచి లైంగిక వేధింపులకు మహిళల వ్యక్తిత్వాలను కించపరిచే హింసా ప్రవృత్తిని నిరోధించే సవరణ చట్టాలు రూపొందించడానికి దోహదపడిన పురుష సామాజిక కార్యకర్త ప్రసిద్ధ గాయకుడు మానవ హక్కుల పరిరక్షకుడు హారీ చెల్పాంచే, జాన్‌ లెజెంట్, మార్క్‌ రుఫాలో లాంటి ఉద్ధండులూ ఎందరో ఉన్నారు. బహుశా అన్ని ఖండాలలో అన్ని దేశాలలో ఇంతమంది కృషి ఫలితమే ఈనాటి మహిళా లోకపు ‘నేను (మేము) సైతం’ ఉద్యమాల ఉధృతి అని మరచిపోరాదు. అందుకే ఒకనాడు లెనిన్‌ ‘ఫ్రెంచి విప్లవానికి పురుషులు కాకుండా పూర్తిగా మహిళలే నాయకత్వం వహించి ఉంటే దాని ఫలితం మరెంత ఆశాజనకంగా ఉండేదో’నని భావించి ఉంటాడు. అలాగే షర్మిలా నీవు అభినవ కౌటిల్యుల కుట్రలను ఛేదిస్తావు, కుంగిపోవలసిన పనిలేదు. వికసించిన విద్యుత్తేజంలోకి మళ్లీ దూసుకురా, చెలరేగే జనసమ్మర్థంలోకి బిరాన రా. ‘కదిలేదీ కదిలించేదీ/ మారేదీ మార్పించేదీ/ పాడేదీ పాడించేదీ/మునుముందుకు సాగించేదీ/ పెను నిద్దుర వదిలించేదీ/పరిపూర్ణపు బతుకిచ్చేదీ’ ఏదో దాన్ని ఆశించు, దాన్ని ఆశ్రయించు, సదా సాహసించు.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

మరిన్ని వార్తలు