క్యాన్సర్ కాటుకు కొత్తచికిత్సల దెబ్బ!

4 Feb, 2019 00:35 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 90 లక్షల మంది క్యాన్సర్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. అయితే ఎన్నెన్నో పరిశోధనల కారణంగా క్రమంగా కొత్త చికిత్స విధానాలు, కొత్త ప్రక్రియలు, కొత్త మందులు, కొత్త పరీక్షలూ  అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా గతంలో 85% కేసులు ప్రాణాంతకంగా ఉండగా...ఇప్పుడు దాదాపు 85% క్యాన్సర్లకు చికిత్స అందుబాటులో ఉంది. క్యాన్సర్‌ చికిత్స రంగంలో ఇంకా ఎన్నెన్నో కొత్త ఆశారేఖలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

నేడు క్యాన్సర్‌ డే సందర్భంగా వాటిలో కొన్నింటి గురించిన వివరాలు... ప్రపంచంలో ఏదైనా కొత్త మందు లేదా చికిత్స విధానం రోగులకు అందుబాటులోకి రావాలంటే... రోగికి అది సురక్షితమైందా, ఏమేరకు లాంటి అనేక అంశాలను అనేక దశల్లో పరిశీలించి అమెరికాకు చెందిన ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (ఎఫ్‌డీఏ) అనే అత్యున్నత సంస్థ అనుమతులను ఇస్తుంది. గత ఏడాది అది 18 కొత్త రకాలైన క్యాన్సర్‌ చికిత్స ప్రక్రియలకు అనుమతులిచ్చింది. క్యాన్సర్‌ ప్రక్రియల వల్ల 13 రకాల ఉపయోగాలను కొత్తగా కనుగొన్నట్లు ప్రపంచానికి వెల్లడించింది. 

వ్యక్తిగతమైన ఔషధాలు : ఒక రకం క్యాన్సర్‌కు ఒక మందు కనుక్కున్నారని అనుకుందాం. అప్పుడు ఆ రకం క్యాన్సర్‌ రోగులందరూ వాడాల్సిందే. అయితే రోగి తాలూకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ఇచ్చే మందులైన ఇమ్యూనోథెరపీ అనే ప్రక్రియలూ, ఆరోగ్యకరమైన కణాలను వదిలేసి కేవలం క్యాన్సర్‌ కణాలను మాత్రమే పట్టి పట్టి చంపేసే టార్గెట్‌ థెరపీలలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దాని ఫలితంగా ఊపిరితిత్తుల, ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో మునుపెన్నడూ ఊహించనంత పెను మార్పులు వచ్చాయి. వాటి వల్ల ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయి. అందరూ క్యాన్సర్‌ రోగులకూ గంపగుత్తగా ఒకే మందు వాడటానికి బదులు... ఆ మందును మరింత ప్రభావపూర్వకంగా మార్చేందుకు వీలున్న మరో ప్రక్రియకు ఎఫ్‌డీఏ ఇటీవల అనుమతిని ఇచ్చింది.

స్వభావంలోనూ, ఒక మందుకు స్పందించే విషయంలోనూ వ్యక్తికీ వ్యక్తికీ మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా అతడి జన్యుపరిస్థితిని, జన్యువుల తీరుతెన్నులను పరిశీలించి, ఒక అవయవంలో క్యాన్సర్‌ ఉన్న స్థానాన్ని బట్టి... ఇలాంటి కొన్ని అంశాల ఆధారంగా ఆ మందులలో మార్పులు చేసి, అవి ఆ వ్యక్తిలో మరింత ప్రభావపూర్వకంగా, బలంగా పనిచేసేలా చేస్తారు. ఇలా వ్యక్తిగతమైన మందుల రూపకల్పనకే ఇటీవల ఎఫ్‌డీఏ అనుమతులను ఇచ్చింది. దీన్నే ‘పర్సనలైజ్‌డ్‌ థెరపీ’ అని చెప్పవచ్చు. ఇది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఒక చికిత్సాప్రక్రియ.
 
టీఆర్‌కే ఫ్యూజన్‌ ప్రోటీన్‌ : క్యాన్సర్‌ చికిత్సల కోసం పరిశోధకులు ప్రతిరోజూ కొత్తదారులు వెదుతుకూనే ఉన్నారు. ఆ మార్గాల్లో పయనిస్తూ, కొత్త చికిత్సా ప్రక్రియలను కనుగొంటున్నారు. క్యాన్సర్‌ కూడా ఒక కణమే కదా. అన్ని కణాలకు ఉన్నట్లే దానికీ ఒక జన్యుపటలం ఉంటుంది. కాకపోతే ఆరోగ్యకరమైన కణంలా కాకుండా అది విభిన్నంగా, విపరీతంగా ప్రవర్తిస్తుంటుంది. ఈ కొత్తమార్గంలో చూసినప్పుడు దాని జన్యుపటలంలోని ప్రోటీన్ల గొలుసుల్లో(‘ప్రోటీన్‌ చైన్‌’లో) ఏదైనా మార్పులు చేయడం వల్ల అది తనకు తానుగా నశించిపోతుందేమోనంటూ పరిశోధకలు పరిశీలించారు. ఇది కూడా క్యాన్సర్‌ రోగులకు వ్యాధి పూర్తిగా తగ్గేలా చేసే ఒక ప్రక్రియ అనీ, త్వరలోనే అది అందుబాటులోకి వస్తే అది క్యాన్సర్‌ చికిత్సా రంగంలోనే ఓ పెద్ద మార్పు తీసుకొస్తుందనే ఆశలున్నాయి. 

హైపర్‌థెర్మిక్‌ ఇంట్రా పెరిటోనియల్‌ కీమోథెరపీని మరింత విస్తృత పరచడం : సాధారణంగానైతే కీమోథెరపీని నిర్దిష్టంగా ఒక చోట కాకుండా శరీరమంతటా ఆ మందు ప్రవహించేలా డాక్టర్లు ఇస్తుంటారు. అయితే శస్త్రచికిత్స ద్వారా కడుపును తెరచి, ఆ కడుపు కుహరంలో కీమోథెరపీకి ఉపయోగించే మందును ఉంచడం ద్వారా ఇచ్చే చికిత్సను ‘హైపర్‌థెర్మిక్‌ ఇంట్రాపెరిటోనియల్‌ కీమోథెరపీ (హెచ్‌ఐపీఈసీ) అని అంటారు. సాధారణ కీమోథెరపీలో మందు శరీరమంతటికీ విస్తరిస్తుంది కదా... కానీ ఈ హైపర్‌థెర్మిక్‌ ఇంట్రాపెరిటోనియల్‌ కీమోథెరపీలో మందు కేవలం కడుపు ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉంటుంది.

అక్కడ విశేషమైన వేడికి పుట్టిస్తూ, క్యాన్సర్‌ కణాలను భస్మం చేస్తుంది. సాధారణ కణాలకు తనను తాను రిపేర్‌ చేసుకునే శక్తి ఉంటుంది. ఫలితంగా ఈ ప్రక్రియలో దెబ్బతిన్న సాధారణ ఆరోగ్యకరమైన కణాలు మళ్లీ మామూలు స్థితికి వస్తాయి. కానీ భస్మమైన క్యాన్సర్‌ కణాలు మళ్లీ పుట్టవు. అలాగే దెబ్బతిన్న క్యాన్సర్‌ కణాలకు తమను తాము రిపేర్‌ చేసుకునే శక్తి ఉండదు. ఈ అంశం ఆధారంగా ఈ ప్రత్యేకమైన థెరపీని కడుపునకు సంబంధించిన కొన్ని  క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు.

క్యాన్సర్లలో ఉపయోగించవచ్చు. క్యాన్సర్‌ చికిత్సలో కృత్రిమ మేధస్సు సహాయం తీసుకోవడం : ఊహల్లోనూ మన మేధస్సుకు ఒక సరిహద్దు లేదు. అయిప్పటికీ ఎన్నో సంక్లిష్టమైన నిర్మాణాలతో ఉండే జన్యుపటలం లాంటి అంశాలను కేవలం మనిషి ఒక్కడే (అంటే మ్యాన్యువల్‌గా) విశ్లేషిస్తూ అర్థం చేసుకోవడంలో ఎంతో సమయం పట్టవచ్చు. ఆ సమయం ఆదా అయ్యే విధంగా మనిషి సృష్టించిన కృత్రిమ మేధస్సే క్యాన్సర్‌ జీనోమ్‌ స్ట్రక్చర్‌ను అర్థం చేసుకునేలా ప్రోగ్రామ్‌ చేస్తారు. దాని విశ్లేషణల ఆధారంగా క్యాన్సర్‌ కణాన్ని ఎలా ధ్వంసం చేయవచ్చో తేలిగ్గా తెలిసిపోతుంది. ఇలా క్యాన్సర్‌పై పోరాటంలో ఇప్పుడు కృత్రిమ మేధస్సు కూడా సహాయం చేస్తోంది. ఇవీ... ఇటీవల క్యాన్సర్‌ రంగంలో చోటు చేసుకున్న, చేసుకోబోతున్న విప్లవాత్మకమైన మార్పులు. ఇవన్నీ త్వరలోనే దాదాపుగా ‘క్యాన్సర్‌ రహిత లోకం’ వైపునకు బాటలు పరుస్తాయేమోనని ఆశాభావంతో రాబోయే తరాలు ఎదురుచూస్తున్నాయి. 
సాధారణ మూత్రపరీక్షతోనే క్యాన్సర్‌ను తెలుసుకోవచ్చు
లక్షణాలను బట్టి కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్‌డ్‌ క్యాన్సర్‌ పరీక్షలు చేయిస్తారు. అయితే అప్పటికే వ్యాధి ముదిరిపోయి, చికిత్సకు లొంగకుండా పోవడం అన్నది కొన్ని సందర్భాల్లో కనిపించే అవకాశం ఉండటం ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంది. కానీ కొన్ని రకాల క్యాన్సర్లను ఇప్పుడు కేవలం మూత్రపరీక్ష వంటి చిన్న పరీక్షతోనూ తెలుసుకునే సాంకేతికతను ‘ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న బెన్‌–గురియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ నెగావ్‌ కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని సహాయంతో రొమ్ము క్యాన్సర్‌ను చాలా నిశితంగానూ, చాలా త్వరగానూ పట్టేయడానికి వీలవుతుంది. దాంతో చికిత్స ఆలస్యం కావడం అనే పరిస్థితి తప్పిపోయి, ఎంతో మంది మహిళల ప్రాణాలు నిలబడతాయి.

ఇదీ క్యాన్సర్‌ రోగులకు అందుబాటులోకి రాబోతున్న మరో ఆశారేఖ. ఇక్కడ ఒక చిన్న తమాషా కూడా ఉంది. మూత్రం ద్వారా పట్టేసేందుకు ఉద్దేశించిన ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని పరిశోధకులు నిర్మించారు. దీనికి పెద్దగా ఖర్చుకూడా అవసరం లేదు. మూత్రాన్ని పరిశీలించి, రొమ్ముక్యాన్సర్‌ తాలూకు వాసన పట్టేస్తుందనే ఉద్దేశంతోనో ఏమో ఈ ఎలక్ట్రానిక్‌ పరికరానికి ‘ఈ–నోస్‌’ (ఎలక్ట్రానిక్‌ ముక్కు) అని పిలుస్తున్నారు. దాంతో మహిళారోగులు భవిష్యత్తులో మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్‌డ్‌ పరీక్షలతో కాకుండా... కేవలం కొద్ది ఖర్చుతోనే రొమ్ము క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. 

డాక్టర్‌ ఏవీఎస్‌ సురేశ్, 
సీనియర్‌ కన్సల్టెంట్, 
మెడికల్‌ అండ్‌ హిమటో ఆంకాలజిస్ట్, 
సెంచరీ హాస్పిటల్స్, 
హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు