పారిపోయే కూతురు

30 May, 2019 01:44 IST|Sakshi

గోడలు సెగలు కక్కుతాయి.వంట గది పెద్ద పెద్దగా అరుస్తుంది.డ్రాయింగ్‌ రూమ్‌ కోపంతో చిందులు తొక్కుతుంది.గృహమే కదా నరకసీమ అనిపిస్తుంది. జైలులా మారిన ఇంట్లో పిల్లలు ఒకటే పని చేస్తారు. పారిపోవడం!

అదొక అందమైన ఇల్లు. రకరకాల పూలమొక్కలు ఉన్నాయి. గడ్డిమొక్కలున్నాయి. తీగలు ఉన్నాయి. లాన్‌ను కాలితో తన్ని హాయిగా ఊగే ఊయాల ఉంది. ఇంట్లో చల్లదనం ఉంది. ఏసీలు ఉన్నాయి. టీవీలు ఉన్నాయి. పెద్ద ఫ్రిజ్‌ ఉంది. కిచెన్‌లో కోరింది దొరుకుతుంది.బయటి నుంచి చూసినవారెవరైనా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటారు.ఇలాంటి ఇంట్లో ఉండాలి అనుకుంటారు.కాని ఆ ఇంట పుట్టిన కూతురు మాత్రం పారిపోవాలనుకుంటోంది.మారణాయుధాలు అంటే ఏమిటి?కత్తి.. కొడవలి... తుపాకీ... గొడ్డలి.అత్యంత పెద్ద మారణాయుధం మనిషి రెండు దవడల మధ్య ఉంది. నాలుక.ఇంటర్‌ ఆ అమ్మాయి ఎంత మంచి మార్కులు తెచ్చుకుందంటే వైజాగ్‌లో చాలాచోట్ల ఆ అమ్మాయి ఫొటో హోర్డింగ్‌లలో వచ్చింది. పేపర్‌లో వచ్చింది.

ఎమ్‌సెట్‌ ర్యాంకు, జాతీయ పోటీ పరీక్షల ర్యాంకు కూడా అంతే మంచిది వచ్చింది. ఒక్కగానొక్క కూతురు. వైజాగ్‌లో గొప్ప గొప్ప ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. అన్నీ కూడా వచ్చి చేరితే అదే భాగ్యం అన్నట్టు కాంటాక్ట్‌లో ఉన్నాయి. తల్లిదండ్రులు ఏ కాలేజీలో చేర్పిద్దామా అని ఆలోచిస్తున్నారు.కాని ఆ అమ్మాయి మాత్రం ఆ రోజు బాంబు పేల్చింది.‘నేను వైజాగ్‌లో చదవను’‘అదేంటి?’‘అంతే. నాకిక్కడ చదవాలని లేదు’‘హైదరాబాద్‌లో చదువుతావా?’‘ఊహూ’...‘బెజవాడలో’‘ఊహూ’‘ఎక్కడ చదవాలని?’‘కేరళలో చదువుతా. లేదంటే ఢిల్లీలో చదువుతా’‘అంత దూరమా?’ తండ్రి అన్నాడు.‘పిచ్చెక్కిందా?’ తల్లి అంది.‘మీరు నా మాట విన్నారా సరే సరి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు’‘బుద్ధి లేకుండా మాట్లాడకు. ఆడపిల్లవి. మా కళ్ల ముందు కాలేజీకి వెళ్లి వస్తుంటే చాలు.

నువ్వు బాగా చదివి ఊళ్లేలాల్సిన పని లేదు. మనకేం తక్కువ? ఎన్ని కోట్లైనా పోసి మంచి పొజిషన్‌లో ఉన్న కుర్రాణ్ణి తెచ్చి పెళ్లి చేస్తాం. నువ్వు చదువును హాయిగా ఎంజాయ్‌ చెయ్‌. అంతేగాని అక్కడకు వెళతాను ఇక్కడకు వెళతాను అంటే ఊరుకోను’ అంది తల్లి.తండ్రి కోపంగా చూస్తున్నాడు.అమ్మాయి ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి ధడేలుమని తలుపేసుకుంది.మూడు రోజులు గడిచాయి. అమ్మాయి సరిగ్గా అన్నం తినడం లేదు. సరిగ్గా నీళ్లు తాగడం లేదు. సరిగ్గా నిద్ర పోవడం లేదు. పలకరిస్తే చిరాకు పడుతోంది. తిరగబడుతోంది. మరీ గట్టిగా బెదిరిస్తే ఏడుస్తోంది.‘నేను ఇక్కడ ఉండను. దూరంగా వెళ్లి చదువుకుంటాను. ప్లీజ్‌’ ఇదే మాట ప్రతీసారి.తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచలేదు.సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువచ్చారు.

తల్లిదండ్రులు లేకుండా చూసి సైకియాట్రిస్ట్‌ అడిగింది–‘ఏదైనా ప్రేమ వ్యవహారమా?’‘ఊహూ’‘ఎవరైనా ఏడిపిస్తున్నారా?’‘ఊహూ’‘నీ బాడీతో ఎవరైనా తప్పుగా వ్యవహరించారా?’‘ఊహూ’‘మరేంటి... ఎందుకు దూరంగా వెళ్దామనుకుంటున్నావు. అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైజాగ్‌లో చదువుకుంటుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళతానంటావేంటి?’‘నాకు వెళ్లాలని ఉంది’‘ఎందుకు?’‘నాకు మా అమ్మా నాన్నల గొంతు వినపడనంత దూరంగా వెళ్లాలని ఉంది’ సైకియాట్రిస్ట్‌ ఆ అమ్మాయిని ఓదార్పుగా చూసింది.నేను మా ఇంట్లో ఎక్కువగా ఎక్కడ ఉంటానో తెలుసా డాక్టర్‌? టెర్రస్‌ మీద. నేను ఇంట్లో కన్నా, నా రూమ్‌లో కన్నా, హాల్లో కన్నా, డైనింగ్‌ ఏరియాలో కన్నా టెర్రస్‌ మీదే ఎక్కువ ఉంటాను. ఎందుకంటే మా అమ్మానాన్నల కొట్లాట అక్కడకు వినిపించదు కాబట్టి.

నా ఎనిమిదవ ఏట మొదటిసారి నేను ఉలిక్కిపడి నిద్ర లేచాను. ఆ రోజున మా అమ్మా నాన్న దేనికో తగూలాడుకుంటున్నారు. నాకేం అర్థం కాలేదు. అమ్మ ఏడుస్తోంది. నాన్న పెద్ద పెద్దగా తిడుతున్నారు. నాతో బాగా మాట్లాడే నన్ను ఆడించే ఆ సమయంలో ఎంతో ప్రేమగా అందంగా కనిపించే అమ్మా నాన్నలు ఎందుకో ఆ క్షణంలో నాకు కురూపులుగా కనిపించారు. చాలా భయపడిపోయాను. ఎక్కడకు వెళ్లాలో అర్థం కాలేదు. కాని అక్కణ్ణుంచి వెళ్లిపోవాలని మాత్రం అనిపించింది. కాని చిన్నపిల్లను. ఎక్కడకు వెళ్లగలను. రోజులు గడిచే కొద్దీ మా అమ్మా నాన్నల గొడవలు పెరిగాయి. వాళ్లిద్దరికీ అసలు ఒకరంటే ఒకరికి గౌరవం లేదు. ఒకరితో మరొకరు సర్దుకుపోవాలని ఉండదు. ఒకరిని మరొకరు ప్రేమించాలనీ ఉండదు. బద్ధ శత్రువుల్లా ఉండేవారు.

పైగా నన్ను ఎవరు కరెక్టో తీర్పు చెప్పమని వారి గొడవలోకి లాగేవారు. ఎవరు కరెక్ట్‌ అని చెప్పను? అదంతా నరకం. వారు పోట్లాడుకున్నప్పుడల్లా నాకు ఒకటే ఆలోచన పారిపోవాలి అని. పారిపోవాలంటే చదువుకే పారిపోవాలి అని అర్థమయ్యింది. అందుకే ఎక్కువగా కష్టపడి చదివాను. మంచి ర్యాంకులు తెచ్చుకున్నాను. నాకు ఇంట్లో ఉండాలని లేదు. చుట్టుపక్కల చదువుకున్నా వారు వారానికో పదిరోజులకో వస్తారు. అలా వచ్చినా నేను వారిని చూడలేను. భరించలేను. అసలు నాకు వాళ్లను చూడాలనే లేదు. క్షణక్షణం నాలుకలతో పొడుచుకుంటూ గాయపరుచుకునే వీరు నా దృష్టిలో తల్లిదండ్రులు కావడం అటుంచి అసలు మనుషులే కాదు’ అందా అమ్మాయి.‘ఓటమిని అంగీకరించడం అంటే ఎదుటి వారి పట్ల ప్రేమను ప్రదర్శించడమే.

ముందు మీరు ఆ చర్యను నేర్చుకోవాలి’ అంది సైకియాట్రిస్ట్‌ ఆ అమ్మా నాన్నలతో.‘మీరు ఒకరి మీద ఒకరు గెలవాలనుకుంటున్నారు. ఒకరి చేతిలో మరొకరు ఓడాలనుకోవడం లేదు. ఓడండి. మీ భార్య చేతిలో లేదంటే భర్త చేతిలోనే కదా ఓడుతున్నారు. దాని వల్ల ఏమవుతుంది మీ బంధం నిలబడుతుంది. మీ అమ్మాయి గెలుస్తుంది. ఇష్టం లేనివి 99 ఉన్నా ఇష్టం ఉన్న ఒక్క విషయం గురించి మీరు మరింత మంచిగా కలిసి ఉండటం చాలా అవసరం అని మీ అమ్మాయి మానసిక స్థితి వింటే అర్థమవుతోంది. మీరు మారితే ముగ్గురూ గెలుస్తారు. ఇలాగే ఉంటే ముగ్గురూ ఓడిపోతారు.

ఆలోచించండి’ అంది సైకియాట్రిస్ట్‌.అమ్మాయి తల్లిదండ్రులకు ప్రమాదం పూర్తిగా అర్థమైంది.కూతురిని పిలిచి మాట ఇచ్చారు.‘అమ్మా మమ్మల్ని క్షమించు. ఇక మీద మేం నీ కోసం మారతాం. మేము కూడా కౌన్సిలింగ్‌కు వెళతాం. నీ ఎదుట పోట్లాడి నీ మనసు కష్టపెట్టం. మాకు నువ్వంటే ఇష్టం. నీ కోసం మేం కూడా ఒకరినొకరం ఇష్టపడతాం. మాకు ఆరునెలలు టైమ్‌ ఇవ్వు. అంతవరకూ ఈ ఊళ్లోనే చదువు. అప్పటికీ మాలో మార్పు రాకపోతే మా నుంచి దూరంగా వెళ్లిపోదువు. నువ్వు లేకుండా బతకలేం తల్లీ’...ఆరునెలలు గడిచాయి.ప్రస్తుతం ఆ అమ్మాయి వైజాగ్‌లోనే చదువుకుంటోంది. బి.టెక్‌ అక్కడే పూర్తి చేయనుంది.ఆ ఇల్లు ఇప్పుడు బయటి వారికే కాదు లోపలి వారికి కూడా నివాసయోగంగా మారింది.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

>
మరిన్ని వార్తలు