లక్ష్య సాధనకు తపనే ఊపిరి!

26 Jan, 2014 22:54 IST|Sakshi
లక్ష్య సాధనకు తపనే ఊపిరి!

ఇష్టమైన కొలువును సాధించాలంటే కేవలం పరీక్షల్లో మార్కులు బాగా వస్తే సరిపోదు. రెజ్యుమె ఘనంగా ఉంటే ఉద్యోగం ఖాయమనుకోవడం పొరపాటే.  మార్కుల కంటే ముఖ్యమైన లక్షణాలు విద్యార్థుల్లో ఉండాలి. సంస్థలు తమ ఉద్యోగుల ఎంపికలో వీటికే పెద్దపీట వేస్తున్నాయి. మౌఖిక పరీక్షల్లో..  అభ్యర్థుల మార్కుల జాబితాలను పక్కనపెట్టి వారి గుణగణాలను, నైపుణ్యాలను, నడవడికను, వ్యక్తిత్వాన్నే ఎక్కువగా పరిశీలిస్తారు. కాబట్టి అలాంటి లక్షణాలను తప్పనిసరిగా పెంపొందించుకోవాలి. అందుకు తగిన కృషి నిరంతరం చేయాలి. మనిషిలో నిజంగా తపన ఉంటే కోరుకున్నది సాధించడం కష్టమేమీ కాదు.
 
టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్:
 
సాంకేతిక పరిజ్ఞానం, ఆంగ్ల భాషపై పట్టు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి వాటితో కార్పొరేట్ సంస్థల్లో అప్పగించిన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయొచ్చు. కాబట్టి ఇంటర్వ్యూలో టైమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు వారి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేశారా? లేదా? అనే విషయాన్ని  పరిశీలిస్తారు. ఇందుకోసం కొన్ని ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతోపాటు సమయానికి ఇచ్చిన ప్రాముఖ్యతను ప్రాధాన్యతా క్రమంలో వివరించాలి. ఇలా చెప్పినప్పుడు అభ్యర్థికి సమయపాలనపై అవగాహన ఉందని ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు తెలుస్తుంది. తోటి విద్యార్థులతో కలిసి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసినప్పుడు మీరు అనుసరించిన ప్రణాళికను వివరించవచ్చు. కాలపరిమితిపై విద్యార్థులు చక్కని అవగాహ నతో ఉండాలి.
 
సాఫ్ట్ స్కిల్స్:

కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌కు సాఫ్ట్ స్కిల్స్‌తో దగ్గరి సంబంధం ఉంది. కార్పొరేట్ సంస్థలు సాఫ్ట్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా అభ్యర్థుల వ్యక్తిత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, సానుకూలంగా మాట్లాడటం, ఆశావహ దృక్పథం, నమ్మకం, ఎదుటివారి కళ్లలోకి నేరుగా చూస్తూ మాట్లాడటం, బృందంలో మాట్లాడటం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం వంటి నైపుణ్యాలను ఇంటర్వ్యూల్లో పరిశీలిస్తారు. ఒక విద్యార్థిలో చక్కటి వ్యక్తిత్వం ఉంటేనే తదుపరి ప్రశ్నలు వేయడానికి సుముఖత చూపుతారు. వ్యక్తిత్వంలో భాగంగా అంకితభావం ప్రదర్శించడం, మృదు స్వభావం, చిరునవ్వు, అర్థం చేసుకుంటూ వినడం, చక్కని శరీర భాష, సమయస్ఫూర్తిని ప్రదర్శించడం వంటి లక్షణాల ద్వారా ఎదుటివారు ఆకర్షితులవుతారు. వ్యక్తిత్వం అనేది అభ్యర్థిలో రాత్రికి రాత్రే జరిగే మార్పు కాదు. కాబట్టి మంచి లక్షణాలను విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలి. ఇందుకోసం తగిన కృషి అవసరం.
 
నిత్య విద్యార్థిగా మారాలి:
 
నేర్చుకోవాలన్న తపన మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ‘నేను నిత్య విద్యార్థిగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’ అంటూ స్వామి వివేకానంద చెప్పినట్లుగా విద్యార్థి దశలో కొత్త విషయాలను నేర్చుకొనేందుకు ప్రయత్నించాలి. బలమైన తపన ఉన్నప్పుడే లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. తపనను లక్ష్యానికి ఊపిరిగా పేర్కొనవచ్చు. తాము ఎంపిక చేసుకొనే అభ్యర్థిలో కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? లేదా? అనే విషయాన్ని కార్పొరేట్ సంస్థలు చూస్తాయి. మీ లక్ష్యం ఏమిటి? నాలుగైదేళ్లలో ఏ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నారు? వంటి ప్రశ్నలను ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరిచ్చే సమాధానాల ద్వారా.. మీకున్న అంకితభావం, తపన ఇట్టే తెలిసిపోతాయి.
 
నమ్మకాన్ని నమ్ముకోవాలి:
 
నమ్మకంతో చేసే ఏ పనైనా సఫలమవుతుందంటారు. నమ్మకం రెండు రకాలు. తమపై తమకు నమ్మకం, ఎదుటి వ్యక్తులపై నమ్మకం. నమ్మకానికి వ్యక్తి ఆలోచనే పునాదిగా చెప్పుకోవచ్చు. తనలోని ఆలోచనలపై పట్టు కొనసాగిస్తూ, ఎదుటివారికీ అంతే పట్టుతో సమాధానం చెప్పగలగాలి. అంతేకాదు ఇతరులను నమ్మడం ద్వారా బృందంలో పనిచేసేటప్పుడు లక్ష్య సాధనకు మార్గం సుగమమవుతుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు అభ్యర్థుల్లో నమ్మకాన్ని పరీక్షిస్తారు. కొన్ని సమయాల్లో చెబుతున్న సమాధానాలు తప్పే అని తెలిసినప్పటికీ మీరు ఎంత నమ్మకంగా చెబుతున్నారు అనేది పరీక్షిస్తారు. అంతేకాదు అభ్యర్థులు తమ తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే ఇంటర్వ్యూ చేసేవారు ప్రశంసిస్తారు.
 
కలివిడితనంతో కలుగును మేలు:
 
ప్రాజెక్ట్‌ల్లో పనిచేసేటప్పుడు కొన్నిసార్లు ఒక్కరే కాకుండా ఇతరులతో కలిసి బృందంగానూ పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నైపుణ్యాన్ని విద్యార్థులు కళాశాలలో ఉన్నప్పుడే అలవర్చుకోవాలి. ప్రాజెక్ట్‌ల్లో భాగంగా రకరకాల వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. బృందంలోని ఇతర సభ్యులతో స్నేహపూర్వకంగా, కలుపుగోలుగా వ్యవహరిస్తే త్వరగా నిలదొక్కుకుంటారు. ఒక బృందంలో పని చేసినప్పుడు ఎదుటివారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం, ప్రతిస్పందించడం వంటి లక్షణాలతో వారిని ఇట్టే ఆకట్టుకోవచ్చు. ఎదుటివారు చెప్పిన విషయాలకు సానుకూలంగా ప్రతిస్పందించడం వల్ల మీపై వారికి గౌరవం పెరుగుతుంది.

ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడంలో మీ వంతు భాగస్వామ్యాన్ని సంస్థ యాజ మాన్యానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. బృందంలో పని చేసేటప్పుడు కాలానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకు, మీ సంస్థకు చెడ్డపేరు రావొచ్చు. కాబట్టి బృందంలో పని చేసిన అనుభవాన్ని ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. ఇందుకోసం విద్యార్థులు తమ కళాశాలలో నిర్వహించే వార్షికోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. వీటిలో మీ పాత్ర ప్రశంసనీయంగా ఉండాలి. మీరు తోటి విద్యార్థులతో కలిసి ఎంత విలక్షణంగా, సృజనాత్మకంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు అనేది ఉదాహరణలతో సహా వివరించాలి.

బృందంలో పనిచేసినప్పుడు మీరు ఆచరించిన ప్రణాళిక, ఎదుర్కొన్న ఇబ్బందులు, సమయానికి ఇచ్చిన ప్రాధాన్యత వంటి వాటిని ప్రస్తావించాలి. సమూహాల్లో పనిచేసే తత్వానికి ప్రాంగణ నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇతర సభ్యులతో కలిసి పని చేయడం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయి. నాయకత్వ లక్షణాలకు మూలం సవాళ్లను ఎదు ర్కొనే ధైర్యం ఉండడం. ఒక విద్యార్థి ఏ సమయంలోనైనా సవాళ్లను ఎదుర్కొనే లక్షణాన్ని కలిగి ఉంటేనే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలు గుతాడు.
 

మరిన్ని వార్తలు