అందమైన ఆత్మవిశ్వాసం

16 Sep, 2016 23:21 IST|Sakshi
యాసిడ్ దాడికి ముందు.. (ఇప్పుడు ఇలా..) నిండెన ఆత్మవిశ్వాసంతో రేష్మ

ఆసిడ్ బ్యూటీ ఇన్ న్యూయార్క్
దాక్కోవాల్సింది దాడికి గురైనవారు కాదు. దాడి చేసినవారు. బహిష్కృతులు కావలసింది బాధితులు కాదు. బాధించినవారు. బూడిదలో నుంచి ఫీనిక్స్‌లు మాత్రమే లేవవు. రేష్మా వంటి ఆడపిల్లలు కూడా ఎగురుతారు. రెక్కల్లో బలం గుండెల్లో ధైర్యం  ఊపిరి నిండా ఆత్మవిశ్వాసం... జీవితం చూపుడు వేలు ఆడిస్తే రేష్మా దాని వైపు చూపుడువేలు ఆడించింది. ‘ఎస్... ఇది నా జీవితం... నువ్వు ఓడించలేవు... ఖబడ్దార్’... అంది!
 
మొన్నటి సెప్టెంబర్ 8న న్యూయార్క్‌వాసులు ఒక గొప్ప సౌందర్యాన్ని చూశారు. ముఖం కాలి, ఒక కన్ను లొత్తబోయి, చూడ్డానికే కలవరం కలిగే ఒక ముఖం ఉన్న అమ్మాయి ఎంతో ధైర్యంతో ర్యాంప్‌వాక్ చేయడం వాళ్లు చూశారు. ఒక్క క్షణం ఆశ్చర్యం. ఒక్క క్షణం కలవరం. మరు నిమిషం హర్షాతిరేకాలతో కరతాళధ్వనుల తాకిడి. ‘రేష్మా... రేష్మా’... గ్యాలరీ నుంచి ప్రోత్సాహకరంగా అరుపులు. ఆసిడ్ దాడికి ముందు రేష్మ- బ్యూటీ. ఆసిడ్ దాడి తర్వాత కూడా బ్యూటీనే. ఆసిడ్ బ్యూటీ. గాయం దేహాన్ని ఛిద్రం చేసుండొచ్చు.  కాని ప్రయాణాన్ని కాదు. ఇది రేష్మ కథ.
     
నా పేరు రేష్మా. మాది ఉత్తరప్రదేశ్. మా అక్క, నేను అక్కడే పుట్టాము. మా నాన్న మా జీవనం కోసం ముంబై వచ్చాడు. అక్క పెళ్లి ఉత్తరప్రదేశ్‌లోనే జరిగింది. అయితే అక్కకూ బావకూ భేదాభిప్రాయాలు వచ్చాయి. అక్క మా దగ్గరకు వచ్చింది. చిన్న కుటుంబ సమస్యే అనుకున్నాము. కాని మా బావ తీవ్రంగా మా అక్క  మీద పగ పట్టాడని మాకు తెలియదు.
 
2014లో ఒక రోజు
నేను, మా అక్క చాలా రోజులైందని మా సొంత ఊరు వెళ్లాము. బంధువులను కలిసి స్టేషన్‌లో రైలు కోసం నిలబడి ఉన్నాము. ఒక్కసారిగా కొంతమంది మమ్మల్ని చుట్టు ముట్టారు. ఏం జరుగుతున్నదో తెలిసేలోపే నా ముఖం భగ్గున మండింది. లక్షలాది గాజు పెంకులు దిగబడిన బాధ. తీవ్రమైన మంట. జ్వలనం. ఆసిడ్... ఆసిడ్... మా అక్క పెద్దగా కేకలు వేసింది. వచ్చినవాళ్లు తొట్రుపడి పారిపోయారు. వారిలో మా బావ ఉన్నాడని తర్వాత తెలిసింది. వాస్తవానికి వాళ్లు వచ్చింది మా అక్క మీద దాడి చేయడానికి. కాని ఇద్దరం బురఖాలలో ఉండటంతో నేనే మా అక్క అనుకున్నారు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు.
 
నరకం మొదలైంది
ఆసిడ్ దాడి తర్వాత నరకం అంటే ఏమిటో తెలిసి వచ్చింది. నాన్న సంపాదన అంతంత మాత్రం కావడంతో బంధువులంతా తలా కొంత వేసుకుని నాకు చికిత్స చేయించారు. అయితే  కనీసం పది లక్షలు ఉంటేనే కాని ప్లాస్టిక్ సర్జరీలు పూర్తి చేయడం సాధ్యం కాదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆడపిల్ల బతుకు నాశనం కాకూడదని తెలిసిన వాళ్లంతా అంత డబ్బూ పోగేసి ప్లాస్టిక్ సర్జరీలు చేయించారు. కాని నాకు తెలియదు. ఆ సర్జరీలన్నీ పూర్తిగా ధ్వంసమైపోయిన నా ముఖాన్ని కనీసం మానవ ముఖంగా చూపించడానికి చేసిన ప్రయత్నం మాత్రమేనని!

ఆసిడ్ దాడి నుంచి కోలుకున్న రేష్మా ఖురేషీ వీడియోల ద్వారా బ్యూటీ టిప్స్ చెబుతున్నారు. ఆమె ‘లిప్‌స్టిక్’ గురించి చెప్పిన వీడియోను 15 లక్షల మంది వీక్షించారు. ఇదే కాదు  ఇండియన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ ఆధ్వర్యంలో రేష్మా ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటున్నారు.
 
నా జీవితం మారింది
సర్జరీ పూర్తయిన తరువాత ఒక రోజు నా ముఖాన్ని నన్ను చూసుకునే అనుమతి ఇచ్చారు. చూసుకున్నాను. పెద్దగా ఆర్తనాదం చేశాను. దేవుడా... ఎందుకిలా చేశావు అని గుండెలు బాదుకుని ఏడ్చాను. నా ముఖం ముఖంలా లేదు. అసలది ఏ ముఖమూ కాదు. నా రెండు కళ్లు ఉండవలసిన స్థానంలో లేవు. ఒక కన్ను పూర్తిగా పోయింది. ముడతలు పడిన ముఖం. కందిపోయిన చర్మం. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఏంచేస్తారు? నేను అదే చేద్దామనుకున్నాను. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను.

నేను మానసికంగా కుంగిపోవడం చూసిన మా అక్క, మా తల్లిదండ్రులు నన్ను ముంబైలోని ‘మేక్ లవ్ నాట్ స్కార్స్’ అనే సంస్థకు తీసుకువెళ్లారు. ఆ సంస్థ వారు నాకు కౌన్సెలింగ్ చేశారు. నాలో ఎంతో మార్పు తీసుకువచ్చారు. ఆ సంస్థలో వలంటీరుగా చేరాను.  వారు గతంలో రేఖ అనే ఆసిడ్ బాధితురాలికి చికిత్స చేయించారు. ఆమె పరిచయం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. రేఖ, నేను ఇద్దరం ఒకరికొకరం ఆలంబనగా నిలిచాం. క్రమంగా నేను ఇప్పుడు ఆ సంస్థ నిర్వహించే ప్రచార కార్యక్రమంలో మోడల్‌ని అయ్యాను.

ఆసిడ్ దాడి చట్టం ప్రకారం ఆసిడ్ దాడి చేసిన వారికి కనీసం పది సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. రేష్మా విషయంలో ఆమె బావను అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తిని  బెయిల్ మీద విడుదల చేశారు. మరో ఇద్దరికి మాత్రం శిక్ష విధించారు.

వారే స్ఫూర్తి...
‘మేక్ లవ్ నాట్ స్కార్స్’ సంస్థ వారి మాటలు నాకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయి.  ఆసిడ్‌ను బహిరంగంగా అమ్మకూడదని ‘ఎండ్ ఆసిడ్ సేల్’ పేరిట ఉద్యమం చేశాను. 2013లో సుప్రీంకోర్టు ఆసిడ్‌ను నిషేధించిందని మనకు తెలుసు. కాని ఇప్పుడు అన్ని ప్రదేశాలలోను విచ్చలవిడిగా దొరుకుతోంది. చట్టం చేయడం కంటే ఆ చట్టాన్ని అమలు చేయడమే ముఖ్యమని నా ప్రచారం సాగుతున్నది.
 
మరపురాని సంఘటన... ఫ్యాషన్ వీక్...
న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ నుంచి నాకు ఆహ్వానం అందింది. సెప్టెంబరు 8, గురువారం నాడు నేను అక్కడ ర్యాంప్ వాక్ చేశాను. అందరి కెమెరాలు నన్ను చూసి క్లిక్ క్లిక్‌మన్నాయి. ఆ షోలో నాకు ప్రసంగించే అవకాశాన్ని ఇచ్చారు. నాకు తెలుసు... ఇది వ్యక్తిగత ప్రసంగం కాదని... నా మాటలు బాధితురాలైన ప్రతి స్త్రీకి ఉత్తేజాన్ని ఇవ్వాలని. అందుకే ఇలా అన్నాను-
 
‘ఆసిడ్ దాడి జరిగినా సరే న్యూయార్క్‌కు రావడం, అందునా అందానికి విలువ ఇచ్చే వేదిక మీద ఆత్మవిశ్వాసమే అందం అని చాటి చెప్పగలగడం నాకు సంతోషంగా ఉంది. ఇతర ఆసిడ్ బాధితులు నన్ను చూడాలని, నా ద్వారా ప్రేరణ పొందాలని కోరుకుంటున్నాను. మన గురించి మనం తెలుసుకోవడమే అందంతో సమానం. మాలాంటి వాళ్లం జీవితాన్ని గడపడానికి ఎంతో ధైర్యం కావాలి. కాని అదేమీ పెద్ద కష్టం కాదని చెప్పదలుచుకున్నాను. మిగిలిన ఆసిడ్ బాధితులను కూడా నా లాగే ధైర్యంగా బయటకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. వారు ఏది చేయగలరో ఆ పని చేయమని పిలుస్తున్నాను’ అని ఉద్విగ్నంగా ప్రసంగించాను. ఇది నా జీవితంలో మరపురాని సంఘటనగా భావిస్తాను. అందరూ నా మాటలను స్వాగతిస్తూ పెద్దగా చప్పట్లు కొట్టారు. అవి ప్రపంచమంతా వినపడాలని నా కోరిక.
- డాక్టర్ వైజయంతి

మరిన్ని వార్తలు