'ఏడు'పించే ఎసిడిటీ మనకిక వద్దు!

16 May, 2016 01:25 IST|Sakshi
'ఏడు'పించే ఎసిడిటీ మనకిక వద్దు!

ఎసిడిటీ మొదలవగానే కడుపులో మంట మొదలైపోతుంది. కడుపు ఉబ్బిపోతుంది. కడుపులో ఇబ్బంది కలుగుతుంది. కడుపులోంచి గొంతులోకి బ్లో అవుట్‌లా బ్లోటింగ్ రూపంలో వస్తుంటాయి. అనగా ఎడతెరిపి లేకుండా తేన్పులు ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడుతూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి ఈ సమస్యనుంచి దూరం కావడానికి మందూ మాకూ వాడకుండానే కేవలం ఏడు జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఏడుపించే సమస్యలు మాయం. మందులు వాడనవసరం లేదనంటే మరీ మంచిదేగా! ఆరోగ్యానికి హెవెన్ ఈ కిందనున్న సెవెన్!
 
1. ఒంటి బరువు తగ్గితే... కడుపు బరువూ తగ్గుతుంది...
పెరిగే బరువును కాస్త అదుపులో పెట్టుకోండి. కనీసం నాలుగైదు కిలోలు తగ్గితే... కడుపు కష్టాలు నాలుగింతలు తగ్గుతాయి. బరువు తగ్గడం నలు విధాల మాత్రమే కాదు పలువిధాల ఆరోగ్యం. కడుపునకూ మహాభాగ్యం.
 
2. జఠరాగ్నికి ఆజ్యం ఆల్కహాల్...
అసలే యాసిడ్. దానికి ఆల్కహాల్ తోడైతే మరింత ముప్పు. ఆహారాన్ని కాల్చేందుకు వాడే ద్రవరూపంలో ఉండే అగ్నే ఈ యాసిడ్.  ఆల్కహాల్ తాగడం అంటే ఈ యాసిడ్‌కు మరింత ఆజ్యం పొయ్యడమే. అప్పుడు ఆల్కహాల్ తోడైన యాసిడ్ కడుపులోని రక్షణ కణాల పొరను దెబ్బతీస్తుంది. అందుకే ఎసిడిటీ ఉన్న కొందరిలో మద్యం తాగగానే అది ఆల్కహాలాహలంగా మారిపోతుంది. యాసిడ్ జ్వాలల మంట గొంతులోకి తంతుంటుంది. ఎసిడిటీ ఉన్నవారిలో ఆల్కహాల్ మానేస్తే... అంతా చీర్సే!
 
3. పొగతాగకండి... కడుపులో ‘పొగ’ రాజేయకండి...
పొగ ఊపిరితిత్తులనే ఉక్కిరిబిక్కిరి చేస్తుందనుకుంటున్నారా?  పొగ తాగితే కడుపులో నెగడు మండించినట్లే. పొగ వల్ల భుగభుగమని సెగ లెగయగ ఆసిడ్ గొంతులోకి వస్తుంది. పీల్చినప్పుడు పై నుంచి లోపలికి, పీల్చాక కడుపులోంచి పైకి... ఇలా టూ వేస్‌లోనూ టూ మచ్ ప్రాబ్లమ్. పొగ మానేస్తే నో ప్రాబ్లమ్. అన్నట్టు పొగతో ఆహారకోశం (స్టమక్) నుంచి గొంతులోకి ఉండే మార్గం (అన్నవాహిక-ఈసోఫేగస్)లోకి ఆహారాన్ని పైకి రానివ్వకుండా చూసే కవాటం వదులవుతుంది. దాంతో దాంట్లోంచి యాసిడ్ తేన్పులు పొగలు గక్కుతుంటాయి. కడుపులోని సున్నిత పొరల్నీ రక్కుతుంటాయి. కడుపు పొరలపై పగబట్టే పొగ తాగే అలవాటు వదిలేయండి. స్మోకింగ్ మానేసి కింగ్‌లా ఉండండి.
 
4. రఫ్ఫాడించే కెఫిన్...
కాఫీలోనూ, కొన్ని కూల్‌డ్రింకుల్లోనూ ఉండే కెఫిన్ సైతం కడుపు పొరలపై రఫ్ఫ్‌గా వ్యవహరిస్తుంటుంది.  కెఫిన్ కూడా పొగలాగే కడుపులోంచి   ఈసోఫేగస్‌లోకి ఆహారాన్ని రానివ్వకుండా చూస్తే ‘లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్’ను సరిగా మూసుకోనివ్వదు. దాంతో కాఫీ తాగగానే కొందరికి దాని రుచి  గొంతులోకి వచ్చేసే అనుభవం చాలా సాధారణం. కెఫిన్‌ను తగ్గించుకోండి. యాసిడ్  తుఫాన్‌ను నివారించుకోండి.
 
5. గ్యాస్ ఉండే డ్రింకులతో గ్యాస్ట్రో వ్యవస్థకు దెబ్బ...
 అసలే గ్యాసు పైకి తన్నే సమస్య ఉండనే ఉంది. దీనికి తోడు సోడాలు, కూల్ డ్రింకుల వంటి వాటిలో ఉండే గ్యాసు తోడయ్యిందనుకోండి. ఈ డబుల్‌గ్యాస్‌లతో కడుపుకు ట్రబుల్ పెరుగుతుంది. ఈ  గ్యాస్... కడుపునుంచి తప్పించుకోడానికి గ్యాప్ వెతుకుతుంటాయి. తేన్పుల రూపంలో బాధిస్తుంటాయి. గ్యాస్‌కు తోడైన యాసిడ్ కూడా గొంతులోకి చేదుగా వస్తుంటుంది. మాటిమాటికీ బాధిస్తుంటుంది.
 
6. అన్నం మితమైతే అన్నకోశానికీ హితం...
ఒక్కసారిగా అన్నం ఎక్కువగా తినేస్తే కడుపు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కడుపుబ్బరం అనిపిస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారూ, కడుపుబ్బరంతో బాధపడేవారూ తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త పెద్ద ఫలితాన్నే ఇస్తుంది. మితమైన మోతాదులతో ఎక్కువ సార్లు తినడం అన్నకోశానికీ మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరంతో సతమతమయ్యే బాధనూ నివారిస్తుంది.
 
7. తిన్నవెంటనే స్లీపేయకండి...
సమస్యను నిద్రలేపకండి : కొందరు ఇలా తినేసి, అలా పడుకుంటుంటారు. తిన్నవెంటనే స్లీపేయడం అంటే కడుపు సమస్యలను నిద్రలేపడమే అంటున్నారు నిపుణులు. మనం నిద్రపోవగానే పక్కకు ఒరుగుతాం. దాంతో గ్రావిటీ వల్ల యాసిడ్ అన్నంపైనే ఉండకుండా అదీ కాస్తంత పక్కకు ఒరుగుతుంది. అంటే నేరుగా అన్నంపై పనిచేయకుండా కడుపు పొరలపై ఎక్కువగా పనిచేస్తుంటుందన్నమాట.

సీసాను నిలబెట్టకుండా పక్కకు ఒరిగేలా పడుకోబెట్టినప్పుడు ద్రవం సీసా గొంతులోకి వచ్చినట్లుగానే... యాసిడ్ కూడా గ్రావిటీ బలంతో కాస్తంత గొంతులోకి అంటే ఈసోఫేగస్‌లోకి వచ్చేస్తుంది. ఇందుకే అన్నం తినీతినగానే... పడక మీద పడిపోవద్దు. ఆహారానికి రాత్రి నిద్రకు మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూడండి. కడుపులోని అన్నం పేగుల్లోకి కదిలిపోయేందుకు కాస్త టైమిస్తే... మన టైమ్ బాగుంటుంది. హెల్త్ కూడా బాగుంటుంది.
 
మందులు కొనడం ఎందుకు? అసలే బాగా లేని కడుపులోకి మళ్లీ వాటిని ఎందుకు?  ఖర్చు ఎందుకు కడుపును రొచ్చు చేసుకోవడం ఎందుకు? అసలు టాబ్లెట్ అన్న ఊసే లేకుండానే... పై ఏడు మార్గాలతో ఏడిపించే ఎసిడిటీ నుంచి దూరం కావచ్చు.

- డాక్టర్ సుధీంద్ర ఊటూరి
 కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్

మరిన్ని వార్తలు