ఆ మూడు కోరికలూ తీరకుండానే వెళ్లిపోయారు!

16 Nov, 2014 00:11 IST|Sakshi
ఆ మూడు కోరికలూ తీరకుండానే వెళ్లిపోయారు!

- నటుడు కాంతారావు భార్య హైమవతి
హైదరాబాద్... నల్లకుంట కూరగాయల మార్కెట్ దాటి కొంచెం ముందుకెళ్తే ఎడమవైపున కార్తీక్ రెసిడెన్సీ. ఫస్ట్ ఫ్లోర్‌లోని ఆ ఫ్లాట్‌లోకి అడుగుపెడితే... ఎదురుగా చిన్న మంచం మీద కూర్చుని ఓ పెద్దావిడ ఓ పుస్తకంలో సాయికోటి రాసుకుంటూ కనిపించారు. ఆ పక్కనే టీవీలో ‘లవకుశ’ సినిమాలోని ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...’ పాట వస్తోంది. ఆ పాటలో హీరో కాంతారావును చూడగానే ఆ పెద్దావిడ మొహం వెలిగిపోయింది. ఆమె కాంతారావు భార్య హైమవతి. 81 ఏళ్ల వయసులోనూ ఆమెకు గతమంతా స్పష్టంగా గుర్తుంది.

ఆ స్టార్‌డమ్... లంకంత కొంప... కార్లు... నౌకర్లు... ఇలా అన్నీ ఆమెకు గుర్తున్నాయి. ఆమెకు గతం రాజభోగమైతే... వర్తమానం వనవాసం. స్వర్గమైనా.. నరకమైనా... అంతా లలాట లిఖితం అనుకునే  స్థితప్రజ్ఞత ఆమెది. రాజభోగాన్ని ఎలా ఆస్వాదించారో... వనవాసాన్నీ ఆమె అలానే స్వీకరిస్తున్నారు. కాంతారావంటే కత్తి ఫైటింగులు గుర్తొస్తాయి. తెరపై శత్రువులతో, జీవితంలో సమస్యలతో కత్తి ఫైటింగ్ చేసిన వీరుడాయన. రాముడి వెంట లక్ష్మణుడిలా ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉన్నారామె. నేడు కాంతారావు 91వ జయంతి. ఈ సందర్భంగా భర్త గురించి హైమవతి హృదయావిష్కరణ...

 
మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా?
హైమవతి: బాగానే ఉంది. ఒకవేళ బాగోకపోయినా బాగానే ఉందని మనసులో అనుకుని తిరుగుతూనే ఉంటాను.
 
కాంతారావుగారు చనిపోయి అయిదేళ్ళపైనే అవుతోంది కదమ్మా!
హైమవతి: 2009 మార్చి 22న వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇలా ఆయన జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నా.

ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు. మరి కాంతారావు గారి విజయం వెనుక మీ పాత్ర ఎంత?
హైమవతి: నా పాత్ర ఏముంటుంది! ఆయనకు అనుకూలంగా ఉండేదాన్ని. మామూలుగా హీరోలు తెరపై హీరోయిన్లతో సన్నిహితంగా మెలగాల్సి వస్తుంది. అవి చూసి నేనేమీ ఫీలయ్యేదాన్ని కాదు. అదంతా నటనలో ఓ భాగమని తెలుసు. ఇంటి పోరు లేకుండా ఉంటే మగాడు సగం విజయం సాధించినట్టేగా! వాళ్లతో అంత సన్నిహితంగా ఎందుకు నటించారని అడిగితే, వాళ్లకీ మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకుండా వాళ్లు మాత్రం ఎలా యాక్ట్ చేయగలుగుతారు!
 
ఏ విషయంలోనూ ఆయనతో మీకు అభిప్రాయ భేదాలు రాలేదా?
హైమవతి: నేనెప్పుడూ ఏ విషయంలోనూ ఆయనతో పోట్లాట పెట్టుకోలేదు. అన్నీ సమకూరుస్తున్నప్పుడు అసంతృప్తులెందుకొస్తాయి?
     
ఆయన హీరోగా సంపాదించిందంతా, నిర్మాతగా పోగొట్టినప్పుడు కూడా మీరేమీ అనలేదా?
హైమవతి: నేనేమీ అనలేదు.

కనీసం సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవారు కాదా?
హైమవతి: నేనేమిస్తానండీ.. ఆయనకన్నీ తెలుసు. పైగా మొండి మనిషి. చెప్పినా వినే రకం కాదు. అనుకున్నది చేసేసేవారంతే! ఆయనకు వంశ పారంపర్యంగా 500 ఎకరాల పొలం ఆస్తిగా వచ్చింది. చాలామటుకు దానధర్మాలు చేసేశారు. చివరికి మా పెళ్లి నాటికి 70 ఎకరాలు మిగిలింది. ఆ తర్వాత అదీ లేదు. సినిమాలు తీసి అప్పులపాలయ్యాం. ఆయనకు ఎవ్వరికీ బాకీ ఉండడం ఇష్టం ఉండదు. ఆస్తంతా అమ్మి, అప్పులు తీర్చేశారు.
     
ఇంట్లో మీతో ఎలా ఉండేవారు?
హైమవతి:
మమ్మల్ని చక్కగా చూసుకునేవారు. ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చేవారు. నేను పూర్వజన్మలో బాగా పుణ్యం చేసుకోబట్టే, దేవుడు నాకంత మంచి భర్తనిచ్చాడు. బంధుమిత్రులను కూడా బాగా చూసుకునేవారు. ఇంటికొచ్చినవారిని భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు. ఒకప్పుడు మా ఇంట్లో రోజుకి 18 మంది భోజనం చేసేవారు. ఇంట్లో నాలుగు కార్లు ఉండేవి. పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్లడానికి ఓ కారు, ఆయనకో కారు, నా కోసం ఓ కారు, ఒకటి గెస్ట్‌ల కోసం. మద్రాసులో మా ఇంటి పక్కనే గుడిసెలు ఉండేవి.

వర్షం వస్తే వాళ్లకు మా ఇంట్లోనే ఆశ్రయం. వాళ్లింట్లో పెళ్లిళ్లయినా మా ఇంట్లోనే హడావిడి! మా అమ్మానాన్నలను కూడా బాగా చూసుకున్నారు. అమ్మ పక్షవాతం బారిన పడితే, మూడేళ్లు మా ఇంట్లోనే పెట్టుకుని కంటికి రెప్పలా చూశాం. నేనెప్పుడైనా అమ్మను విసుక్కుంటే, ఆయన నన్ను బాగా కోప్పడేవారు.
     
ఇంతకూ మీరు కాంతారావుగారిని మొదట ఎప్పుడు చూశారు?
హైమవతి: నిజామ్ ఏలుబడిలో రజాకార్ల దురాగతాలు సాగుతున్న సమయంలో నైజామ్ ప్రాంతం నుంచి చాలామంది ఆంధ్రాకు వలస వెళ్లిపోయారు. కాంతారావుగారూ అంతే. కోదాడ దగ్గరున్న గుడిబండ గ్రామం నుంచి జగ్గయ్యపేటకు వచ్చి, మా వీధిలోనే ఆయన కాపురం పెట్టారు. మా నాన్నగారు జాతకాలు చెప్పేవారు. ఒకసారి మా నాన్నగారి దగ్గరకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు చూశానాయన్ని. ఆ తర్వాత ఆయన మొదటి భార్య సుశీల, పిల్లవాడు నాకు బాగా సన్నిహితమయ్యారు.
     
కాంతారావుగారిని పెళ్లి చేసుకోమని మిమ్మల్ని సుశీలగారే అడిగారట కదా!
హైమవతి: అవును. ఆవిడకు బాగా అనారోగ్యం. అప్పట్లో కొన్ని జబ్బులకు మందులుండేవి కావు. పిల్లాడు నాకు బాగా దగ్గరవ్వడంతో ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్నగారి దగ్గరకు వచ్చి ఆవిడే ఒప్పించారు. 1950 మార్చి 1న మా పెళ్లి హైదరాబాద్‌లోని నల్లకుంట దగ్గర్లోని ఓ సత్రంలో జరిగింది. మా పెళ్లయిన కొన్ని రోజులకే ఆవిడ పైకి వెళ్లిపోయారు. ఆ తర్వాత పిల్లాడు కూడా అనారోగ్యంతో చనిపోయాడు.
     
మీ పెళ్లయిన వెంటనే కాంతారావుగారు మద్రాసు వెళ్లిపోయినట్టున్నారు?
హైమవతి: అవును. మొదట ‘నిర్దోషి’లో చిన్న వేషం వేసే అవకాశమిచ్చారు దర్శక - నిర్మాత హెచ్.ఎమ్. రెడ్డిగారు. తర్వాత ఆయనే ‘ప్రతిజ్ఞ’తో హీరోను చేశారు.
     
కాంతారావు గారు సినిమా ఫీల్డ్‌కి వెళతానంటే మీరేమన్నారు?
హైమవతి: నాకప్పట్లో ఏమీ తెలిసేది కాదు! ఆయనకు ఇష్టమైన పని ఆయన చేస్తున్నారని భావించేదాన్ని. ఆయనేం చేసినా నాకు ఇష్టంగానే అనిపించేది. భర్త అడుగుజాడల్లోనే నడవాలని మా పెద్దలు చెప్పారు. నేను చదివిన పుస్తకాల సారం కూడా అదే.
     
మిమ్మల్ని షూటింగ్స్‌కి, ప్రివ్యూలకు తీసుకెళుండేవారా?
హైమవతి: చాలాసార్లు! అవుడ్డోర్ షూటింగ్స్‌కి ఎక్కువ వెళ్లేదాన్ని. నాకు ఇంగ్లీషు రాదు. కొత్తవాళ్లతో మాట్లాడడం తెలిసేది కాదు. అక్కడ లొకేషన్‌లో ఎవరైనా, ఏదైనా అడిగితే చెప్పేదాన్ని. లేకపోతే కుర్చీలో కూర్చుని షూటింగు చూసేదాన్ని.
     
సినిమా ఫీల్డ్‌లో మీకు సన్నిహితులు ఎవరూ లేరా?
హైమవతి: ఎవ్వరూ లేరు. నేనెక్కడికీ వెళ్లేదాన్ని కాదు. అప్పుడప్పుడూ ఆయనతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళ్లేదాన్ని.
     
కాంతారావుగారికి దర్శకుడు విఠలాచార్య ఎంత లైఫ్ ఇచ్చారో, అంత ఇబ్బంది పెట్టారటగా?
హైమవతి: ఏమో..! అవన్నీ నాకు తెలియదు. నేను అడిగేదాన్ని కాదు. ఆయన చెప్పేవారు కాదు.
     
పరిశ్రమలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వివక్ష గురించి కూడా ఆయన మీతో ప్రస్తావించేవారు కాదా?
హైమవతి: ఏ కష్టమైనా ఆయన మనసులోనే పెట్టుకునేవారు. నాకు చెప్పేవారు కాదు. (కాంతారావుగారి మూడో అబ్బాయి రాజా, తల్లి పక్కనే కూర్చుని ఆసక్తిగా ఈ సంభాషణ గమనిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆయన కల్పించుకుని జవాబు చెప్పారు).
 
రాజా:  అప్పట్లో హీరోల మధ్య పోటీ ఎలా ఉండేదో నాన్న నాకు చెబుతుండేవారు. కులం, ప్రాంతం తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో రకరకాల సంఘటనలు నాకు చెప్పారు. నాన్నకు లౌక్యం తెలియదు. పారితోషికంగా ఎవరు ఎంతిచ్చినా తీసుకునేవారు. పాత్ర ప్రాధాన్యం ఎలాంటిదో తెలుసుకోకుండానే, సినిమాలు ఒప్పేసుకునేవారు. దీనివల్ల చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. పారితోషికాలు కూడా పెంచేవారు కాదు. ఎప్పుడూ ఒకటే రేటు. కొంతమంది నిర్మాతలైతే - ‘కాంతారావుకు ఇంతకు మించి ఇవ్వొద్ద’ని రేటు కూడా ఫిక్స్ చేసేశారు. అయినా కూడా నాన్న ఏమీ మాట్లాడేవారు కాదు! ఇంకొంతమంది డబ్బులు కూడా పూర్తిగా ఇచ్చేవారు కాదు.
     
హీరోగా అన్ని సినిమాలు చేసి కూడా ఆయన ఆస్తులు కూడబెట్టుకోకపోవడానికి కారణం?
హైమవతి: స్థలాలు కొనలేదు కానీ, మద్రాసులోని టి. నగర్‌లో పెద్ద ప్యాలెస్ లాంటి బంగ్లా కట్టించారు. ఆ ఇంటి గురించి అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు. చూడడానికి చాలామంది హీరోయిన్లు కూడా వచ్చారు. బాత్‌రూమే బెడ్‌రూమ్ సైజులో ఉండేది. అందులోనే వెరైటీగా మేకప్‌రూమ్ కూడా ఏర్పాటు చేయించారు. ఆ ఇంట్లో మేం 28 ఏళ్లు ఉన్నాం.
     
మరి ఆ ఇల్లు ఏమైంది?
హైమవతి: సినిమాలు తీసి అప్పులు పెరగడంతో 1987లో చాలా చౌకగా 13 లక్షలకు అమ్మేశాం. రెండేళ్ల తర్వాత అదే ఇల్లు కోటి రూపాయల రేటు పలికిందట. ఇప్పుడైతే ఎన్ని కోట్ల విలువ చేస్తుందో..! ఆ 13 లక్షల్లో కొంత అప్పు తీర్చి, మిగిలిన డబ్బుతో ‘స్వాతి చినుకులు’ సినిమా తీశారు. అదే ఆయన తీసిన ఆఖరు చిత్రం. దాంతో మొత్తం పోయింది. నిజానికి ఆయనకు ఆ సినిమా తీయడం ఇష్టం లేదు. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం! అంతా లలాట లిఖితం.
     
కాంతారావుగారి మీద మీకేం కోపం లేదా?
హైమవతి: ఎందుకు కోపం? నన్ను ఓ రాజకుమారిలాగా చూసుకున్నారు. కష్టాలూ నష్టాలూ ఇవన్నీ సహజమే. డబ్బులున్నప్పుడూ... అన్నమే తిన్నాం. ఇప్పుడూ అన్నమే తింటున్నాం. మనవళ్లు డబ్బు పంపించినప్పుడు చాలా బాధపడిపోయేవారు. ‘‘ఇలా వీళ్లమీద ఆధారపడుతూ ఎన్ని రోజులు తినాలో?’’ అనేవారు నాతో. ‘‘పూర్వజన్మలో వాళ్లు మీకు బాకీ ఉండి ఉంటారు. అది తీరేవరకూ పంపిస్తార్లెండి’’ అనేదాన్ని.
     
నిర్మాతగా కాంతారావుగారు అస్సలు లాభం చూడలేదా?
రాజా: అయిదు సినిమాలు తీస్తే ఒక్కటి కూడా హిట్టు కాలేదు. కానీ, ఒకే ఒక్క సినిమా ‘గండర గండడు’కి మాత్రం కొంచెం డబ్బులొచ్చాయి. దేనికి దానికి సరిపోయాయి.
     
మద్రాసు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చేశారు?
హైమవతి: అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడైనా అవకాశాలు వస్తాయని వచ్చేశాం.
రాజా: ఆ రోజు నాకింకా గుర్తుంది. వనవాసానికి బయలుదేరిన సీతారాముల్లాగా అమ్మా నాన్న కట్టుబట్టలతో మద్రాసులో బయలుదేరి హైదరాబాద్ వచ్చేశారు. అప్పుడు ఇక్కడ మా అక్క సుశీల, డాక్టర్ కృష్ణకుమారిగారు హెల్ప్ చేశారు. మొదట హోటల్‌లో ఉండి, తర్వాత హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మెల్లిమెల్లిగా నాన్నకు టీవీ సీరియల్స్‌లో నటించే ఆవకాశాలు రావడం మొదలు పెట్టాయి. సినిమా ఛాన్సులు మాత్రం చాలా తక్కువే వచ్చేవి. నల్లకుంట నుంచి రప్పించడం ఎందుకనుకునేవారు! నల్లకుంట ఏదో వేరే రాష్ట్రం అన్నట్టుగా! అలా కొన్ని అవకాశాలు పోయాయి. మళ్లీ చివర్లో బాగానే అవకాశాలొచ్చాయి.


 ఆఖరు దశలో కొన్ని షూటింగ్స్‌లో కాంతారావుగారిని అగౌరవంగా చూసేవారని ఓ టాక్. నిజమేనా?
రాజా: కొత్త తరానికి కాంతారావుగారి గొప్పతనం తెలియక అలా ప్రవర్తించిన మాట వాస్తవమే. పాత తరం వాళ్లు మాత్రం చాలా గౌరవంగా చూసుకునేవాళ్లు. ఒకసారైతే ఓ ప్రొడక్షన్ వాళ్లు కారు కూడా పంపకుండా ఆటోలో లొకేషన్‌కు రమ్మన్నారు. ఆ రోజు మాత్రం నాన్న చాలా బాధపడ్డారు.
     
ఎంతో వైభవం చూసిన ఆయన చివరకు ఇలా చితికిపోవడాన్ని జీర్ణించుకోగలిగారా?
రాజా: ఈ ఫ్లాట్‌లో బాల్కనీలో కూర్చుని తన స్థితిని అప్పుడప్పుడు తలుచుకుని వాపోయేవారు. కానీ ఏనాడూ మనో నిబ్బరాన్ని కోల్పోలేదు. అంతా విధి రాత అనేవారు.
     
తోటి నటులతో పోలిస్తే ఈయనే ఎందుకింత వెనుకబడి పోయారు?
రాజా: పరిశ్రమలో నిలబడాలంటే కచ్చితంగా ఎవరో ఒకరి అండాదండా ఉండాలి. నాన్నకు అలాంటి బ్యాకింగ్ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నాన్న ఒంటరిగానే తీసుకునేవారు. ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత నాన్న పేరే చెప్పేవారు. ఇప్పుడు క్రమంగా నాన్న పేరు చెప్పడం మానేశారు. ఇలాంటివి విన్నప్పుడు బాధ వేస్తుంది. నాన్న తీసిన అయిదు సినిమాల్లో ఒక్కటి హిట్టయినా, నిలదొక్కుకునేవారు. సంపాదించిందంతా మళ్లీ సినిమాల్లోనే పెట్టారు. అప్పట్లో జూబ్లీహిల్స్‌లో స్థలాలు పది రూపాయిలు, వంద రూపాయిలన్నట్టుగా ఉండేవి. కొనమని కొంతమంది నాన్నకు సలహా ఇచ్చినా, పట్టించుకోకుండా మళ్లీ సినిమాల్లోనే పెట్టారు. అదే పొరపాటు అయిపోయింది.
     
ఆయన ఆఖరి స్టేజ్ గురించి చెప్పండి?
హైమవతి:
హీరోగా ఎంతో వైభవం చూసి, చివరకు ఓ అద్దె ఇంట్లో కాలం గడపాల్సి వచ్చినా బాధపడలేదు. ఈ అతి సామాన్య జీవితాన్ని కూడా బాగానే ఆస్వాదించారు. ఇంటికి దగ్గర్లోనే కూరగాయల మార్కెట్. హాయిగా నడుచుకుంటూ వెళ్లి కూరగాయలు కొనుక్కొచ్చేవారు. ఫంక్షన్లకు కూడా ఆటోల్లోనే వెళ్లేవారు. పిల్లలకు సంపాదించి ఇవ్వలేకపోయాననే బాధ మాత్రం ఉండేది. ‘వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలి’ అని లెక్కలు వేసుకునేవారు.
     
మీ పిల్లల గురించి చెప్పండి?
హైమవతి: మాకు నలుగురబ్బాయిలు, ఒకమ్మాయి. పెద్దవాడు, రెండోవాడు మద్రాసులో ఉంటారు. మూడోవాడు రాజా. నేను వీడితోనే ఉంటున్నాను. నాలుగోవాడూ ఇక్కడే ఉంటాడు. అమ్మాయిదీ హైదరాబాదే.
 
ప్రస్తుతం మీ కుటుంబం ఎలా గడుస్తోంది?
హైమవతి: ఆయన పోయిన దగ్గర్నుంచీ ఎలా బతుకు తున్నామో మాకే తెలీదు. ఎవరో ఒకరొచ్చి సాయం చేసి వెళ్తున్నారు. ఈ అయిదేళ్లూ బతికామంటే దైవకృప.
 రాజా: నాది చాలా చిన్న ఉద్యోగం. ఈ ఫ్లాట్ అద్దే - పది వేలు. ఏదో అలా కాలం గడిచిపోతోంది. 1999 నుంచి 2003 వరకూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు నెల నెలా 5 వేలు పంపించేవారు. దాసరిగారు 2000 మే నుండి 2009 మార్చి వరకూ నెల నెలా 5 వేలు ఇచ్చారు.
     
మీ పిల్లలు ఎవరూ సినిమాల్లోకి రాలేదు కదా!
హైమవతి: రాజా చిన్నప్పుడు ‘సుడిగుండాలు, మరో ప్రపంచం, ఎవరు మొనగాడు, మనుషులు-మట్టి బొమ్మలు’ ఇలా కొన్ని సినిమాల్లో నటించాడు. రాజా కొడుకు సాయి ఈశ్వర్‌కి సినిమాలంటే బాగా ఆసక్తి.
     
కాంతారావు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చినవి?
హైమవతి: అన్నీ నచ్చుతాయి. ముఖ్యంగా ‘లవకుశ’. శ్రీకృష్ణ తులాభారం, ఆకాశరామన్న, శాంతి నివాసం... ఈ సినిమాలన్నీ ఇష్టంగా చూస్తుంటాను.

అవార్డు రాకుండా అడ్డుపుల్లలేశారు!

అవార్డుల విషయంలో కూడా అన్యాయమే జరిగినట్టుంది?
రాజా: కచ్చితంగా జరిగింది. ఎన్టీఆర్ అవార్డు తనకొస్తుందని నాన్న చాలా ఆశపడ్డారు. కొందరు అడ్డుపుల్లలు వేశారు. పేర్లు అనవసరం. కులం, ప్రాంతం కూడా అడ్డొచ్చుంటాయి.
     
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా! మరి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఆశిస్తున్నారా?
రాజా: ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవాలని ఉంది. నాన్న కూడా అప్పట్లో అడిగి ఉంటే ఎమ్జీఆర్, జయలలిత, ఎన్టీఆర్ సాయం చేసేవారేమో. ఒకసారి దూరదర్శన్ కేంద్రంలో ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్నారు. అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఆయనతో అరగంట గడిపారు కానీ, హెల్ప్ చేయమని అడగడానికి మొహమాట పడ్డారు. అడిగివుంటే కచ్చితంగా ఆయన హెల్ప్ చేసేవారు. నాన్న చనిపోయినపుడు కొంతమంది సినీ ప్రముఖులు ‘‘అది చేస్తాం... ఇది చేస్తాం’’ అని స్టేట్‌మెంట్లు ఇచ్చారు కానీ, మళ్లీ ఎవ్వరూ కనబడలేదు. కోదాడలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అదీ లేదు.
     
ఆయన తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునేవారా?
రాజా: మనసులో ఉండేది. ఎప్పుడూ బయటపడలేదు.
     
కాంతారావుగారి ఆఖరి సినిమా ఏది?
హైమవతి: ‘శంకర్‌దాదా జిందాబాద్’. అయితే ‘పాండురంగడు’లో ఒకే ఒక్క సీన్‌లో చేశారు. అది కూడా మోహన్‌బాబుగారు చెప్పడంతో! ఒక్క రోజు వేషమే అయినా, పారితోషికం మంచిగా ఇప్పించారు.
     
కాంతారావుగారికి తీరని కోరికలేమైనా ఉన్నాయా?
హైమవతి: ముఖ్యంగా మూడు ఉండేవి. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండాలని తపించారు. ఒకసారి టి. సుబ్బరామిరెడ్డిగారు ఘన సన్మానం చేసి పది లక్షలిస్తే, ఇల్లు కొందామనుకున్నారు. ఈలోగా క్యాన్సర్ రావడంతో అవి వైద్యచికిత్సకే అయిపోయాయి. ఇక రెండో కోరిక ఏంటంటే - ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు. ప్రభుత్వపరంగా ఆ గుర్తింపు కావాలనుకున్నారు. ఇక మూడో కోరిక ఏమిటంటే - రాష్ట్ర ప్రభుత్వమిచ్చే ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకోవాలని చాలా తపించారు. చాలా రాజకీయాలు జరిగాయి. అదీ జరగలేదు. ఇలా ఆ మూడు కోరికలూ తీరకుండానే వెళ్లిపోయారు.
     
కాంతారావు గారికి క్యాన్సర్ ఉందన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
హైమవతి: 2005 నవంబర్ 16న సరిగ్గా ఆయన పుట్టిన రోజు నాడు మాకీ విషయం తెలిసింది. అప్పటికే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అట! ఆసుపత్రి నుంచి తీసుకురాగానే మూడు రోజులు బాగానే ఉన్నారు. తర్వాత మళ్లీ వాంతులు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం. ఇలా చాలాకాలం బాధపడ్డారు. వేలకు వేల డబ్బులు అలా వెళ్లిపోయాయి.
     
ఫిలిమ్‌నగర్‌లో చాలామందికి స్థలాలు ఇచ్చారు కదా. మరి కాంతారావుగారికి ఇవ్వలేదా?
రాజా: దీనికి జవాబు నేను చెప్తాను. అమ్మకు ఆ వివరాలేమీ తెలియవు. అప్పట్లో స్థలం కోసం రెండు వేల రూపాయలు కట్టారు. తర్వాత 40 వేలు కట్టమన్నారు. అప్పటికి నాన్నగారి దగ్గర డబ్బుల్లేవు. దాంతో ఆ స్థలం రాకుండా పోయింది.
     
అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటారు?
రాజా: ఆయన హీరోగానే ఉండుంటే పరిస్థితి బాగానే ఉండేది. సినిమాలు తీసి మొత్తం పోగొట్టుకున్నారు. ఆయన కెరీర్ మొదట్నుంచీ చివరి వరకూ పరిశ్రమలో ఎదురీదారు. రకరకాల పరిస్థితులు, రకరకాల ఫీలింగ్స్... ఇలా ఎన్నో! చెప్పినా ఇప్పుడు వేస్ట్!
 - పులగం చిన్నారాయణ

మరిన్ని వార్తలు