హుందా నటుడు...

12 Oct, 2015 00:32 IST|Sakshi
హుందా నటుడు...

నాగిన్ స్టార్
 

హిందీలో ప్రదీప్ కుమార్‌లో కనిపించే హుందాతనం తెలుగులో హరనాథ్‌లో చూసేవాళ్లమా? చక్కటి రూపాలతో హుందా అయిన నటనతో ఆకట్టుకున్నవాళ్లే ఇద్దరూ. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్ వెండితెర మీద ఒక వెలుగు వెలిగి నిశ్శబ్దంగానే తెరమరుగు అయ్యాడు. తొలి రోజుల్లో ఆయన నటించిన ‘ఆనంద్ మఠ్’ క్లాసిక్. అందులో ‘వందే మాతరం’... అంటూ ఆయనపై చిత్రీకరించిన పాట పెద్ద హిట్. బీనాదేవితో చేసిన ‘అనార్కలి’, వైజయంతి మాల తో చేసిన ‘నాగిన్’ ఆయన ఖాతాలో ఉన్నాయి. ‘తాజ్ మహల్’ వంటి మ్యూజికల్‌కు ఆయనే కథానాయకుడు అన్న విషయం కూడా ఎవరూ మర్చిపోరు.

మొదట బెంగాలీ సినిమాల్లో ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించిన ప్రదీప్ కుమార్ ఆ రోజుల్లో లీడింగ్ హీరోయిన్లందరితోనూ నటించాడు. వాళ్లలో మీనా కుమారితో ఆ తర్వాత మధుబాల తో చాలా సినిమాలు చేశాడు. కాని మలిదశ హీరోయిన్లు ఆయన పక్కన కనిపించడానికి పెద్దగా ఇష్టపడలేదు. మీనా కుమారితో ఆయనకు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ‘ఆప్‌నే యాద్ దిలాయాతో ముఝే యాద్ ఆయా’ (ఆర్తి), ‘హమ్ ఇంతెజార్ కరెంగే తెరా ఖయామత్ తక్’ (బహు బేగమ్), ‘దిల్ జో న కెహ్ సకా’ (భీగీ రాత్)... ఇలా చెప్తే చాలానే ఉన్నాయి. ‘తాజ్ మహల్’ చేశాక ప్రదీప్ కుమార్ రాను రాను జమిందారు, నవాబు వంటి పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చింది. డబ్బున్న పెద్దమనిషి పాత్ర చేయాలంటే ప్రదీప్ కుమార్‌నే పిలిపించేవారు. అయితే అవేమీ ఆయనకు పేరు తెచ్చిన పాత్రలు కాదు. చివరి వరకూ ఆర్థికంగా కూడా హుందాగానే జీవించిన ప్రదీప్ కుమార్ 2001లో తన 76వ ఏట మరణించాడు. అయినప్పటికీ ఇవాళ్టికీ ఆయన పాట వినిపించకుండా ఈ దేశంలో రోజు గడవదు. ‘జో వాదా కియా ఓ నిభానా పడేగా... నిభానా పడేగా’...
 

>
మరిన్ని వార్తలు