అసలైన హజ్ యాత్ర!

24 Sep, 2015 23:40 IST|Sakshi

ఒకసారి హజరత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహ్మ)హజ్ యాత్రకోసం మక్కాకు బయల్దేరారు. అయితే ఆయన అలా కొన్ని మైళ్లు ప్రయాణించిన తరువాత, ఒక ఊరి పొలిమేరలోకి వెళ్లేసరికి అక్కడ ఒక బాలిక దేనికోసమో వెదుకులాడుతూ కనిపించింది. కడు పేదరికంలో ఉన్నట్టు కనిపిస్తున్న ఆ పదేళ్ల బాలిక వెదుకులాట ఆయన్ను ముందుకు సాగనివ్వలేదు. అంతలో ఆ బాలిక అటూ ఇటూ చూసి, ఓ చచ్చిన పక్షిని ఒళ్లో వేసుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన ముబారక్ గారు వెంటనే ఆ అమ్మాయిని సమీపించి, ‘‘పాపా! చచ్చిన ఆ పక్షి ఎందుకు పనికొస్తుంది, దీన్నేం చేసుకుంటావు?’’ అని అడిగారు.

 ఆ బాలిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ గద్గదస్వరంతో ఇలా చెప్పింది. ‘‘అయ్యా! నేను అనాథను. నాకో తమ్ముడున్నాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక చాలా బాధపడుతున్నాం. రెండు రోజుల నుండి తిండి దొరకలేదు. నేనెలాగో తట్టుకోగలను కానీ, తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు. వాడి ఆకలి బాధను చూడలేక దీన్నయినా వాడికి పెడితే ప్రాణాలు నిలుస్తాయన్న ఆశతో దీన్ని ఒళ్లో వేసుకున్నా’’ అని చెప్పింది.

ఈ మాటలు విన్న అబ్దుల్లా బిన్ ముబారక్ (రజి)కదిలిపోయారు. బాలికను దగ్గరకి తీసుకుని ‘‘పాపా! ఏడవకు. దైవం తప్పకుండా నీ బాధను దూరం చేస్తాడు’’ అంటూ తన హజ్‌యాత్రకోసం తెచ్చుకున్న పైకమంతా ఆమె చేతిలో పెట్టి, వీటితో మీకు కావలసిన వస్తు సామగ్రి, బట్టలు కొనుక్కుని, దిగుల్లేకుండా హాయిగా జీవించండి. ఈ ఏర్పాటు చేసిన దైవానికి కృతజ్ఞతలు తెల్పుకోండి’’అన్నారు.
 ఒక్కసారిగా అన్ని డబ్బులు చేతిలో పడేసరికి, ఆ బాలిక బాలిక ముఖంలో మెరిసిన ఆనందాన్ని చూసి ముబారక్ గారి మనసు పులకరించిపోయింది.

‘‘అమ్మా! ఇక వెళ్లు. తమ్ముడు ఎదురు చూస్తుంటాడు. త్వరగా అతనికి భోజనం పెట్టు’’ అంటూ అనునయించారు. బాలిక కృతజ్ఞతగా ఆయన వైపు చూస్తూ సంతోషంతో ఇంటిదారి పట్టింది. బాలిక వెళ్లిన వైపే తృప్తిగా చూస్తూన్న ముబారక్ గారితో ఆయన శిష్యుడు ‘‘అయ్యా! డబ్బంతా ఇచ్చేశారు. మరి తమరి హజ్ యాత్ర ఎలా?’’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ముబారక్‌గారు ఇలా అన్నారు. ‘మన హజ్ ఇక్కడే నెరవేరింది. ప్రస్తుతం ఇది కాబా యాత్ర కన్నా గొప్ప ఆరాధన. దైవచిత్తమైతే వచ్చే యేడాది మళ్లీ హజ్ యాత్రకు వెళదాం. ఈ యేడు మాత్రం హజ్‌ను అల్లాహ్ ఇక్కడే స్వీకరించాడు’’ అని దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు.

 తలపెట్టింది దైవకార్యమైనా, ఆయన దాసులు ఆకలితో అలమటిస్తుంటే, వస్త్రాలు లేక విలవిల్లాడుతుంటే, దైవకార్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్నార్తుల క్షుద్బాధను తీర్చడం, వారికి వస్త్రాలు సమకూర్చడం అన్నిటికన్నా శ్రేష్ఠతర కార్యమన్న ప్రవక్త సందేశం దీని ద్వారా మనకు అర్థమవుతోంది. అందుకే నేలపై ఉన్నవారిని కరుణించండి, నింగిపై వాడు మిమ్మల్ని కరుణిస్తాడు’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త(స).
 
 

మరిన్ని వార్తలు