ధన్యవాదాలు వర్ఘీస్‌

14 Jun, 2020 05:37 IST|Sakshi
షరాన్‌ వర్ఘీస్‌

తల్లి కువైట్‌లో ఉంది. తండ్రి ఇండియాలో ఉన్నాడు. షరాన్‌ వర్ఘీస్‌ ఆస్ట్రేలియాలో ఉంది. కరోనా అంతటా ఉంది.  తల్లి నర్సు. కూతురు నర్సింగ్‌ డిగ్రీ పూర్తయింది. ‘‘అమ్మా.. ఏం చేయమంటావ్‌’’ అని అడిగింది. ‘‘నీ ఇష్టం.. నేనైతే వదిలి రాలేను’’ అంది. ఆమె వదిలి రాలేనన్నది కువైట్‌లోని కరోనా రోగులను. కూతురు కూడా ఆస్ట్రేలియాను వదల్లేదు. వృద్ధులకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది. ఈ యువ నర్సుకు గిల్‌క్రీస్ట్‌ ధన్యవాదాలు తెలిపాడు.


షరాన్, ఆడమ్‌ గిల్‌క్రీస్ట్‌

షరాన్‌ వర్ఘీస్‌ బియస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి యూనివర్సిటీ బయటికి అడుగు పెట్టే వేళకు కరోనా ఆస్ట్రేలియా వరకు వచ్చేసింది. వచ్చేసింది కానీ, మరికొంతకాలమైనా ఉండకుండా పోయేది కాదని అప్పటికెవరికీ తెలీదు. షరాన్‌ నర్సుగా అక్కడే తన పేరు నమోదు చేసుకుని ఉంది. తొలి ఉద్యోగాన్ని ఏదైనా పెద్ద ఆసుపత్రిలో వెతుక్కోవడమే మిగిలింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా నుంచి విదేశీయుల తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి! కరోనా భయంతో అంతా విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. షరాన్‌ సందిగ్ధంలో పడింది. కేరళలో తనకు మంచి ఉద్యోగం దొరక్కపోదు. వెళ్లడమా? ఉండటమా? ‘‘అమ్మా... ఏం చేయమంటావ్‌?’ అని కువైట్‌లో ఉన్న తల్లికి ఫోన్‌ చేసింది.

ఆమె కూడా నర్సే. కువైట్‌లో చేస్తున్నారు. ‘‘నేను ఇక్కడే ఉండిపోతాను. వీళ్లనిలా వదిలేసి రాలేదు’’ అన్నారు ఆవిడ! అది మనసులో పడిపోయింది షరాన్‌కు. తనూ ఆస్ట్రేలియాలోనే ఉండిపోదలచుకుంది. అయితే ఆసుపత్రిలో కాకుండా వృద్ధులకు మాత్రమే వైద్యసేవలు (జెరియాట్రిక్‌) అందించే ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఆస్ట్రేలియాలో 60 ఏళ్లు పైబడిన వారి జనాభా ఎక్కువ. వారికి సేవలు అందించడానికి అందుబాటులో ఉండే నర్సుల సంఖ్య తక్కువ. అందుకే షరాన్‌ జెరియాట్రిక్‌ నర్స్‌ అయింది. అప్పటికి కరోనా కూడా ఆస్ట్రేలియా అంతటికీ విస్తరించింది. కరోనా నుంచి వృద్ధులను కాపాడటం అంటే ఒళ్లంతా హూనం చేసుకోవడం మాత్రమే కాదు. ఒళ్లంతా కళ్లు చేసుకోవడం కూడా.
∙∙
రోజుకు ఆరేడు గంటలు పని చేస్తోంది షారన్‌. కరోనా భయంతో దూర ప్రాంతాల్లో ఉండే నర్సులు రావడం మానేశారు. కొంతమంది రాగలిగి ఉన్నా ఇంట్లో పసిపిల్లలు ఉండటంతో జాగ్రత్తకోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ పని కూడా షరాన్‌ మీదే పడింది. కష్టమనుకోలేదు షరాన్‌. ‘‘వదిలేసి రాలేను’’ అని తల్లి అన్నమాట ఆమెకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది. నాలుగు నెలలుగా అవిశ్రాంతంగా వృద్ధుల్ని కనిపెట్టుకుని ఉంటోంది షారన్‌. ఇటీవల ఓ రోజు.. షరాన్‌ చదివొచ్చిన ఉలాంగ్‌గాంగ్‌ యూనివర్సిటీ నుంచి ఆమెకు ఒక మెయిల్‌ వచ్చింది. యూనివర్సిటీలోని కోవిడ్‌ –19 హెల్ప్‌ గ్రూప్‌ పంపిన మెయిల్‌ అది. విదేశాల నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో వైద్యసేవలు అందిస్తున్న నర్సులు తమ ఉద్యోగ వివరాలను తెలియజేయాలని హెల్ప్‌ గ్రూప్‌ కోరింది. షరాన్‌ వెంటనే తన వివరాలు మెయిల్‌ చేసింది. వీడియో తీసి పంపమని మళ్లీ ఒక మెయిల్‌ వచ్చింది.

షరాన్‌ కాస్త తీరిక చేసుకుని అప్పటికప్పుడు కోటు వేసుకుని, కొంచెం లిప్‌స్టిక్‌ అద్దుకుని.. ‘హాయ్‌.. నేను షరాన్‌’ అంటూ తన వివరాలను రికార్డ్‌ చేసి పంపింది. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయింది.. కొన్ని రోజుల తర్వాత తనకు ఫోన్‌లు, మెజేస్‌లు వరదలా వచ్చి పడేవరకు! అవి కేరళ నుంచి, కువైట్‌ నుంచి.. ఇంకా విదేశాల్లో ఉన్న స్నేహితుల నుంచి. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రీస్ట్‌ ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలిపాడని! ఆస్ట్రేలియాలోనే ఉండి ఇక్కడి వారికి సేవ చేయాలనుకున్న షరాన్‌కు, మిగతా భారతీయ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్న గిల్‌క్ట్రీస్‌ వీడియో క్లిప్‌ అప్పటికే వైరల్‌ అవుతోంది. ‘‘మా నాన్న దేనినీ మెచ్చరు. ఆయన క్రికెట్‌ అభిమాని. గిల్‌క్రీస్ట్‌ నన్ను ప్రశంసించారు అనగానే ఫోన్‌ చేసి ‘వెల్‌ డన్‌’ అన్నారు అని సంతోషపడిపోయింది షరాన్‌. ఇక కేరళలో ఉన్న ఆమె తమ్ముడు, అతడి ఫ్రెండ్స్‌ అయితే సోషల్‌ మీడియాలో ఇంచుమించు ఒక ఉత్సవాన్నే జరుపుకుంటున్నారు. షరాన్‌కి ఇదంతా థ్రిల్లింగ్‌గా ఉంది.
∙∙
కొట్టాయంలోని కురుప్పుంత్ర షరాన్‌ వర్ఘీస్‌ స్వస్థలం. తల్లి ఎప్పట్నుంచో కువైట్‌లో నర్సు. షరాన్‌ తల్లి దగ్గరే ఉండి స్కూల్‌కి వెళ్లింది. ఆస్ట్రేలియాలో కాలేజ్‌ చదువు. సెలవుల్లో కేరళ వచ్చి వెళ్తుంటుంది. ఇక రెండేళ్ల వరకు ఉలాంగ్‌గాంగ్‌ ను వదిలి వెళ్లేది లేదని అంటోంది. ఆ ప్రాంతంలోనే ఒక ‘ఏజ్డ్‌ కేర్‌’ సెంటర్‌లో తనిప్పుడు పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించడం తనకు ఇష్టమని అంటోంది.
                                                                

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు