-

గుండెలో పెరిగిన పాప

26 Feb, 2018 00:41 IST|Sakshi

ఒక పాఠశాలలో ఫ్యామిలీ ఫొటో గురించిన పాఠం చెబుతోంది టీచరు. విద్యార్థులంతా చిన్నపిల్లలు. అందులో భాగంగా రకరకాల ఫొటోలు చూపిస్తోంది టీచరు. తరువాతి ఒక ఫొటో చూపించింది. అందులో ఉన్న ఇంటి సభ్యులందరి జుట్టు గోధుమ రంగులో ఉండగా, ఒక పాప జుట్టురంగు మాత్రం నల్లగా ఉంది. చూడగానే ఆ పాప ఆ ఇంట్లో పుట్టలేదని కొందరు పిల్లలు గుర్తించారు. ‘ఆ పాపను వాళ్లు దత్తత తీసుకున్నారు కావొచ్చు,’ అన్నాడు ఒకబ్బాయి. ‘మీకు దత్తత అంటే ఏమిటో తెలుసా?’ క్లాసును ఉద్దేశించి ప్రశ్నించింది టీచర్‌. ‘నాకు తెలుసు’ వెంటనే ఒక చిన్నారి లేచి నిలబడింది.

‘ఎందుకంటే నేను కూడా దత్తతగా వచ్చినదాన్నే’. క్లాసు అంతా ఆమె వైపే చూస్తోంది. ‘దత్తత అంటే ఏమిటో చెప్పమ్మా?’ అడిగింది టీచర్‌. ‘మామూలు పిల్లలు తల్లి కడుపులో పెరుగుతారు; దత్తుపిల్లలు తల్లి హృదయంలో పెరుగుతారు’ తడుముకోకుండా బదులిచ్చింది పాప. క్లాసంతా మొదట నిశ్శబ్దం. ఆ వెంటనే చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ పాప ఎలాంటి పరిస్థితుల్లో మరో ఇల్లు, మరో తల్లి మారిందో తెలీదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోంచి వచ్చినా ఆ పాపలాంటి వారి మనసు గెలుచుకునే అవకాశం మరో తల్లికి, మరో ఇంటికి ఉంటుందనేది ఇందులోని బ్యూటీ.

మరిన్ని వార్తలు