సలహా

11 Jul, 2015 23:45 IST|Sakshi
సలహా

సలహాను తిరగేస్తే .. హాలస అవుతుంది!
సమయం, సందర్భం ఎరగక ఇచ్చే  సలహాకూడా ఎదుటివారి జీవితాన్ని ఇలాగే తారుమారు చేస్తుంది!
అందుకే సలహాలివ్వబోయేముందు కాస్త  జాగ్రత్త అని చెప్పే ప్రయత్నమే ఇది.

 
అవసరమైన సలహా స్వీకరించు, అనవసరమైన వాటిని తిరస్కరించు. అలాగే నీలోని ప్రత్యేకతను దానికి జోడించు
 -బ్రూస్‌లీ
నాకు తెలిసి నీ మనసు విరిగినప్పుడు మాత్రం ఎవరూ నీకు సలహాలు ఇవ్వరు
-బ్రిట్నీ స్పియర్స్
సలహా ఇచ్చేందుకు రానివారందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే నేను స్వంతంగా పని చేయడం నేర్చుకోగలిగాను
-ఐన్‌స్టీన్

 
మానవుడికి కవలసోదరి సలహా! కానీ ఎక్కువసార్లు ఈ ఇద్దరి మధ్య వైరం చోటు చేసుకుంటుంది. చాలా తక్కువసార్లు స్నేహం కుదురుతుంది. అవసరమున్నా లేకున్నా.. అడిగినా అడగకపోయినా  నేనున్నానంటూ వస్తుందని అని సోదర మానవుడు విసుక్కుంటుంటాడు. ఖ్యాతి కన్నా ఇది మూటగట్టుకున్న అపఖ్యాతే ఎక్కువని అతని ఉద్దేశం. ఆదేశం, ఆజ్ఞ, ఉద్బోధ, సూచన... ఇలా సందర్భాన్ని బట్టి సలహా తన పేరు మార్చుకుంటూ ఉంటుంది. చాలా సార్లు ఉచితంగానే వినిపిస్తుంది. కొండొకచో కాస్ట్ చేస్తుంది. ఏమైనా తను లేకుండా మనిషి మనలేడనే చరిత్రను సృష్టించింది.
 
రామాయణం
పురాణాల్లోనూ.. సలహాది ముఖ్య భూమికే. రామాయణంలో కొంచెం నెగటివ్ షేడ్ దీనిది. కైకకు మంధర సలహా ఇవ్వకపోతే రామాయణ రచన జరిగేది కాదేమో! ఒకవేళ జరిగినా ఇంకోరకంగా ఉండేదేమో! సవతి తల్లి విలన్‌గా మిగిలేది కాదు! రాముడు అడవులకు వెళ్లకుండానే.. సీతను అడవుల పాలు చేయకుండానే.. రావణుడి కీర్తి తగ్గకుండానే రామాయణానికి ఎండ్ కార్డ్ పడేదేమో! అంతెందుకు.. అన్నతో పాటు అడవులకు బయలుదేరిన లక్ష్మణుడు.. భార్య ఊర్మిళకు తను వచ్చేవరకు నిద్రపొమ్మనే సలహా ఇచ్చి ఉండకపోతే రామాయణంలో ఊర్మిళ పాత్రా ఇంకేదన్నా స్ఫూర్తిని పంచేదేమో! పోనీ.. సీతను అలా బంధించడం నీకు.. ఈ లంకారాజ్యానికీ శుభం కాదు, పట్టు వీడండి అన్న విభీషణుడి సలహాను రావణుడు విన్నా కథ ఇంకో మలుపు తిరిగేది.

భారతం
భారతం విషయానికి వచ్చినా సలహాది చాంతాడంత నిడివే. కాకపోతే మంచిచెడ్డలను కలబోసుకుంది. ‘రాజ్యంలో పాండవులకూ  పాలు ఉంది.. సగరాజ్యం ఇవ్వండి’ అంటూ  పెద్దలు ఇచ్చిన సలహాను కౌరవులు పెడచెవిన పెట్టబట్టే దాయాదుల పోరు గురించి ప్రపంచానికి తెలిసిందనుకోవచ్చు. శకుని సలహాలు దర్యోధనుడు పాటించకపోతే అతని పేరూ ధర్మరాజుపేరుతో పోటీపడి ఉండేది. ‘కర్ణుడు శూద్రుడు.. వాడితో స్నేహమేంటి?’ అన్న సలహాకు సుయోధనుడు ప్రాధాన్యమిచ్చి ఉంటే లోకంలో స్నేహానికి విలువే ఉండేది కాదు. ఇలా భారతంలో తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలానే ప్రయత్నించినా.. ‘సలహా’ అనేది చివరకు అపప్రథనే మోసింది! భాగవతంలో  రెండు రకాల ప్రభావాన్ని చూపింది. తండ్రీకొడుకుల మధ్య తంపులు తెచ్చింది... స్నేహితుల చెలిమికి స్వచ్ఛతను అద్దింది.  నారాయణ నామస్మరణ చేస్తున్న తనను ఎద్దేవా చేయడం మంచిది కాదు నాన్నా అంటున్నా హిరణ్యకశిపుడు వినిపించుకోలేదు. తప్పు నాన్నా.. ఆ విష్ణువు శరణువేడుకోమని ప్రహ్లాదుడు తండ్రికి సలహా ఇచ్చినా అహకారంతో వినిపించుకోక చివరకు ఆ హరి చేతిలోనే హరీమన్నాడు. కటికదరిద్రం అనుభవించిన కుచేలుడికి సకలసంపదలను చేకూర్చింది ఈ సలహానే. భార్య సలహామేరకే చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడికి అటుకులను పెడ్తాడు కుచేలుడు ప్రేమగా. స్నేహితుడి చెలిమికి కరిగిపోయిన కృష్ణుడు సిరిని కానుకగా ఇస్తాడు. ఇలా ‘సలహా’ పురాణాలలో, ఇతిహాసాలలో పెద్ద పాత్రనే పోషించింది. అనేకానేక మలుపులకు కారణం అయింది.
 
చరిత్ర
చాణక్యుడి సలహా చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిని చేసింది. అలాగే మూర్ఖుల మెదళ్లను ప్రభావితం చేసి రక్తపాతాన్నీ సృష్టించింది. హిట్లర్ నియంతృత్వ నైజాన్ని పెంచడంలో ఇది పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయాలనే గోబెల్స్ సలహాను విని ఆ రకమైన ప్రాపగాండకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు హిట్లర్. ఇక్కడితో ఆగితే బాగుండు.. కనీసం చరిత్రలో ఎక్కడైనా మంచిగా కనిపించేవాడు. సలహా కనుక దుష్టరూపంలోకి వస్తే వీసమంత మంచికీ చాన్స్ ఇవ్వదు కదా! యూదులంటే హిట్లర్‌కున్న ద్వేషాన్ని తెలుసుకున్న అతని సలహాదారుడు ఆల్ఫ్రెడ్ రోజెన్‌బర్గ్... ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. యూదుల మీద తనకున్న పగను హిట్లర్ ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే యూదుల ఊచకోత అనే వికృత సలహా ఇచ్చి రెండో ప్రపంచ యుద్ధానికే ఘంటికలు మోగించాడు. చరిత్రను తవ్వితే... ఇలాంటివెన్నో! ప్రతి ఆక్రమణ వెనక... ప్రతి దాడి ముందు ఉన్నది సలహానే! కొందరికి ఇది విజయాలను పంచిపెడితే కొందరికి ఓటమిని తేల్చింది!
 
రాజకీయాలు
దైనందిన జీవితంలో దీన్ని ఎవరూ అడగకపోయినా.. దీని జాడనే సహించకపోయినా.. రాజకీయాల్లో మాత్రం దీని ప్రమేయం అనివార్యమైంది. అయితే మామూలు జీవితాల్లో ఇది కంచిగరుడ సేవ చేస్తే.. పాలిటిక్స్‌లో మాత్రం దీని సర్వీస్ పాష్‌గానే ఉంటుంది. ఆంతరంగిక సలహాదారు, ప్రభుత్వ సలహాదారు..అనే హోదాలున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఢిల్లీ పీటమెక్కిన నరేంద్ర మోదీ విజయానికి అమిత్‌షా సలహానే కారణమైంది. కానీ తర్వాత కాలంలో ఆ అమిత్‌షా సలహాలే సెల్ఫీల పిచ్చోడిగా.. కోట్లు (ధరించేవి) మార్చే వెర్రోడిగా మోదీలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాయి. మతోన్మాది ముద్రనూ వేశాయి. అరవింద్ కేజ్రివాల్‌నూ ఈ సలహాలు నానా ప్రాంతాలను ఊడిపించాయి.. ఆఖరకు ఏడిపించాయి.
 
సామాన్యుడి జీవితంలో...
సలహా ఒక రొద.. వ్యధ. ఖర్చయ్యేది కాదుకదా.. అని విసిరిపారేసే ఓ వల. వద్దన్నా చిక్కుకు పోతాడు మనిషి. విననూ అంటూ దూరంగా పారిపోతుంటే వెంటాడి వేటాడి మరీ చెవిలో దూరుతుంది. నడక నేర్చిన దగ్గర్నుంచి మొదలవుతాయి ఈ కవల సోదరి పెట్టే కష్టాలు. అటు వెళ్లకు.. ఇటు రాకు.. అది చూడకు.. ఇది విను.. అది తినకు.. ఇది తీసుకో అంటూ! కాస్త పెద్దయితే ఇది చదువు.. ఈ పని చెయ్ అని. పెళ్లీడు వచ్చిందంటే.. ప్రేమించమని ఓ సలహా.. వద్దని ఇంకో సలహా. కట్నం తీసుకో అని ఒకరి సలహా. పెళ్లయ్యాకైతే భార్య రూపంలో భర్తకు.. భర్త రూపంలో భార్యకు ఈ సలహా శాశ్వతతోడుగా మారిపోతుంది. సొంత వ్యక్తిత్వం ఎదగనివ్వకుండా అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. పైగా సొంత వ్యక్తిత్వం లేదనే తెగడ్తనూ ఇస్తుందిదే! ఒకవేళ సలహాసొదను వినకుండా  సొంతంగా ఆలోచించి అడుగులేసి పొరపాటున కిందపడితే మూతి మూర జాపి నవ్వేదీ అదే!

ఎప్పుడు మంచిది?
పీపుల్ డోంట్ అల్వేస్ నీడ్ అడ్వయిజ్.. సమ్‌టైమ్స్ ఆల్ దె రియల్లీ నీడ్ ఈజ్ ఎ హ్యాండ్ టు హోల్డ్.. యాన్ ఇయర్ టు లిజన్... అండ్ ఎ హార్ట్ టు అండర్‌స్టాండ్ దెమ్! అంటే సలహా అవసరాన్ని బట్టి తన ఆకారాన్ని మార్చుకుంటే అందరి మన్ననలనూ పొందుతుంది. ప్రతి విజేత తన సక్సెస్ క్రెడిట్‌ను సలహాకే సొంతం చేస్తాడు. సలహాలు అందరూ ఇస్తారు.. కానీ సరైన సమయంలో ఇచ్చినవారే శ్రేయోభిలాషులుగా మిగులుతారు. ఆ సలహాకీ ఆ మంచితనం అంటుతుంది. ఈ కోవలోకి రాని సలహాలకు ఉచితం అనే బరువైన ట్యాగ్ పడేదందుకే!

పాండవాగ్రజుడు ధర్మరాజుని ఎవరో అడిగారట.. మనిషి చేయగల చాలా సులువైన పని ఏంటీ అని. దానికి ఆయన.. ‘‘సలహా’’ ఇవ్వడం’ అని చెప్పాడట. అలా కష్టపడకుండా ఎదుటివారికి సలహాలివ్వడమంటే సలహాకున్న విలువ తగ్గించడమన్నట్టే!
 - సరస్వతి రమ

మరిన్ని వార్తలు