చదువుల తల్లుల తండ్రి

14 Dec, 2019 01:23 IST|Sakshi

మార్పు

డాడీస్‌ లిటిల్‌ గర్ల్‌... అవును కూతుళ్లెప్పుడూ నాన్నలకు బంగారు తల్లులే! నాన్నలెప్పుడూ బిడ్డలకూ రోల్‌మోడల్సే! అందుకే నాన్న వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా పడాలి.. పడ్తోంది! అలాంటి తండ్రులు మన దగ్గరే కాదు పాకిస్తాన్‌లో ఉన్నా.. అఫ్ఘానిస్తాన్‌లో కనిపించినా సెల్యూట్‌ చేయాల్సిందే!! మియా ఖాన్‌ కూడా ఆ వందనం స్వీకరించదగ్గ ఫాదరే!!

అమ్మాయిలకు చదువును నిషేధించిన తాలిబన్‌ ప్రభావం విపరీతంగా ఉన్న అఫ్ఘానిస్తాన్‌ నివాసి మియా ఖాన్‌. అక్షరం ముక్క తెలియదు. రోజూవారీ కూలీతో కుటుంబాన్ని పోషిస్తాడు. అతనికి ఏడుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. మన దగ్గర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అమ్మాయిలను చదువు మాన్పించి మైళ్ల దూరంలో ఉన్న బావులు, చెరువులు, కొలనుల నుంచి నీళ్లు మోసుకొచ్చే కొలువులో పెడ్తాం. శారీరక దారుఢ్యం ఉన్న అబ్బాయిలను మాత్రం స్కూళ్లకు పంపుతారు . మియా ఖాన్‌ ఆ కోవకు చెందిన వాడు కాదు. ఘోషాయే అమ్మాయిల అస్తిత్వంగా ఉన్న దేశంలో తన ఏడుగురు కూతుళ్లకు చదువు చెప్పించి... ఆ ఏడుగురిలో ఒకమ్మాయిని వైద్యసౌకర్యం లేని తన ఊరికి డాక్టర్‌గా చేయాలని నిర్ణయించుకున్నాడు.

కొడుకులను పనికి పంపించి.. ప్రతిరోజు ఉదయం తన బిడ్డలను పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కి తీసుకెళ్తాడు. బడివేళ అయిపోయే వరకు ఉండి మళ్లీ వాళ్లను ఇంటికి తీసుకొస్తాడు. అనారోగ్యం వల్ల పనికి వెళ్లడం మానేసినప్పటి నుంచి ఇదే అతని దినచర్య అయింది. అంతకుముందు మియా ఖాన్‌ కొడుకులు తమ చెల్లెళ్లను బడికి తీసుకెళ్లేవారు. ఏడుగురిలో ఒకమ్మాయి అయిన రోజీ ‘‘మా ఊళ్లో చాలామంది అమ్మాయిలకు లేని అవకాశం, అదృష్టం మాకు కలిగింది. ఎందుకంటే మా నాన్న ధైర్యవంతుడు. తన బిడ్డలు చదువుకోవాలి.. చదువుకుంటేనే జీవితం అని తెలిసిన వాడు. మాకూ అదే చెప్తూంటాడు. ఇప్పుడు నేను ఆరవ తరగతిలో ఉన్నాను.

డాక్టర్‌ కావాలనుకుంటున్నాను’’ అని చెప్తుంది గర్వంగా! ‘‘చదువు లేకపోవడం.. రాకపోవడం ఎంత శాపమో నాకు తెలుసు. అందునా ఆడపిల్లలకు అక్షరమే ఆయుధం. నా బిడ్డలు నాలా కాకూడదు. బాగా చదువుకోవాలి. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలి. నా పిల్లల్ని అంత దూరం స్కూల్‌కి తీసుకెళ్తుంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. నా మొండితనం చూసి ఇప్పుడిప్పుడే వెనక్కి తగ్గుతున్నారు’’అంటాడు మియా ఖాన్‌. అప్పుడు మలాలా.. ఇప్పుడు రోజీ, ఆమె ఆరుగురు అక్కచెల్లెళ్లు. వీళ్లు కదా ఆడపిల్లలకు ధైర్యం! మలాలా తండ్రి.. మియా ఖాన్‌ వీళ్లు కదా.. ప్రపంచానికి స్ఫూర్తి!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా