మరణం తర్వాత ఆత్మ ...?

20 Mar, 2016 19:34 IST|Sakshi
మరణం తర్వాత ఆత్మ ...?

 నచికేతోపాఖ్యానం 

కఠోపనిషత్తులో నచికేతోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. అందులో నచికేతు అడిగిన మూడవ ప్రశ్నకు యముని సమాధానం ఈ వారం.
 నాయనా! నచికేతా! ఆత్మను గురించి ఒక అవగాహన ఏర్పడితే నువ్వు అడిగిన మూడోప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని విను.
 నిరాకారమై విశ్వమంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మం తపస్సు చేత కేంద్రీకృతమై ఒక భౌతికరూపాన్ని పొందుతూ ఉంటుంది. తపస్సు కంటె ముందు కూడా అది ఉంది. పరబ్రహ్మం స్త్రీ పురుష విభాగాలకు అతీతమైనది కనుక ‘అది’ అంటాను. తెలుసుకో. సృష్టిలో ముందుగా భౌతికరూపాన్ని పొందిన నీటికి ముందు కూడా అది ఉంది. హృదయ కుహరంలో పంచభూతాత్మకంగా ఉన్న ఆత్మను తెలుసుకోలిగిన వాడు పరబ్రహ్మాన్ని చూడగలుగుతాడు. ఇదే ఆత్మ.

పంచభూతాలతో సృష్టించబడిన ప్రాణంలో ఉంటూ, హృదయంలో స్థిరనివాసం చేసే ఆత్మను తెలుసుకొంటే పరమాత్మను తెలుసుకున్నట్టే. కడుపులో ఉన్న శిశువు తల్లిచే జాగ్రత్తగా సురక్షితంగా పోషించబడినట్టు మండే సమిధలలో ఉన్న అగ్ని రూపంలో ఉన్న ఆత్మయజ్ఞకర్తలతో నిత్యం రక్షించబడుతుంది. ఇది తెలుసుకో. సూర్యుడు ఉదయించడానికీ అస్తమించడానికీ కేంద్రం ఆకాశం. దానిలోనే దేవతలు అందరూ ఉన్నారు. ఎవరూ దానిని దాటిపోలేరు. ఇదే ఆత్మ అని తెలుసుకో. నీకంటికి ప్రత్యక్షంగా కనపడేది అంతా కనపడని పరబ్రహ్మంలో ఉంది.కనపబడని పరబ్రహ్మం నీకు కనపడే అన్నిటిలోనూ ఉంది. ఇది తెలుసుకోకుండా అదివేరు ఇది వేరు అని భ్రమపడే వారికి సత్యదర్శనం అయ్యేవరకూ జననమరణాలు తప్పవు.

 నచికేతా! నిరాకార పరబ్రహ్మం పంచభూతాలు (నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం)గా సాకారమైంది. వాటి సమ్మేళనంతో వివిధ ప్రాణుల రూపాలను పొందింది. వాటిలో నిరాకారమైన మనస్సుగా వాటిని నడిపిస్తోంది. కనుక మనసుతోనే ఆత్మను తెలుసుకోవాలి. అప్పుడే నీకు భేదభావం నశిస్తోంది. ఆత్మసాక్షాత్కారం అవుతుంది. భిన్నత నుంచి బయటపడనంత వరకు చావు పుట్టుకలు తప్పవు.
 ‘అంగుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి’ బొటనవేలంత పురుషుడు (పరబ్రహ్మం) ప్రాణుల శరీరంలో ఉంటాడు. బుద్ధిగల జీవి అయిన మానవుడు ఈ విషయాన్ని తెలుసుకుంటే దేనికీ భయపడడు. అసహ్యించుకోడు. అంగుష్ఠమాత్ర పురుషుడే భూత, భవిష్యత్, వర్తమానాలకు అధిపతి. పొగలేని అగ్నిలా ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అదే ఆత్మ అని తెలుసుకో.

 గౌతమవంశీయా! చావుపుట్టుకలు, వక్రతలు లేకుండా ఉండే ఆత్మ పదకొండు ద్వారాలు ఉన్న నగరంలో ఉంటుంది. (అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం పదకొండు). ఆ ఆత్మను తెలుసుకొన్నవారికి దుఃఖం ఉండదు. అన్ని బాధలనుంచి విముక్తుడు అవుతాడు. అంతరిక్షంలోని సూర్యుడు, ఆకాశంలోని వాయువు, యజ్ఞకుండంలోని అగ్ని, పాత్రలోని సోమరసం అన్నీ ఆత్మయే. మానవుల్లో, దేవతల్లో, ఆకాశంలో, యజ్ఞంలో, నీటిలో, నేలమీద, తపస్సులో, కొండల్లో అంతటా ఉండేది, పుట్టేది ఆత్మయే. అదే సత్యం. అదే సమగ్రం. నాయనా! ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనే అయిదు వాయువులకు ఆత్మ మధ్యలో ఉండి నడిపిస్తుంది. ప్రాణవాయువును పైకి, అపానాన్ని కిందికీ ఇలా పంపే ఆత్మను సమస్తదేవతలూ పూజిస్తూ ఉంటారు. శరీరంలో నివసించే ఆత్మ శరీరాన్ని విడిచిపోయాక అక్కడ ఏమీ మిగలదు. ప్రాణ, అపానాది వాయువులలో మానవుడు జీవిస్తున్నట్టు కనిపిస్తున్నా అవి సత్యం కాదు. వాటిని నడిపిస్తున్న ఆత్మతో జీవిస్తున్నాడు.

ఆత్మ పరిశోధనలో ఈ దశ దాటిన నీకు అతి రహస్యమూ, సనాతనమూ అయిన పరబ్రహ్మను గురించి వివరిస్తాను. మరణం తరువాత ఆత్మ ఏమవుతుంది అనే నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. శ్రద్ధగా విను. శరీరంలో ఉన్న ఆత్మ జీవాత్మ. శరీరాన్ని విడిచిన జీవాత్మ ఆ శరీరంతో చేసిన కర్మలను బట్టీ, సంపాదించిన జ్ఞానాన్ని బట్టీ మళ్లీ శరీరాన్ని పొందుతుంది. దానికోసం ఆయా మాతృగర్భాలలో ప్రవేశిస్తుంది. కదలికలు, అవయవాలు గల జంగమ ప్రాణుల్లోకి, అవి లేని స్థావరాలైన చెట్లు, కొండలు వంటి వాటిల్లోకీ కూడా జీవాత్మ రూపాంతరం చెందుతుంది.  (వచ్చేవారంతో కఠోపనిషత్తు పూర్తవుతుంది)  - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
 
కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులలో ప్రసిద్ధమైన శాంతిమంత్రం
ఓం శం నో మిత్ర శ్శం వరుణ ః శంనో భవత్వర్యమా! శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణు రురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామ్ అవతు వక్తారమ్
 
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
పరబ్రహ్మమా! సూర్యుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, బృహ స్పతి, విష్ణువు, బ్రహ్మ, వాయువు నాకు శుభాలను ఇచ్చెదరు గాక!
 నువ్వే ప్రత్యక్షమైన బ్రహ్మానివి. నిన్నే ప్రత్యక్ష బ్రహ్మస్వరూపంగా చెబుతున్నాను. స్పష్టంగా, సత్యం చెబుతున్నాను. ఆ విజ్ఞానం నన్ను రక్షించుగాక! దానిని బోధించువారిని రక్షించుగాక! నన్ను, చెప్పిన  గురువును రక్షించుగాక!
 
 

మరిన్ని వార్తలు