విన్నపాలు వినవలె.. వింతవింతలూ..!

23 Jan, 2017 00:17 IST|Sakshi



1. హోస్టెస్‌  లియా
2. హోస్టెస్‌  హెదర్‌ పూల్‌
బస్సుకీ రైలుకీ తేడా ఉంటుంది. రైలుకీ విమానానికీ తేడా ఉంటుంది. అయితే బస్సైనా, రైలైనా, విమానం అయినా.. ప్రయాణికుల్లో మాత్రం తేడా ఉండదు! మనుషులం కదా. స్వభావాలన్నీ ఒకేలా ఉంటాయి. రోడ్డు మీద వెళుతున్నామని ఒకలా, పట్టాలపై జారుతున్నామని ఒకలా, గాల్లో ఎగురుతున్నామని ఒకలా బిహేవ్‌ చెయ్యం. బస్సులో, రైల్లో హోస్టెస్‌లు ఉండరు కాబట్టి మన వల్ల వారికి ప్రాబ్లం ఉండదు. విమానంలోనే.. పాపం ఎయిర్‌హోస్టెస్‌లు మనతో వేగవలసి వస్తుంది. ‘విన్నపాలు వినవలె వింత వింతలు’ అని అన్నమయ్య పాడినట్టు.. విమాన ప్రయాణికులు ఫ్లైట్‌లో కోరే కోరికలకు ఒక్కోసారి ఎయిర్‌ హోస్టెస్‌లకు మతిపోతుందట!  అలా.. వాళ్లకు ఎదురైన కొన్ని అనుభవాలు ఎలా ఉన్నాయో చూడండి.  


నీతో కలిసి డ్యాన్స్‌ చెయ్యొచ్చా?
హెదర్‌ పూల్‌ యు.ఎస్‌. ఎయిర్‌ హోస్టెస్‌. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఒక పెద్దాయన  విమాన ప్రయాణంలో ఆమెను అడిగాడట.. ‘అమ్మాయ్‌... నీతో కలిసి నేనిక్కడ డాన్స్‌ చెయ్యొచ్చా?’ అని! ఇక్కడ.. అంటే ఫ్లయిట్‌ లోపల ప్రయాణికులు కూర్చునే రెండు వరుసల మధ్య ఖాళీ స్థలంలో! ఆ రిక్వెస్టుకు ఆమె ఒప్పుకుంది. ఆయనతో కలిసి డాన్స్‌ చేసింది. నిబంధలన ప్రకారం అయితే ఎయిర్‌హోస్టెస్‌ అలా చేయడానికి లేదు. ఈ సంగతిని హెదర్‌ పూల్‌ ‘క్రూయిజింగ్‌ యాటిట్యూడ్‌: టేల్స్‌ ఆఫ్‌ క్రాష్‌ప్యాడ్, క్రూ డ్రామా అండ్‌ క్రేజీ ప్యాజింజర్స్‌’ అనే పుస్తకంలో రాసుకున్నారు. ఆ పుస్తకం.. కొన్నాళ్ల పాటు న్యూయర్క్‌ టైమ్స్‌ బెస్ట్‌సెల్లర్‌గా నిలబడింది.

ఈ నేప్‌కిన్‌ తనకి ఇవ్వగలరా?
‘8సి’లో ఒక అందమైన ప్రయాణికురాలు కూర్చొని ఉంది. ఆ అమ్మాయిని చూసి అదే ఫ్లయిట్‌లో ఉన్న ఇంకో ప్రయాణికుడు మనసు పారేసుకున్నాడు. ‘ఐ లవ్‌ యు’ అని ఆమెకు చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పడానికి బిడియపడుతున్నాడు. ఎయిర్‌ హోస్టెన్‌ను పిలిచాడు. హోస్టెస్‌ లియా వోల్పే చిరునవ్వు నవ్వి ‘చెప్పండి.. మీకేం సహాయం చేయగలనో’ అని అడిగింది. నేప్‌కిన్‌ మీద తన పేరు, తన ఫోన్‌ నెంబరు రాసి, 8సి ప్యాసింజర్‌కు ఇవ్వమని కోరాడు! లియా వోల్పే అదే చిరునవ్వుతో, అతడిచ్చిన నేప్‌కిన్‌ తీసుకెళ్లి 8సి అమ్మాయికి ఇచ్చింది. నేప్‌కిన్‌ అందుకున్న అమ్మాయి బుగ్గల్లో సిగ్గులు, ఇక్కడ ఈ అబ్బాయి కళ్లల్లో మెరుపులు. ఫ్లయిట్‌ గమ్యానికి చేరాక.. ఆ అమ్మాయి, ఆమెకు ప్రపోజ్‌ చేసిన  అతను ఇద్దరూ చక్కగా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు.

పిల్లాడిని పైనే ఉంచేయండి ప్లీజ్‌!
నెత్తిపైన లగేజీ పెట్టుకునే ప్లేస్‌ని విమానాల్లో ‘ఓవర్‌హెడ్‌ బిన్‌’ అంటారు. ఫ్లయిట్‌ సిబ్బంది అంతా రెడీ అయి, లోపలి చెకింగ్స్‌ అన్నీ అయ్యాక ఫ్లయిట్‌ పైకి లేవబోతుండగా ఓవర్‌హెడ్‌ బిన్‌లో రెండు బ్యాగుల మధ్య ఒత్తేసినట్లున్న నెలల పిల్లాడిని చూసి ఎయిర్‌హెస్టెస్‌ హెదర్‌ పూల్‌ షాక్‌ తింది! ఆ బిడ్డను జాగ్రత్తగా రెండు చేతులతో కిందికి దింపి, తల్లి చేతుల్లో పెట్టింది. కానీ ఆ తల్లి.. ‘బేబీకి అక్కడ కంఫర్ట్‌గా ఉంది, అక్కడే ఉంచేయండి’ అని కోరింది. హెదర్‌ పూల్‌కి అది రెండో షాక్‌! ‘‘లేదు.. లేదు.. ఫ్లయిట్‌ నిబంధనలు ఒప్పుకోవు’ అని ఆ తల్లిని ఒప్పించడానికి పూల్‌ నానా తిప్పలు పడింది.

మీ షూజ్‌ మెయిల్‌ చెయ్యండి..!
ఏ వృత్తిలో ఉన్న వాళ్లు ఆ వృత్తిలోని సూక్ష్మమైన విషయాలను ఇట్టే గ్రహించేస్తుంటారు.  ఓసారి ఫ్లయిట్‌లో ఓ ప్యాసింజర్‌.. ఎయిర్‌హోస్టెస్‌ హెదర్‌ పూల్‌ షూజ్‌ని గమనించి చెప్పాడు, ‘‘మీ షూజ్‌ రిపేరుకు వచ్చాయి. వాటిని ఓ బాక్స్‌లో పెట్టి నాకు మెయిల్‌ చెయ్యండి’ అని! హెదర్‌ పూల్‌ ఆశ్చర్యపోయి, తన షూజ్‌ చూసుకుంది. నిజమే. కాస్త దెబ్బ తిన్నాయి. షూజ్‌ని మెయిల్‌ చెయ్యమని చెప్పిన ఆ ప్రయాణికుడు ఓ ఫుట్‌వేర్‌ కంపెనీ ఓనర్‌. ‘ఇ–బే’లో ఎయిర్‌ హోస్టెస్‌లు వాడేసిన షూజ్‌కి మంచి ధర వస్తుంది. ఈ అడ్రెస్‌కి మీ షూజ్‌’ పంపండి అని అతడు తన విజిటింగ్‌ కార్డు ఇచ్చి వెళ్లాడు.

మాబాధనుఅర్థంచేసుకోగలరా?
ఓసారి విమానంలోకి  హనీమూన్‌ జంట ఎక్కింది. ఆ కొత్త కపుల్‌ ఒకళ్ల చేతులను ఒకళ్లు క్షణమైనా వదిలిపెట్టి కూర్చోలేకపోతున్నారు. ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. మాటిమాటికీ హగ్‌ చేసుకుంటున్నారు. హోస్టెస్‌ లియా వోల్పే, వాళ్లను దాటుకుంటూ వెళుతుంటే ఆమెను ఆపి.. ‘మేము.. మైల్‌–హై క్లబ్‌ లో జాయిన్‌ కావచ్చా?’ అని అడిగారు. దీనర్థం ఏంటంటే.. కొన్ని నిమిషాల సెక్స్‌కి మాకు ఏకాంతం కల్పించగలరా అని! (విమానంలో ప్రయాణిస్తూనే సెక్సువల్‌ ఇంటర్‌కోర్సులో పాల్గొనడాన్ని ‘మైల్‌–హై’ అంటారు). పాపం మన హోస్టెస్‌.. ఆ దంపతుల బాధను అర్థం చేసుకున్నారు. తన బాధలేవో తను పడి వారికి అక్కడే ఓ మూల.. కొన్ని నిమిషాల పాటు ఏకాంతం కల్పించగలిగారు.

ఒక్కటికూడాకాల్చలేదుతెలుసా?!
విమానం ఎక్కే ప్రయాణికులు ఎవరైనా మొదట తెలుసుకోవలసింది.. విమానం లోపల సిగరెట్‌ తాగడానికి ఉండదని. కానీ ఓ ప్రయాణికుడైతే కాళ్లా వేళ్ల పడినంతగా హెదర్‌ పూల్‌ను ప్రాధేయపడ్డాడు. ‘సిగరెట్‌ తాగకుండా ఐదు గంటలు ఫ్లయిట్‌లో కూర్చొవడం నా వల్ల కావడం లేదు. నాలుక పీకేస్తోంది. ల్యావెట్రీలో కూర్చొని ఒక్క సిగరెట్‌ తాగొస్తాను ప్లీజ్‌’ అని అడిగాడు. డోర్‌ దగ్గర అతడు యాష్‌ ట్రే చూశాడట. అందుకనే అడిగాడు. కానీ ఆ ట్రే.. సిగరెట్‌ తాగాలనుకున్న వాళ్ల కోసం కాదు. దొంగచాటుగా సిగరెట్‌ తాగుతూ పట్టుబడిన వాళ్ల ‘పీకల్ని’ లాగి అందులో పడేయడానికి. ట్రాష్‌ క్యాన్‌లో ఆ సిగరెట్‌ పీకను వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని యాష్‌ ట్రే పెడతారు.

ఇక్కడ కోడిగుడ్లు దొరుకుతాయా?
ఒక ప్రయాణికురాలు కోడిగుడ్ల కోసం పట్టుపట్టింది. ‘సారీ మ్యామ్‌. స్టాక్‌ అయిపోయింది’ అని చెప్పిన పూల్‌ మీద గుడ్లు ఉరిమింది. ‘నా వెకేషనంతా పాడు చేశావ్‌ పిల్లా’ అని అర్థం వచ్చేలా తిట్ల దండకం ఎత్తుకుంది. బిజినెస్‌ క్లాస్‌లో గుడ్లు లేకపోవడం ఏంటని పెద్దగా అరిచేసింది. ‘‘పిల్లలకు గుడ్లు తినిపించడానికి లేదు. ఎంత పాపిష్టిదాన్ని, ఫ్లయిట్‌లో ఉంటాయిలెమ్మని గుడ్డిగా ఎక్కేశాను’’ అని కూడా ఆమె బాధపడిందట! పూల్‌ కూడా ఆ మాటకు ఫీల్‌ అయింది. కానీ తను మాత్రం ఏం చేస్తుంది? కోడిగుడ్ల కోసం అప్పటికప్పుడు ఫ్లయిట్‌ని ల్యాండ్‌ చేయించలేదు కదా.

ఒక ఫ్లాజుంటివ్వమ్మో!
డెంటల్‌ ఫ్లాస్‌ అంటే.. పళ్లను క్లీన్‌ చేసుకోడానికి వాడే సన్నటి దారం. మనం పుల్లలు పెట్టి పళ్లను గిల్లేస్తుంటాం కానీ, విదేశీయులలో చాలామందికి ఫ్లాస్‌ అలవాటు. ఏ రేంజ్‌ అలవాటంటే... పక్కవాళ్లను ‘ఓ ఫ్లాస్‌ ఉంటే ఇద్దురూ’ అని అడిగేంత అలవాటు. అప్పుడప్పుడు విమాన ప్రయాణికులు కూడా కొందరు.. ‘ఒక ఫ్లాజుంటివ్వమ్మో’ అని ఎయిర్‌ హోస్టెస్‌ని రిక్వెస్ట్‌ చేస్తుంటారట! పూల్‌కి కూడా ఇలాంటి అనుభవాలు ఒకటీ అరా ఉన్నాయి.‘వింతగా ఉంటుంది.. వాళ్లు మనల్ని ఫ్లాజ్‌ అడగడం, మనం వెళ్లి వాళ్ల కోసం ఇంకొకరిని ఫ్లాజ్‌ అడగడం’ అని నవ్వుతూ అంటారు పూల్‌.

డాక్టర్‌ పెప్పర్‌  అండ్‌ రెడ్‌ వైన్‌
డాక్టర్‌ పెప్పర్‌ అనేది అమెరికన్‌ సాఫ్ట్‌ డ్రింక్‌. ఇక రెడ్‌ వైన్‌ అంటే తెలిసిందే. చిక్కటి ద్రాక్ష రసం. (మన భాషలో ద్రాక్ష సారాయి). ఈ రెండిటినీ మిక్స్‌ చేసి ఇమ్మని అడుగుతుంటారట కొంతమంది ప్రయాణికులు! అదేం కాంబినేషనో మరి. తర్వాత్తర్వాత ఎయిర్‌ హోస్టెస్‌ పూల్‌కి  అర్థమైందట.. ఈ కాక్‌టైల్‌ ఫేమస్‌ అని. అన్నట్టు ఈ కాక్‌టైల్‌కో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా ఉంది. కానీ లైకులే.. తక్కువ. ఇదేమంత వింత రిక్వెస్టు కాదు కానీ, కొన్నిసార్లు.. కాక్‌టైల్‌ సరిగా మిక్స్‌ అవలేదని ఎయిర్‌ హోస్టెస్‌ను తిడతారట!

ప్లే గ్రౌండ్‌ లేకపోవడం ఏంటి?!
ఒకావిడ పిల్లలతో ఫ్లయిట్‌ ఎక్కారు. ఫ్లయిట్‌ టేకాఫ్‌ అయింది. పిల్లలు ఆటలు మొదలు పెట్టారు. అన్నీ అవుట్‌ డోర్‌ గేమ్సే! ఆ తల్లి.. మన హోస్టెస్‌ హెదర్‌ పూల్‌ను పిలిచింది. ‘ఆట స్థలం ఎక్కడ?’ అని అడిగింది! పూల్‌ వేరే వైపు చూస్తూ నవ్వు ఆపుకుంది. ‘విమానంలో ఆట స్థలం ఉండదు మ్యామ్‌’ అని చెప్పింది. ఆ తల్లి చికాకు పడింది. ‘ఇంత పెద్ద విమానంలో ప్లే గ్రౌండ్‌ లేకపోవడం ఏమిటి?’ అని విసుక్కుంది. ‘ఇకనైనా ప్లే ఏరియాకు ప్లేన్‌లో కొంత ప్లేస్‌ ఉంచండి’ అని సలహా ఇచ్చింది. పూల్‌ ఏమంటుంది? ‘సరే మ్యామ్‌’ అంది.

నాకేదోఅవుతోంది!అక్సిజన్‌తక్కువైందా?
ఫ్లయిట్‌ టేకాఫ్‌ అవగానే ఓ పెద్దాయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ‘‘ఇక్కడేంటో తేడాగా ఉందమ్మాయ్‌. ఈ ప్రయాణమంతా నేనిలా ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టునే ఉండాలా?’’ అని వోల్పేని అడిగారు. ‘అవసరం లేదండీ.. ఎమర్జెన్సీలో ఎలాగూ ఫ్లయిట్‌లో అదనపు ఆక్సిజన్‌ ఉంటుంది’’ అని వోల్పే చెప్పింది. అయినప్పటికీ ప్రయాణమంతా ఆయన బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నట్టుగా ఛాతీ నిండా గాలి పీల్చి వదులుతూనే ఉన్నారు. ఫస్ట్‌ టైమ్‌ ఫ్లయిట్‌ జర్నీలో కొందరికి ఇలా ఉండడం సహజమేనని వోల్పే నవ్వుతూ ప్రయాణికులకు ధైర్యం చెప్పేవారట.

నాదినేనివ్వను..నీదినాక్కావాలి!
‘చార్జర్‌ ఒకసారి ఇస్తారా?’ అని అడిగేవారు ఎక్కడైనా ఉంటారు. విమానంలోనూ ఉంటారు. కానీ తన  చార్జర్‌ అడిగితే మాత్రం చిరాగ్గా ఉంటుందట పూల్‌కి. ఎవరికి ఇచ్చానో గుర్తు తెచ్చుకుని వెళ్లి అడిగి తెచ్చుకునేంత టైమ్‌ ఉండదని ఆమె బాధ. నిజమే. హోస్టెస్‌ ఉన్నది విమాన సేవలు అందించడానికే కానీ, వ్యక్తిగతంగా సేవలు అందించడానికి కాదు కదా. ఒకవేళ అందించాలన్నా ప్రతిసారీ అలా కుదరదు. ఈ విషయం గ్రహించలేక కొంతమంది హోస్టెస్‌ల మీద మండిపడుతుంటారు. నిందలు వేస్తుంటారు. ఎవరి వస్తువులూ వారు ఇవ్వరు కానీ, అప్పుడప్పుడు తన జంప్‌ సీట్‌ (వేరుగా ఉండే సీటు)లో ఉండే ఎగ్‌ మెక్‌మఫిన్స్‌ మాయం అవుతుంటాయట! ఏమిటో ఈ మనుషులు అని నవ్వుతారు పూల్‌.

మరిన్ని వార్తలు