పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

10 Jul, 2019 08:17 IST|Sakshi

ఎంత ఘనంగా పెళ్లి చేశారన్నది కాదు... విందు ఎంత గొప్పగా ఉందన్నదీ కాదు... విందు ఇచ్చిన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా లేకపోతే మాత్రం భారీ పరిహారం చెల్లించక తప్పకపోవచ్చు ఇకపైన. ఇటీవల ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఔలీ ప్రాంతంలో ఓ అపర కుబేరుడి వివాహ వేడుక జరిగింది. భారీ ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో చెత్త కూడా అంతే మొత్తంలో పోగవడమే అటు పెళ్లివాళ్లకీ, ఇటు మునిసిపాలిటీ సిబ్బందికీ కూడా చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చెత్తను తొలగించలేక మున్సిపాలిటీ సిబ్బంది తల పట్టుకుంటున్నారు. భారతదేశానికి చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాలుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. రకరకాల వ్యాపారాలు చేస్తూ సంపన్న కుటుంబంగా ఎదిగింది. ఈ ఏడాది గుప్తాల ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ముందుగా ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో శతకోటీశ్వరుడు అజయ్‌ గుప్తా కుమారుడు సూర్యకాంత్‌ వివాహం జరిగింది. కొద్దిరోజుల వ్యవధిలోనే అజయ్‌ సోదరుడు అతుల్‌ గుప్తా కుమారుడు శశాంక్‌ పెళ్లి జరిగింది.

అత్యంత ఆడంబరంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్‌ నటులు, యోగా గురు బాబా రాందేవ్‌ సహా ఎందరో పెద్దలు, ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి వేడుకల కోసం గుప్తా కుటుంబం ఔలీలోని హోటళ్లు, రిసార్టులను బుక్‌ చేసుకుంది. అయితే ఈ వేడుకల తర్వాత ఔలీలో ఎక్కడ చూసినా చెత్తే కన్పిస్తోందట. ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ పడేశారట. వీరి వివాహం వల్ల దాదాపు 40 క్వింటాళ్ల చెత్త పోగైందని, ఈ చెత్తను శుభ్రం చేసేందుకు 20 మందితో ఓ బృందాన్ని నియమించామనీ అయినా సరే ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు కన్పిస్తున్నాయనీ మున్సిపల్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లివారికి భారీ మొత్తంలో జరిమానా విధించాలని కూడా ఆలోచిస్తున్నారట. మనలో మన మాట... ఇలాంటి వేడుకలు జరిగినప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే కనీసం మనమైనా జాగ్రత్తగా ఉంటాం...

మరిన్ని వార్తలు