చదివితే ఐఏఎస్‌ విద్యార్థిలాగే

2 Sep, 2019 03:08 IST|Sakshi

1973–75 కాలంలో ఓ పక్క వైద్యం, ఇంకోపక్క కుటుంబం. ఇక ఖాళీ సమయమంతా పుస్తక పఠనం ఇంతే. మరో వ్యాపకమే ఉండేది కాదు వైఎస్‌కి.

పులివెందులలో జిల్లా శాఖా గ్రంథాలయం ఒకటుంది. ఆ గ్రంథాలయం కేరాఫ్‌ అడ్రస్సయ్యింది. అక్కడ కూర్చుని– చరిత్ర, సమాజం, రాజకీయాలకు చెందిన పుస్తకాలతో పాటు ఇంగ్లిష్‌ ఫిక్షన్‌ కూడా చదివేవాడు. హెరాల్డ్‌ రాబిన్స్‌ రచించిన ‘ది ఎడ్వెంచరర్స్‌’, మారియో ఫ్యుజో రచించిన ‘ద గాడ్‌ఫాదర్‌’ లాంటి పుస్తకాలు వైఎస్‌ ఆ రోజులలో చదివినవే.

చదవడం మొదలుపెడితే వైఎస్‌కి పుస్తకమే ప్రపంచమైపోయేది. బయటి ప్రపంచం కనిపించకుండా పోయేది. వైఎస్‌ కాన్సంట్రేషన్‌ అలాంటిది. అసెంబ్లీలోనో, మరో చోటనో ప్రసంగించేందుకు తయారు చేసుకునే స్పీచ్‌లకు ప్రిపేరయ్యేటప్పుడు కూడా అంతే. తలుపులు వేసేసుకొని గంట రెండు గంటలపాటు ఎవరినీ లోపలికి రానివ్వకుండా, ఎవరూ తనను డిస్టర్జ్‌ చేయకుండా– ఎంసెట్‌కో, ఐఏఎస్‌కో ప్రిపేరయ్యే సీరియస్‌ స్టూడెంట్‌లా ఏకాగ్రతతో ప్రసంగ పాఠాల్ని పఠించిన సందర్భాలు అనేకం.
-ఆకెళ్ల రాఘవేంద్ర  (‘దటీజ్‌ వైఎస్‌ఆర్‌’ లోంచి)

సాహిత్యం పట్ల వైఎస్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. కళాకారులు, సాహితీవేత్తల పట్ల కులం, వర్గం, మతాలతో నిమిత్తం లేకుండా గౌరవాన్ని ప్రదర్శించేవారు. షేక్‌ హుసేన్‌ సత్యాగ్ని, శశిశ్రీ(షేక్‌ రహమతుల్లా) లాంటి రచయితల్ని ఎంతో ప్రోత్సహించారు. కడపలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధికీ, అది నిలదొక్కుకోవడానికీ ఎంతగానో సహకరించారు.-కేతు విశ్వనాథ రెడ్డి


తెలుగుకు ప్రాచీన హోదా గురించి ఆయనకు ఎలాంటి ఆలోచనలుండేవోగానీ భాష అభివృద్ధి చెందుతుంది అని ఓ సందర్భంలో చెప్పినప్పుడు వెంటనే సీరియస్‌గా తీసుకున్నారు. రెండ్రోజుల్లోనే దాని గురించి కమిటీ వేశారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కడానికి కృషి చేశారు. ఇంగ్లిషు నేర్చుకోవాలి, తెలుగు తప్పకుండా చదువుకోవాలి అనేవారు. -డాక్టర్‌ ఎల్వీకే

2000 సంవత్సరంలో విద్యుత్‌ ఉద్యమం జరిగినప్పుడు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన  దీక్షకు మద్దతుగా కవిసమ్మేళనం జరిగింది. ఆయన అందరి కవితలనూ ఎంతో శ్రద్ధగా విన్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి కవిత్వానికి ఉందని నమ్మిన మనిషి ఆయన. ఒక పుస్తకం ఇస్తే దాని సారాన్ని ఇట్టే గ్రహించగలిగేవారు.-కందిమళ్ల భారతి
 

మరిన్ని వార్తలు