చైత్రయాత్ర

8 Sep, 2019 04:48 IST|Sakshi

స్క్రీన్‌ మీద చైతూ కనిపిస్తే మైండ్‌ ఫ్రెష్‌గా అయిపోతుంది! పసి పిల్లాడిలా ఆ నవ్వు చూశారా.. దానికి పడిపోతాం. క్యారెక్టర్‌ కోసం సీరియస్‌గా ఉంటాడే గానీ, సీరియస్‌గా ఉండే క్యారెక్టర్‌ కాదు చైతూది. ‘జోష్‌’ నుంచి ‘మజిలీ’ వరకు పదడుగులు. రెండేళ్ల క్రితం సమంతతో ఏడడుగులు. బ్యూటిఫుల్‌ జర్నీ అంటాడు. ఆ జర్నీలోని మలుపులు, మేల్కొలుపులు ఈ వారం సాక్షి ఎక్స్‌క్లూజివ్‌.

ఈ నెల 5తో హీరోగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు కదా... ఈ పదేళ్ల ప్రయాణం ఎలా అనిపించింది?
కచ్చితంగా అందమైన ప్రయాణం అనే చెప్పాలి. విజయాలు, అపజయాలు రెండూ ఉన్నాయి. అయినా బ్యూటిఫుల్‌ జర్నీ అని ఎందుకు అన్నానంటే... జీవితం విలువ తెలియాలంటే ఈ రెండూ ఉండాలి. నిజానికి పదేళ్ల క్రితం నా ఆలోచనలు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. అసలు ఇండస్ట్రీ మనకు కరెక్టా? కాదా? అనే సందేహం ఉండేది. సరే.. ఒక సినిమా చేసి చూద్దాం అనుకున్నాను. ఒక డైలమాలో ‘జోష్‌’తో కెరీర్‌ మొదలుపెట్టా. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ పదేళ్లను పది అడుగులు అనుకుంటున్నాను. ఇంకా సాధించడానికి చాలా ఉంది. 

సినిమా పేరు ‘జోష్‌’ కానీ రిజల్ట్‌ అంత జోష్‌ ఇవ్వలేదు. ఫస్ట్‌ సినిమాకే అలా జరగడాన్ని ఎలా తీసుకున్నారు?
వయసు ప్రభావమో ఏమో కానీ ఆ రిజల్ట్‌ ఏమాత్రం నన్ను బాధపెట్టలేదు. అప్పుడు నాకు ఓ 23 ఏళ్లు ఉంటుంది. సీరియస్‌నెస్‌ తక్కువే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం టెన్షన్‌గానే ఉంటుంది. అప్పుడే ఇంకొంచెం జాగ్రత్త వహించి ఉంటే బావుండేది అనిపిస్తుంటుంది.

మీ మాటలు వింటుంటే హీరో అవ్వాలని అంత సీరియస్‌గా అనుకోలేదేమో అనిపిస్తోంది...
యాక్టింగ్‌ మీద ఆసక్తి ఉంది. సీరియస్‌నెస్‌ కూడా ఉంది. అయితే అది ఇంత పెద్ద  బాధ్యత అని మాత్రం అర్థం కాలేదు. తొలి సినిమా చేస్తున్నప్పుడు అంత అవగాహన లేదు. నేనెంత అదృష్టవంతుణ్ణో, ఎంత లక్కీయో ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత నాకు అర్థం అయింది. రావడం రావడమే వారసత్వంగా వచ్చిన అభిమానుల బలం దొరికింది. ఆ విషయం ఫస్ట్‌ సినిమా అప్పుడు నేను పెద్దగా గ్రహించలేదు. అయితే ఆ తర్వాత  సినిమా ఫ్లాప్‌ అయితే ఫ్యాన్స్‌ ఎంత ఫీలవుతారో అర్థం అయింది. తాతగారి వారసత్వం ప్రభావం నా మీద ఎంత ఉంటుందో అర్థం చేసుకున్నాక బాధ్యతగా ఉండాలనుకున్నాను. 

హీరోగా పది అడుగులు పూర్తి చేశానన్నారు. చిన్నప్పుడు తప్పటడుగులేమైనా..? 
అవేం గుర్తులేదు. అయితే ప్రతీరోజూ అమ్మ మంచి సలహాలు, సూచనలే ఇస్తుండేవారు. అప్పుడూ ఇప్పుడూ నన్ను గైడ్‌ చేస్తూ ఉన్నారు. అమ్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అరవకుండా, అర్థం అయ్యేలా చెబుతారు. నాన్న కూడా అంతే. ఏ విషయాన్నయినా చాలా తేలికగా చెబుతారు. మనసులో నాటుకుపోయేలా చెబుతారు. 

స్కూల్లో కంప్లయింట్స్‌ మీ ఇంటి వరకూ వచ్చేవా?
ఒకటా రెండా? చాలా వచ్చేవి. ఎక్కువగా నా చదువు గురించే. చదువులో మనం జస్ట్‌ యావరేజ్‌ (నవ్వుతూ). చిన్నప్పటి నుంచి క్రియేటివ్‌ సైడే ఎక్కువ ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు సంగీతం అయినా, ఇతర యాక్టివిటీస్‌లో అయినా ఎక్కువ పాల్గొనేవాణ్ణి. అందుకే మార్కుల గురించి కంప్లయింట్లు వచ్చేవి.

కాలేజీ రోజుల్లో బంక్‌ కొట్టిన సంఘటనలు...
బాగానే బంక్‌ కొట్టేవాళ్లం. ఎక్కువగా సినిమాలు చూడటానికే. అమెరికా వెళ్లి చదువుకోమని నాన్న అన్నారు. నేనే వెళ్లలేదు. నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్స్‌ చూస్తూ, థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూస్తూ హ్యాపీగా ఉండొచ్చన్నది నా ప్లాన్‌. అమ్మ మాత్రం ‘నువ్వు ఏం చేసినా ఓకే. నీకు నచ్చిందే చెయ్యి. యాక్టింగ్‌ అంటే ఇంట్రస్ట్‌ ఉంటే అదే చేద్దువుగానీ.. కానీ డిగ్రీ మాత్రం పూర్తి చేశాకే’ అన్నారు. కాలేజీకి వెళ్లడంతో పాటు యాక్టింగ్‌ స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. షూటింగ్స్‌కి వెళ్లడం అవన్నీ చేసేవాణ్ణి. సినిమా రిలీజ్‌ ఉంటే కాలేజ్‌ బంకే. 

హీరో అవుతానన్నప్పుడు మీ తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) ఏమన్నారు? ఆయన్నుంచి మీరు నేర్చుకున్నది?
తాత అయితే ఫుల్‌ హ్యాపీ. ఆయనెప్పుడూ ఓ స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడేవారు. నా ఫస్ట్‌ సినిమా కథ చెప్పినప్పుడు చాలా మంచి కథ. మెచ్యూర్డ్‌ సబ్జెక్ట్‌ అన్నారు. చాలా సపోర్ట్‌ చేశారు. నేను ఆయన నుంచి నేర్చుకున్నది ఏంటంటే యాక్ట్‌ చేయడమంటే జీవించడం. ఓవర్‌గా యాక్ట్‌ చేసేయడం, టూమచ్‌గా ఉండటంలా కాకుండా సహజంగా ఉండాలని తాతగారి సినిమాలు చూసి నేర్చుకున్నాను. తాతయ్య నేచురల్‌ ఆర్టిస్ట్‌. మనం బయట ఎలా ఉంటామో, స్క్రీన్‌ మీద కూడా అలానే అనిపించాలన్నది ఆయన కెరీర్‌ నుంచి నేను తీసుకున్న విషయం.

మరో తాతగారు (రామానాయుడు) నుంచి ఏం నేర్చుకున్నారు?
ఒక బాధ ఏంటంటే తాత బ్యానర్‌లో (సురేశ్‌ ప్రొడక్షన్స్‌) నేను సినిమా చేయలేదు. మొదటి నుంచి కూడా ‘నీ సినిమాని ప్రొడ్యూస్‌ చేస్తాను. ఏం సినిమా చేస్తావు చెప్పు’ అని రామానాయుడు తాతయ్య అనేవారు. అయితే ఆ చాన్సే రాలేదు. అదొక అసంతృప్తి ఉంది. ఆయన కూడా చాలా సపోర్ట్‌ చేశారు. ఏం చేస్తున్నావు? కథేంటి అని అడుగుతుండేవారు. ఈ తాత నుంచి క్రమశిక్షణ వంటివన్నీ నేర్చుకున్నాను.

ఇప్పుడు సురేష్‌ ప్రొడక్షన్స్‌లో మీ మావయ్య వెంకటేశ్‌తో ‘వెంకీ మామ’ చేస్తున్నారు కదా.. 
కానీ మా తాత (రామానాయుడు) సెట్లో ఉండరు కదా. ఆయన ఉండగా సినిమా చేస్తే లొకేషన్లో ఉండేవారు. ఆయన ప్రొడ్యూసర్‌గా, నేను హీరోగా మా కెమిస్ట్రీ ఎలా ఉండేదో ఎక్స్‌పీరియన్స్‌ అయ్యేవాణ్ణి. ఆ అనుభూతి జీవితాంతం నిలిచిపోయి ఉండేది.

మీరు నటించిన ‘ప్రేమమ్‌’లో వెంకటేశ్‌ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఇప్పుడు ఆయనతో కలిసి ఫుల్‌ లెంగ్త్‌ మూవీ చేయడం ఎలా ఉంది?
ఆఫ్‌ స్క్రీన్‌ అయినా ఆన్‌ స్క్రీన్‌ అయినా మా వెంకీ మామ ఫన్‌ని చాలా ఇష్టపడతారు. వెంకీ మామతో చేయడం నాకు పెద్ద చాలెంజ్‌. ఆయన కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉంటుంది. దాన్ని మ్యాచ్‌ చేయాలంటే చాలా అనుభవం కావాలి. ఆయనతో యాక్టింగ్‌ని ఎంజాయ్‌ చేస్తూనే చాలా నేర్చుకుంటున్నాను. వెంకీగారి అభిమానులకు, మా అభిమానులకు ‘వెంకీ మామ’ గ్యారెంటీగా పండగలా ఉంటుంది. 

మా నాన్నగారితో కూడా మళ్లీ (ఇంతకు ముందు మనం, ప్రేమమ్‌ చేశారు) చేయబోతున్నారు కదా?
‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్‌ ‘బంగార్రాజు’ లో కలిసి యాక్ట్‌ చేయబోతున్నాం. త్వరలో అది మొదలవుతుంది. అందులో నాకు, నాన్నకు మంచి పాత్రలు ఉన్నాయి. వచ్చే ఏడాది రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం. 

సినిమా మీకు అభిమానులను ఇచ్చింది. చాలా గౌరవాన్ని ఇచ్చింది. అలాగే జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. ఆ స్వీట్‌ మెమొరీస్‌ ఏమైనా? 
అవును కరెక్ట్‌ (నవ్వుతూ). ‘ఏ మాయ చేసావె’ సినిమా చేస్తున్నప్పుడు నేను, స్యామ్‌ (సమంత) హీరో హీరోయిన్‌ అన్నట్లు చేశాం. పెద్దగా ఫ్రెండ్స్‌ కూడా అవ్వలేదు. మా జర్నీ ఇక్కడి వరకూ వస్తుందని అస్సలు ఊహించలేదు. అప్పుడు మేమిద్దరం చాలా యంగ్‌. ఏం చేస్తున్నామో కూడా సరిగ్గా తెలియదు. నేను గౌతమ్‌ మీనన్, ఏఆర్‌ రెహమాన్‌ కి పెద్ద ఫ్యాన్‌ని. అందుకే గౌతమ్‌ డైరెక్షన్‌లో ‘ఏ మాయ చేసావే’ సినిమా అనగానే ఫుల్‌ ఖుషీ అయిపోయాను. అదే సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు కావడంతో నా అదృష్టం అనుకొని ఆ సినిమా చేశాను. నాకు ప్రేమకథల వల్ల మంచి గుర్తింపు లభించిందంటే ఆ సినిమా వల్లే. 

కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్‌ ముందు గొడవ పడి తర్వాత ప్రేమలో పడతారు. స్యామ్, మీ ప్రేమ కథకు అలాంటి టచ్‌ ఏమైనా ఉందా? 
పాజిటివ్స్, నెగటివ్స్‌ ఉన్నాయి. కొన్ని గొడవలు జరిగాయి. అందరూ పడే చిన్న చిన్న గొడవలే. చిన్న చిన్న అపార్థాలు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒక మనిషిని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అది చిన్న విషయం కాదు. ప్రతి మనిషి డిఫరెంట్‌గా ఉంటారు. ఏ ఇద్దరి మనసు ఒకలా ఉండదు. గొడవ జరిగితే మంచిదే. దాన్ని పరిష్కరించుకుని ఒకరొనొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. గొడవలు పడుతూ, సాల్వ్‌ చేసుకుంటూ వెళ్లాలి. అలా వెళితేనే బాండింగ్‌ బలపడుతుంది.

గొడవలు పడినప్పుడు ఎవరు ముందు మాట్లాడతారు?
చాలా సందర్భాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ. కొన్ని సార్లు నేనే ఎక్కువ టైమ్‌ తీసుకుంటాను మాట్లాడటానికి. సమంత వెంటనే వచ్చి మాట్లాడేస్తుంది. నేను రిజర్డ్వ్‌ టైప్‌ కాబట్టి కొంచెం సమయం తీసుకుంటానేమో. తక్కువ మాట్లాడే స్వభావం నాది.

ఓ మనిషిని అర్థం చేసుకోవాలంటే జీవిత కాలం పడుతుందన్నారు. జీవితం పంచుకున్న మీ ఇద్దరికీ ఇంకా ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందనుకుంటున్నారా? 
ప్రతీ వారమో, నెలలోనో కొత్త ఓ సందర్భం ఏర్పడుతుంది. అప్పుడు ఎదుటి మనిషిలో ఇంకో కోణం తెలుస్తుంది. కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడే మన పర్సనాలిటీ ఓపెన్‌ అవుతుంటుంది. ఇది మాకనే కాదు.. ఎవరి లైఫ్‌లో అయినా కామనే. ఓ కొత్త సమస్య వచ్చినప్పుడో, ఓ మంచి సంఘటన జరిగినప్పుడో.. ఇలా డైలీ లైఫ్‌లో జరిగే విషయాలకు మనం ఎలా రియాక్ట్‌ అవుతాం అనేదాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి మన మనసత్త్వం అర్థం అవుతుంది. ఆ విధంగా చూస్తే.. లైఫ్‌ జర్నీలో ఒకర్నొకరు అర్థం చేసుకోవడం అనేది ఓ ప్రాసెస్‌లా జరుగుతుంది.

పెళ్లయ్యాక మీ ఇద్దరూ కలిసి చేసిన ‘మజిలీ’ సూపర్‌ హిట్‌. మళ్లీ కలసి స్క్రీన్‌ ఎప్పుడు షేర్‌ చేసుకుంటారు? 
మళ్లీ కలసి చేయాలని మాకూ ఉంది. విభిన్నమైన కథ దొరికితే తప్పకుండా చేస్తాం. అది కొన్ని నెలల్లోనే జరగచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఏదైనా స్క్రిప్ట్‌ని బట్టే ఉంటుంది.

ఈ మధ్య సమంతకు సినిమా అవకాశాలు తగ్గాయేమో అనిపిస్తోంది.. పెళ్లి ప్రభావం ఏమైనా?
ఈ రెండేళ్లలో తన కెరీర్‌ బెస్ట్‌ ఫేజ్‌లో ఉందని అనుకుంటున్నాను. ‘రంగస్థలం, మహానటి, మజిలీ, యుటర్న్, ఓ బేబీ’ అన్నీ బెస్ట్‌ సినిమాలే చేసింది. అన్నీ హిట్‌ అవడంతో పాటు స్యామ్‌కి మంచి పేరు కూడా వచ్చింది. కొత్తగా వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. తను పని పరంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్వాంటిటీ (సినిమాల సంఖ్య) తగ్గినా క్వాలిటీ పెరిగింది. స్యామ్‌ కావాలనే ఆ దారిలో వెళ్లాలనుకుంటోంది. తక్కువ చేసినా మంచి సినిమాలు చేయాలి. అదే ప్రస్తుతం తన గోల్‌. తను ఆల్రెడీ ప్రూవ్డ్‌ యాక్టర్‌. ఒప్పుకుంటే ఎన్ని సినిమాలైనా చేస్తుంది. కానీ ‘ఎక్కువ సినిమాలు’ అనే లెక్క చూసుకోవడంలేదు.

మీకు కావాల్సినన్ని డబ్బులు ఉన్నాయి. గైడ్‌ చేయడానికి ఫ్యామిలీ ఉంది. మంచి లైఫ్‌ పార్టనర్‌ కూడా ఉంది. మరి ఆడుకోవడానికి పిల్లలు ఎప్పుడు? 
(పెద్దగా నవ్వుతూ) టైమ్‌ వస్తుంది. త్వరలో.

పిల్లలంటే మీకు బాగా ఇష్టం కదా? 
అవును. చాలా చాలా. పిల్లలంటే ప్యూరిటీ.

అమ్మానాన్న అడుగుతుంటారా? పిల్లలెప్పుడూ అని? ఒత్తిడిలాంటిది ఏమైనా? 
హ.. హ.. హ.. అమ్మానాన్న సరదాగా డైలాగులు వేస్తూనే ఉంటారు. మనవళ్లు కావాలని కచ్చితంగా కోరుకుంటారు కదా. అడిగినప్పుడల్లా నవ్వేసి ఊరుకోవడమే.

మీ నాన్నగారికి 60. మీకేమో 32. ఆ సీక్రెట్‌ ఏంటోగానీ... మీ నాన్న అంత వయసులా కనిపించరు. మీరూ 32లా ఉండరు...
ఏం లేదండీ. సంతోషంగా ఉంటాం. అదే సగం బలం అంటారు కదా. బలంతో పాటు ఆ హ్యాపీనెస్‌ మన ముఖంలో కూడా కనిపిస్తుంది.

సంతోషం ఎలా వస్తుంది? మనకున్న డబ్బు వల్లా? సక్సెస్‌ వల్లా? 
కెరీర్‌ మొదలుపెట్టినప్పుడు ఇంత డబ్బుంటే బావుండు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు అని అనుకునేవాణ్ణి. ఆ ఆలోచనా విధానంతో చేసేవాణ్ణి. డబ్బు సంపాదించి, కావాల్సినవన్నీ కొనుక్కున్నాక ‘ఇంతే కదా’ అనిపించింది. మనం ఏ పని చేసినా దాన్ని ఎంజాయ్‌ చేస్తూ, ఆస్వాదిస్తూ చేస్తే కచ్చితంగా సంతోషంగా ఉంటామని అర్థం అయింది. నా కుటుంబం సంతోషంగా ఉంటే నాకు అదే పెద్ద సంతోషం. చేసే పనిలో సక్సెస్‌ వస్తే అది సంతోషం. 

మొన్న వెళ్లిన హాలిడే ట్రిప్‌ గురించి. షూటింగ్స్‌ కోసం ఆల్రెడీ ఫారిన్‌ వెళ్తారు. మళ్లీ హాలిడేలకు ఫారిన్‌ వెళ్లడం ప్రైవసీ కోసమేనా? 
షూటింగ్స్‌కి వెళ్లినప్పడు కొన్ని లొకేషన్స్‌ హాయిగా ఉంటాయి. అప్పుడు ‘అబ్బా! ఇక్కడికి హాలిడేకు వస్తే బావుంటుంది’ అని అనిపిస్తుంది. షూటింగ్స్‌ అప్పుడు ఉదయాన్నే నిద్రలేవాలి. మేకప్‌ వేసుకొని షాట్‌ కోసం రెడీగా ఉండాలి. ఆ దృశ్యాలను ఎంజాయ్‌ చేసే ఆలోచన ఉండదు. ధ్యాసంతా పని మీదే ఉంటుంది. అందుకే నచ్చిన లొకేషన్‌ని హాలిడే స్పాట్‌గా ఫిక్స్‌ చేసుకుని వెళ్లడం నాకు ఇష్టం. ఫోన్‌ టచ్‌ లేకుండా, దూరంగా వెళ్లి మనకు కావాల్సిన వాళ్లతో టైమ్‌ స్పెండ్‌ చేయడం నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. మొన్న ట్రిప్‌ నాన్న 60వ పుట్టిన రోజు అని వెళ్లాం. బాగా ఎంజాయ్‌ చేసి తిరిగొచ్చాం.
 హాలిడే ట్రిప్‌లో సమంత, నాగచైతన్య, నాగార్జున, అమల, అఖిల్‌ 

ఫైనల్లీ జీవితం ఎలా ఉంది?
చాలా బావుంది. బ్యూటిఫుల్‌ అనొచ్చు. కంప్లయింట్స్‌ ఏం లేవు. చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉన్నాను. ఇక అడగడానికి ఏమీ లేదు. 
– డి.జి. భవాని

మరిన్ని వార్తలు