ప్రెగ్నెంట్‌ అయితేనే అవన్నీ తెలుస్తాయి

1 Sep, 2019 06:46 IST|Sakshi

అక్షర ఒడ్డున ఉంది. ఒడ్డున ఉందంటే ఒడ్డున పడిందని కాదు. ఈదాల్సిన సముద్రం ఉంది. రెండు పడవలు ఉన్నాయి.యాక్షన్‌ ఒకటి.. డైరెక్షన్‌ ఇంకోటి. కన్‌ఫ్యూజనేం లేదు. క్లారిటీ ఉంది. సినిమాల్లోనే టేక్‌లకు చాన్స్‌ ఉంటుందనీ.. లైఫ్‌లో దేనికైనా ఒకే టేక్‌ ఉంటుందనీ..అక్షరకు క్లారిటీ ఉంది.  ఏ పడవైనా.. లైఫ్‌కి పనికొచ్చేదే ఆమె టేక్‌!చదవండి.. ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌.

‘షమితాబ్‌’తో హీరోయిన్‌ అయ్యారు. నాలుగేళ్లల్లో నాలుగే సినిమాలు చేశారు. సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మంచి స్క్రిప్ట్స్‌ రాలేదా?
అక్షరా హాసన్‌: అలా ఏం లేదు. స్క్రి‹ప్ట్స్‌ ఉన్నాయి. అయితే ఏది సెలెక్ట్‌ చేసుకోవాలో అర్థం కాలేదు. కారణం ఏంటంటే నేనెలాంటి యాక్టర్‌  అనిపించుకోవాలో తెలుసుకోవడానికి కొంచెం టైమ్‌ పట్టింది. ఏది పడితే అది తీసుకొని కన్‌ఫ్యూజ్‌ కావద్దని నాకు నేను చెప్పుకున్నాను. ‘క్లియర్‌గా ఉండాలి’ అని మాత్రం ఫిక్స్‌ అయ్యాను. అలా ఫిక్స్‌ అవ్వకపోతే టైమ్, డబ్బు, ఎనర్జీ వృథా అయిపోతాయి. దానికి తోడు పేరు కూడా పాడైపోతుంది. ‘తనకు ఎలాంటి సినిమాలు చేయాలో తనకే తెలియదు.. పాపం’ అనే కామెంట్స్‌ వినాలనుకోలేదు. తనకో ఐడియా ఉందనుకుంటే చాలు. అందుకే ‘టేకిట్‌ ఈజీ అక్షరా.. ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు. మనసుకి నచ్చినది, మనకు సూట్‌ అయ్యేది చేశామా? లేదా? అన్నదే ముఖ్యం’ అని నాకు నేను చెప్పుకుంటాను.

ఫస్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశారు. డైరెక్టర్‌ అవుతారేమో అనుకుంటే హీరోయిన్‌ అయ్యారు. ‘క్లియర్‌గా ఉంటా’ అన్నారు. ఏం కావాలో నిజంగానే క్లియర్‌గా ఉన్నారా?
నిజానికి నేను డ్యాన్సర్‌ కావాలనుకున్నాను. ఆ లక్ష్యం నెరవేరలేదు. నా కాలికి గాయం కావడంతో సంవత్సరం పాటు డ్యాన్స్‌ చేయలేకపోయాను. అప్పటివరకూ చెన్నైలో ఉండేదాన్ని. ఏడాది పాటు డ్యాన్స్‌ కష్టం అనే పరిస్థితిలో ముంబైకి షిఫ్ట్‌ అయ్యా. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యాను. నాలుగేళ్లు వర్క్‌ చేశాను. నా కెరీర్‌లో ఏడీ (అసిస్టెంట్‌ డైరెక్టర్‌)గా వర్క్‌ చేసిన ఆ నాలుగేళ్లు ఎంతో విలువైనవి. స్క్రీన్‌ మీద మనం ఏదైనా సృష్టించాలంటే దాన్ని ఎలా స్క్రీన్‌ మీదకు తీసుకురావాలో అర్థం అయింది. ఆ తర్వాత అనుకోకుండా యాక్టర్‌ని అయ్యాను. ఓ డ్రామా చేస్తున్నప్పుడు  మా ఫ్రెండ్‌కి ఆరోగ్యం బాగాలేకపోతే నేను తన పాత్ర చేశాను. యాక్టింగ్‌ని ఎంజాయ్‌ చేయడం మొదలుపెట్టాను. ఆ విషయాన్నే నా ఫ్రెండ్‌తో చెప్పాను. అలా యాక్టింగ్‌తో ప్రేమలో పడిపోయాను. సరిగ్గా అప్పుడే ‘షమితాబ్‌’ సినిమాకి చాన్స్‌ వచ్చింది.

ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి? నటిగానేనా? డైరెక్షన్‌ వైపు వెళ్లాలనుకుంటున్నారా?
నాకు వీలున్నంత కాలం నటిగా కొనసాగుతాను. అలాగే డైరెక్టర్‌ కూడా అవ్వాలనుంది. రెండిటినీ బ్యాలెన్స్‌ చేయాలనుకుంటున్నాను.. చూద్దాం.

‘రజనీకాంత్‌గారిని, మా నాన్నగారిని డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడూ అదే చెబుతారా?
వాళ్లతో సినిమా చేయాలనేది మంచి ఐడియానే. కానీ చాలా పెద్ద బాధ్యత. ఆలోచిస్తుంటే భయంగా ఉంది. అయితే ఇప్పుడు వాళ్లిదర్నీ హ్యాండిల్‌ చేసేంత అనుభవం నాకు లేదనుకుంటున్నాను.
     అలాగే ఆన్‌స్క్రీన్‌ కూడా కమల్‌హాసన్‌ కూతురిగా నటించాలని ఉందన్నారు..
నాన్నతో కలిసి నటించే అవకాశం అంటే ఎగిరి గంతేస్తాను. అంత పెద్ద ఆర్టిస్ట్‌ కాంబినేషన్‌లో సినిమా చేస్తే యాక్టర్‌గా నేను చాలా నేర్చుకోగలుగుతాను. మరి.. మా ఇద్దరికీ కుదిరే కథ ఎవరు తెస్తారో? చూడాలి.

కమల్, సారికల కూతురిగా ప్లస్సులు, మైనస్సులు?
అమ్మానాన్న మల్టీ టాలెంటెడ్‌. అలాంటి వ్యక్తులు పక్కన ఉంటే ఎంతైనా నేర్చుకోవచ్చు. నాకు, అక్కకు ఉన్న అడ్వాంటేజ్‌ అది. డిస్‌అడ్వాంటేజ్‌ ఏంటంటే... వాళ్లెప్పుడూ బిజీగా ఉంటారు. అందుకని తక్కువ నేర్చుకోవడానికి కుదురుతుంది. వాళ్లతో టైమ్‌ స్పెండ్‌ చేసేది చాలా తక్కువ.

అలాగే మీ అక్కచెల్లెళ్లిద్దరూ కూడా ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేయరేమో?
అది కూడా నిజమే. అయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మేం ఫోన్‌ చేసి, మాట్లాడుకుంటాం. బయట వ్యక్తులు దగ్గర షేర్‌ చేసుకోలేని విషయాలు ఏమైనా ఉంటే అక్కతోనే చెబుతాను. అక్క కూడా అంతే.

మరి.. మైఖేల్‌ కోర్సలే నుంచి బ్రేకప్‌ అయిన మీ అక్కను కారణం అడిగారా?
లేదు. అడగాలనిపించలేదు. ఆ విషయం గురించి మాట్లాడను.

తక్కువ సినిమాలు చేశారు కానీ, ‘ప్రైవేట్‌ పిక్స్‌ లీక్‌’, ప్రేమ వ్యవహారం వంటి వాటితో బాగానే వార్తల్లో ఉంటారు. లీకైన ఆ ఫొటోల గురించి?
నేనో విషయాన్ని నమ్ముతాను. భవిష్యత్‌ అంతా ‘ప్రస్తుతం’ మీద ఆధారపడి ఉన్నప్పుడు గతం గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఈ ఆలోచనను నేను చాలా విషయాలకు ఆపాదిస్తాను. అందుకే గడిచిపోయిన విషయాల గురించి మాట్లాడను. నేనేం చెప్పాలనుకున్నానో అప్పుడే చెప్పేశాను.

ఇలాంటి చేదు అనుభవాల వల్ల సెలబ్రిటీగా ఉండటం పెద్ద ఒత్తిడి అని భావిస్తారా? 
నేను పుట్టి పెరిగిందంతా సినిమా వాతావరణమే. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను. మనం మనంలా ఉన్నప్పటికీ చాలాసార్లు అపార్థం చేసుకునే అవకాశం ఉన్న చోటిది. ఏ పబ్లిక్‌ ఫిగర్‌కైనా ఇది కామనే. అమ్మానాన్నల కెరీర్‌ని చూస్తూ పెరిగాను కాబట్టి సెలబ్రిటీల లైఫ్‌ గురించి కొంచెం అవగాహన ఏర్పడింది. ఒత్తిడి ఉంటుందని తెలుసు. అందుకే టేక్‌ ఇట్‌ ఈజీ అన్నట్లుగా ఉండటం అలవాటు చేసుకుంటున్నాను. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆ మూమెంట్‌లో ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఇంటర్వ్యూ అనుకుందాం. షూటింగ్‌లో సరిగ్గా చేయకపోతే ‘ఇంకో టేక్‌ తీసుకోనా?’ అనొచ్చు. ఇక్కడ కుదరదు. అప్పటికప్పుడు ఏమనిపిస్తే అది చెప్పాలి. అలాగే పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఇంకో టేక్‌కి చాన్స్‌ ఉండదు. అప్పటికప్పుడు అనిపించినది చేస్తాం. అందులో తప్పు వెతికితే ఏమీ చేయలేం.

ఫైనల్లీ.. జీవితంలో మీరు పాటించే ఓ విషయం గురించి చెబుతారా?
‘నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు.. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అన్నది ముఖ్యం. నిన్ను ఇతరులు ఎలా చూస్తున్నారు? నీ గురించి ఏమనుకుంటున్నారు? అనేది ముఖ్యం కాదు’. నేను పాటించేది ఇదే. మనకున్నది ఒకే ఒక్క లైఫ్‌. ఆ జీవితాన్ని వీలైనంత ఆనందంగా, అద్భుతంగా మలుచుకోవాలి కానీ వాళ్ల గురించి వీళ్ల గురించి ఆలోచిస్తూ, వాళ్లేమనుకుంటున్నారో వీళ్లేమనుకుంటున్నారో అని కంగారుపడుతూ బతకకూడదు

‘ఫింగర్‌ టిప్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఆ అనుభవం ఎలా ఉంది?
మంచి కంటెంట్‌ ఉన్న సిరీస్‌ ద్వారా వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టినందుకు హ్యాపీగా ఉంది. సెల్‌ఫోన్స్‌తో కాకుండా మనుషులతో మింగిల్‌ అవ్వండి అనేది ఈ సిరీస్‌ ప్రధానాంశం. హైటెక్‌ మొబైల్స్‌కి బానిస కావడం ద్వారా ఏర్పడే నష్టాన్ని చెబుతున్నాం. అసలు ఇవాళ మన జీవితంలో సోషల్‌ మీడియా ఓ భాగమైపోయింది. ఇలాంటి సమయంలో దానివల్ల కలిగే నష్టాలను చెబుతున్నాం. వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. నేను ఎంజాయ్‌ చేశాను.

మీరు చేసిన నాలుగు  సినిమాల్లో రెండు సినిమాల్లో (లాల్‌ కీ షాదీ మే లడ్డూ దీవానా’, మిస్టర్‌ కేకే’) గర్భవతిగా నటించారు. ఆ పాత్ర చేయడానికి మీ అమ్మగారి నుంచి సలహాలు తీసుకున్నారా?
మొదటిసారి గర్భవతిగా నటించినప్పుడు ఆ సెన్సిబులిటీస్‌ అర్థం కాలేదు. కానీ బేసిక్‌గా ఎలా ఉంటుందో అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. మనం నిజంగా ప్రెగ్నెంట్‌ అయితేనే పూర్తిగా అర్థమవుతుంది (నవ్వుతూ). ఎలా నడుస్తారు, ఎలా కూర్చుంటారు.. ఇలాంటి విషయాలన్నీ మా అమ్మను అడిగాను. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ టక్కున లేచి కూర్చోలేరు. చాలా మెల్లిగా లేవాలి. బాడీ లాంగ్వేజ్‌ మాత్రమే కాదు అదో స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌. దాన్ని అర్థం చేసుకున్నాను. ఆ భయాలు, ఎగై్జట్‌మెంట్‌ అన్నీ తెలుసుకున్నప్పుడే ఆ క్యారెక్టర్‌లోకి వెళ్లగలం. ప్రెగ్నెంట్‌గా ఉండటం అనేది కేవలం శారీరక విషయం మాత్రమే కాదు మానసికమైనది కూడా. 

మదర్‌హుడ్‌ మీద ఏదైనా ఫీలింగ్‌ ఏర్పడిందా? 
కచ్చితంగా రెస్పెక్ట్‌ ఏర్పడింది. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో వాళ్ల ఆలోచనా విధానంలో ఎటువంటి మార్పు వస్తుంది అనేది  తెలిసింది. మా అమ్మకు ఎన్ని ఇబ్బందులు కలిగించానో అనిపించింది. ప్రపంచంలో ఉన్న అద్భుతాల్లో పేరెంట్స్‌గా ఉండటం ఒకటి. మరీ ముఖ్యంగా మదర్‌గా ఉండటం.

మీ అమ్మగారికి మీరేం ఇబ్బందులు కలిగించారో చెబుతారా? 
చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. మీ అమ్మాయి క్లాసులు బంక్‌ కొడుతుందని టీచర్స్‌ కంప్లయింట్‌ చేసేవాళ్లు. నేను అందర్నీ ఆటపట్టించేదాన్ని. అన్నీ సరదావే. టెన్షన్‌ పడేంత సీరియస్‌ విషయాలేం లేవు. చిన్నప్పుడు అందరు పిల్లలు ఎలా అల్లరి చేస్తారో అలానే.

మీ అమ్మానాన్న, అక్క (సారిక, కమల్‌హాసన్, శ్రుతీహాసన్‌) అందరూ యాక్టర్సే. వాళ్ల నుంచి ఏమైనా టిప్స్‌ తీసుకుంటారా?
తీసుకుంటాను. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, కాన్ఫిడెంట్‌గా లేకపోయినా అడుగుతాను. స్క్రిప్ట్‌ చదివినప్పుడు యూనిట్‌తో క్రియేటవ్‌ డిస్కషన్‌ ఉంటుంది. ఆ చర్చల్లో నాకేదైనా సరిగ్గా అనిపించకపోతే అడుగుతాను. అలాగే ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకడంలేదు  అనిపించినప్పుడు నాకు గుర్తొచ్చేది ఈ ముగ్గురే. 3 గంటలకు ఫోన్‌ చేసినా ‘ఏంటీ.. ఏమైంది’ అని నా క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంటారు. మేం ఒకరినొకరు సపోర్ట్‌ చేసుకుంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా.. మనవాళ్లు ఉన్నారు కదా అనే ధైర్యం. ఆ ధైర్యం అనేది చాలా బెస్ట్‌ ఫీలింగ్‌.

మీ చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ బాధపెట్టే విషయాల్లో ఇదొకటి అయ్యుంటుందేమో? ఈ ఇద్దరిలో మీకు ఎవరెక్కువ అంటే?
బాధ డెఫినెట్‌గా ఉంటుంది. ఏ పిల్లలనైనా బాధపెట్టే విషయమే ఇది. ఇంతకుముందు కూడా ఓ సందర్భంలో చెప్పాను. అమ్మానాన్న విడిపోయినప్పుడు నాకు ప్రపంచం ముగిసిపోయినట్లుగా అనిపించింది. అయితే ఆ చేదు అనుభవమే నన్ను చాలా స్ట్రాంగ్‌ గాళ్‌ని చేసింది. ఇక ఇద్దరిలో ఎవరు ఎక్కువ అంటే.. ఒక్కరి పేరు చెప్పలేను. నాకు ఇద్దరూ ముఖ్యమే.

అమ్మానాన్న దగ్గర్నుంచి నేర్చుకున్న విషయాలు?
ఇద్దరికి ఇద్దరూ విలక్షణమైన వ్యక్తులు. ఎదుటివాళ్లు వాళ్ల దగ్గర్నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఇద్దరి ప్రతిభ వేరు. అయితే ఏ పని చేసినా ఇద్దరూ మనసు పెడతారు. ఆ విషయం నేర్చుకున్నాను.  

– డి.జి. భవాని

మరిన్ని వార్తలు