అలెగ్జాండర్ ది గ్రేట్!

7 Feb, 2016 22:25 IST|Sakshi
అలెగ్జాండర్ ది గ్రేట్!

మాధవ్ శింగరాజు

 అలెగ్జాండర్ ది గ్రేట్! ‘ది గ్రేట్’ ఎందుకు? గ్రీకు వీరుడనా? గ్రీకు రాజ్యాలన్నిటినీ ఏకం చేశాడనా? పర్షియాను ఆక్రమించుకున్నాడనా? ఇండియా వరకు.. దండయాత్రలతో తనకు తెలిసిన భూభాగాలన్నిటినీ హస్తగతం చేసుకున్నాడనా? అవును. కచ్చితంగా అందుకే.
 గ్రేట్! కానీ ఇదంతా ఎవరికి గొప్ప?! అలె క్స్ మాతృమూర్తికి గొప్ప. అలెక్స్ తండ్రికి గొప్ప. అలెక్స్‌కి పిల్లనిచ్చిన మామగారికి గొప్ప. అలెక్స్ ఫ్రెండ్స్‌కి గొప్ప. అలెక్స్ గురువు అరిస్టాటిల్‌కి గొప్ప. మరి అలెక్స్ భార్య రొక్సానాకి? గొప్పే. అయితే.. వీళ్లందరికీ అలెగ్జాండర్ ఎందుకు గొప్ప అయ్యాడో అందుకు మాత్రం కాదు! ఆమెపై ప్రేమను రుద్దే ప్రయత్నం ఏరోజూ చెయ్యలేదట అలెగ్జాండర్.. వాళ్ల పెళ్లికి ముందు గానీ, పెళ్లి తర్వాత గానీ! అది గ్రేట్‌గా అనిపించింది రొక్సానాకు. మగాడంటే అలా ఉండాలి అంటుందట ఆవిడ. అలా అని ప్లూటార్క్ రాశాడు. క్రీ.శ. రెండో శతాబ్దపు గ్రీకు చరిత్రకారుడు ఆయన.

శత్రురాజులను పాదాక్రాంతం చేసుకోవడం, స్త్రీ ముందు మోకరిల్లడం రెండూ ఒకటే అలెగ్జాండర్‌కు. శత్రువును గెలవడం అతడికి గౌరవం. స్త్రీ ఎదుట కిరీటం తీసి నిలబడడం కూడా అతడికి గౌరవమే! (ఓయ్ అలెక్స్.. ఇది కూడా ఒక యుద్ధవ్యూహం కాదు కదా.. స్త్రీ హృదయాన్ని దోచుకోడానికి?!) అంత గొప్ప చక్రవర్తి అలెక్స్ నిజంగానే ఏ స్త్రీ ముందైనా మోకరిల్లి ఉంటాడా? ఉండొచ్చు. లేదా స్త్రీ మనసు తెలుసుకుని మసులుకొని ఉండొచ్చు. స్త్రీ మనసు తెలుసుకుని మసులుకోవడం మాత్రం.. ఆమెకు మోకరిల్లడం కన్నా ఏం తక్కువని?! క్రీ.పూ. 328లో అలెక్స్ ఆస్థానంలో కూడా మోకరిల్లడం అనే సంప్రదాయం ఉండేది. మరీ పైనున్నవాళ్లకు కిందివాళ్లు నీల్ డౌన్ అయ్యేవాళ్లు. పర్షియాను ఓడించి వస్తూ వస్తూ ఆ ఆచారాన్ని తెచ్చుకున్నాడు అలెగ్జాండర్. మోకరిల్లడంలో అభ్యర్థన ఉంటుంది. అర్పణ ఉంటుంది. అఫెక్షన్ ఉంటుంది. భయము, భక్తి, గౌరవం ఉంటాయి. ఇవన్నీ కలిసిందే ‘ప్రపోజల్’!

‘ప్రపోజల్’ అంటే.. ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవా?’ అని అర్థించడం. ప్రియుడు మోకరిల్లి ప్రియురాలిని కనికరించమని (పెళ్లి చేసుకొమ్మని) అడిగే ఈ సంప్రదాయం ప్రతి దేశంలోనూ ఉంది. పువ్విస్తూ ప్రపోజ్ చెయ్యడం, నవ్విస్తూ ప్రపోజ్ చెయ్యడం, పగడం తొడుగుతూ ప్రపోజ్ చెయ్యడం, ముత్యమంత ముద్దిచ్చి ప్రపోజ్ చెయ్యడం.. ఇక ఇవన్నీ మగాళ్ల తిప్పలు, తలనొప్పులు. ఎలా ప్రపోజ్ చేసినా, ఎక్కడ ప్రపోజ్ చేసినా, ఎప్పుడు ప్రపోజ్ చేసినా.. అసలంటూ ప్రపోజ్ చెయ్యడం గ్రేట్.
 రిప్లయ్ నెగిటివ్‌గా ఉన్నా హర్ట్ అవకుండా ఉండగలిగితే.. అలెగ్జాండర్ ది గ్రేట్.    
 
హ్యాపీ ప్రపోజ్ డే
ఇవాళ ‘ప్రపోజ్ డే’. వాలెంటైన్ వీక్ మొదలైన (7-14) రెండో రోజు.. అంటే ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే వస్తుంది.
 
 

మరిన్ని వార్తలు