శని ఉపగ్రహంలో  గ్రహాంతర జీవులు?

2 Mar, 2018 06:02 IST|Sakshi

గ్రహాంతర జీవుల కోసం బోలెడన్నిచోట్ల వెతికే పని లేదని.. మన సౌర కుటుంబంలోని శనిగ్రహపు ఉపగ్రహమైన ఎన్‌సెలడూస్‌లోనే ఇవి ఉండే అవకాశముందని అంటున్నారు వియన్నా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. భూమ్మీద అతిక్లిష్టమైన పరిస్థితుల్లో నివసించే మీథెనోథెర్మో కాకస్‌ అనే బ్యాక్టీరియాతో పరిశోధనలు చేయడం ద్వారా తామీ అంచనాకు వచ్చామని సైమన్‌ రిట్‌మాన్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. సముద్రపు అడుగున ఉండే అగ్నిపర్వత బిలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే చోట్ల ఈ బ్యాక్టీరియా కార్బన్‌ డైయాక్సైడ్‌ ను మీథేన్‌ వాయువుగా మారుస్తూంటుంది. శాస్త్రవేత్తలు ఎన్‌సెలడూస్‌పై ఉండే పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి ఈ బ్యాక్టీరియాను వదిలినప్పుడు అవి బాగా ఎదిగాయి.

ఆ గ్రహపు ఉపరితలంపై కూడా మీథేన్‌ పొగలు వెదజల్లే బిలాలు కొన్ని ఉన్నాయని ఇప్పటికే వెల్లడైన నేపథ్యంలో ఈ బ్యాక్టీరియా అక్కడ కూడా ఉండే అవకాశమున్నట్లు తాము భావిస్తున్నామని సైమన్‌ తెలిపారు. తమ పరిశోధన కేవలం బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ఉనికికి సంబంధించింది మాత్రమేనని.. మనలాంటి బుద్ధిజీవులపై ఏమాత్రం కాదన్నది గుర్తుంచుకోవాలని సైమన్‌ వివరించారు. ఎన్‌సెలడూస్‌పై సముద్రాలు ఉన్నాయని గత పరిశోధనలు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజా పరిశోధన అక్కడ ఏదో ఒకరకమైన జీవం ఉండేందుకూ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి.  

మరిన్ని వార్తలు