అయ్యంగార్‌ బేకరీ

22 Dec, 2018 00:09 IST|Sakshi

ఫుడ్‌  ప్రింట్స్‌

పొట్ట చేత పట్టుకుని హసన్‌ నుంచి బెంగళూరు చేరుకున్నారు... కోట్లకు అధిపతి అయినా, వినయమే ఆభరణంగా ఎదిగారు... సంప్రదాయాన్ని పాటిస్తూ, శుచిశుభ్రతలతో రంగరించిన రుచులను అందిస్తున్నారు... బేకరీ వస్తువులకు భారతదేశంలోనే ఐకాన్‌గా నిలిచారు... ఆయనే హెచ్‌ఆర్‌ తిరుమలాచార్‌...

మొట్టమొదటి అయ్యంగార్‌ బేకరీ బిబి (బెంగళూరు బ్రదర్స్‌) బేకరీ పేరున 1898లో సోదరుడితో కలిపి స్థాపించారు తిరుమలాచార్‌. చిక్‌పేట్‌ ప్రాంతంలో ప్రారంభించిన కొత్తల్లో్ల స్వీట్స్‌ మాత్రమే అమ్మేవారు. ఆ స్వీట్ల రుచులను ఆస్వాదించడానికి అక్కడకు ప్రతిరోజూ ఒక ఇంగ్లిష్‌ వ్యక్తి వచ్చేవారు. ఆయన స్వీట్లు తింటూ, తిరుమలాచార్‌తో పిచ్చాపాటీ మాట్లాడుతూ, మాటల మధ్యలో బేకింగ్‌ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. తిరుమలాచార్‌ మనసులో బేకింగ్‌ ఉత్పత్తులను ప్రారంభించాలనే ఆలోచన కలిగింది. అంతే, ఏవిధంగా బేక్‌ చేయాలి అనే విషయాన్ని ఆ ఇంగ్లిష్‌ వ్యక్తి దగ్గర నేర్చేసుకున్నారు తిరుమలాచార్‌. రుచికరమైన బ్రెడ్, బన్, బిస్కెట్ల అమ్మకంతో బేకరీకి లాభాలు రావడం ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా బేకరీ పేరుప్రఖ్యాతులు నగరమంతా వ్యాపించాయి. 1970లో ఈ బేకరీని ‘బెంగళూరు బ్రాహ్మణ బేకరీ’ గా పేరు మార్చారు. బేకరీ లాభాల బాటలో నడుస్తుండటంతో, చాలామంది అయ్యంగార్లు హసన్‌ నుంచి బెంగళూరు వలస వచ్చి, బేకరీ వస్తువుల తయారీ నేర్చుకోవడం ప్రారంభించారు. చిన్న వీధి చివరన ప్రారంభమైన అయ్యంగార్‌ బేకరీ కొన్ని దశాబ్దాలుగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడే స్థాయికి చేరుకుంది. ఒక తీపి జ్ఞాపకాన్ని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది. 

సువాసనల కూడలి...
బెంగళూరులోని జయానగర్‌ నాలుగో బ్లాక్‌ గుండా నడుస్తుంటే, అప్పుడే తాజాగా తయారవుతున్న బ్రెడ్‌ ఘుమఘుమలు ఆ వీధి చివరి దాకా వ్యాపించేస్తాయి. బటర్‌ కుకీస్‌ నుంచి వస్తున్న సువాసనలు మనలను ఒక్కసారిగా అక్కడ నిలబెట్టేస్తాయి. అక్కడ దొరికే వెజిటబుల్‌ పఫ్‌ కోసం లోపలకు అడుగులు వేస్తారు ఆహార ప్రియులు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బేకరీని పరిశీలిస్తే, గంటన్నర రెండు గంటల లోగా ఆహారపదార్థాలన్నీ కస్టమర్ల కడుపులు నింపేసి కనిపిస్తాయి. బెంగళూరులో ఉన్న అయ్యంగార్‌ బేకరీలలో నిత్యం కనిపించే సన్నివేశం ఇది. అయ్యంగార్‌ బేకరీలు నగరానికి కలికితురాయిగా నిలుస్తాయి. సుమారు వంద సంవత్సరాలుగా ఈ బేకరీలు కస్టమర్లను ఎంతో మర్యాదగా చూసుకుంటున్నాయి. ఎన్ని కొత్త రుచులు పుట్టుకొస్తున్నా, అయ్యంగార్‌ బేకరీ రుచులకు దీటుగా నిలబడవంటారు కస్టమర్లు. పెద్దలు ఏర్పరచిన సంప్రదాయాన్ని అనుసరిస్తూనే, అవసరాలకు అనుగుణంగా కొత్తదనాన్ని కూడా అందిపుచ్చుకుంటున్నాయి ఈ బేకరీలు. అయ్యంగార్‌ బేకరీలు బెంగళూరులో అంతర్భాగంగా మారిపోయాయి. 

తాజాగా... రుచిగా...
బేకరీ ఐటతమ్స్‌ని సాయంత్రం తయారుచేసి, మరుసటి రోజు సాయంత్రంలోగా అమ్మేస్తుంటారు. బటర్, ఖారా, కొబ్బరి బిస్కెట్లు, రకరకాల పఫ్‌లు, బన్స్, బ్రెడ్స్, కేక్స్‌ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వెజిటబుల్‌ పఫ్, పొటాటో బన్స్, సుగరీ స్వీట్‌ హనీ కేక్స్‌ వంటి డెజర్ట్స్, దిల్‌పసంద్‌... వంటివి ఇక్కడ మాత్రమే తినాలి అనేంత రుచిగా ఉంటాయి. ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఆ రుచిని కాపాడుకుంటూ వస్తున్నారు. నాణ్యత కలిగిన వస్తువులను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పేరుతో ఉన్నవన్నీ వీరివే అని చెప్పడానికి వీలు లేదు అంటారు  బెంగళూరులోని గాంధీ బజార్‌లో 62 సంవత్సరాలుగా శ్రీనివాస బ్రాహ్మణ బేకరీని నడుపుతున్న రామ్‌ప్రసాద్‌.. ఈ బేకరీలలో పనిచేస్తూ, వీటిని తయారుచేయడంలో నైపుణ్యం సాధించిన కొంతమంది, అక్కడ నుంచి విడిగా వెళ్లి, సొంతంగా ప్రారంభించుకున్నారు. అయ్యంగార్ల నుదుటన ఉండే నామమే వారికి గుర్తింపు. 

మేం ‘అష్టగ్రామ’ ప్రాంతం నుంచి వలస వచ్చాం. 1950–1960 ప్రాంతంలో అక్కడ కరువుకాటకాలు రావడంతో, మా తండ్రిగారు వ్యవసాయం చేయలేకపోయారు. చాలామంది అక్కడ నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉండేవి. అందువల్ల చాలామంది బేకరీ ఉత్పత్తుల తయారీని వృత్తిగా ఎంచుకున్నారు. సుమారు 120 సంవత్సరాలుగా ఈ వ్యాపారం నడుస్తోంది. తాజాగా, నాణ్యతతో ఉండే ఉత్పత్తులను మాత్రమే తయారుచేయడం అయ్యంగార్‌ బేకరీ విజయ రహస్యం.
– హెచ్‌ఆర్‌ రామ్‌ప్రసాద్, శ్రీనివాస బ్రాహ్మణ బేకరీ, బెంగళూరు 

మరిన్ని వార్తలు