స్నానం.. దానం.. దీపం.. ఉపవాసం...

30 Oct, 2016 02:31 IST|Sakshi
స్నానం.. దానం.. దీపం.. ఉపవాసం...

నెలంతా.. పండగే


తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.

 

ఆధ్యాత్మిక ఆరోగ్యవాసం: పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసి - శిఖరం లేక గోపుర ద్వారం వద్ద నేతితో గానీ, మంచి నూనెతోగానీ - ఇప్ప - నారింజ నూనెతో గానీ దీపారాధన చేయాలి. శివారాధన ముఖ్యమైనది. ఈ మాసంలో పగటి పూట వేడి - రాత్రి చల్లదనం ఉంటాయి. వాత-పైత్య-శ్లేష్మాలు వస్తాయి. అందువలన ఒక్క పొద్దు భోజనం శ్రేష్ఠం. వీటిని చాదస్తంగా భావించక ఆరోగ్యపరంగా ఆలోచించాలి. దీర్ఘవ్యాధుల నివారణలో ఉపవాసం తిరుగులేని మందు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికరంగా ఆలోచనలో, ఆవేశాలపరంగా సమతౌల్యం సాధించడానికి ఉపవాస నిర్ణయం ఎంతో గొప్పది. ఉపవాసంలో స్వల్పంగా ఆహారం-నీరు-తీసుకుంటే మనస్సు స్థిరంగా ఉంటుంది. దైవం పట్ల స్థిరచిత్తం ఏర్పడుతుంది. ‘ఉప’ అంటే దగ్గరలో, వాసం అంటే ఉండడం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, సాత్త్వికాహారం, మితాహారం-దైవార్పితం చేసి తీసుకోవాలి. న్యాయార్జితాహారం పొందాలని శాస్త్రం.

 

వృద్ధులకు, రోగులకు మినహాయింపు: వృద్ధులు - మానసిక - మెదడు వ్యాధిగ్రస్థులు - గర్భిణులు- క్షయరోగులు - మధుమేహగ్రస్థులు - క్రీడాకారులు ఉపవాసం చేయరాదు. శాస్త్రప్రకారం వారికి మినహాయింపు ఉంది. శరదృతువు ఇది. బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చేస్తే మంచిది. ప్రవాహస్నానం పవిత్రం. దైవధ్యానం జపం - గ్రంథపఠనం - పురాణాలు చదవడం - వినడం చేయాలి.

 
వృక్షారాధనం విశేషం: అశ్వత్థం విష్ణురూపం - వటవృక్షం రుద్రరూపం. పలాశ వృక్షం బ్రహ్మరూపం. అశ్వత్థ వృక్షాన్ని (రావి చెట్టును) ఆశ్రయించి ఉండమని విష్ణువు లక్ష్మీదేవిని ఆదేశించాడు.

 
రావి చెట్టు శీతల గుణం కలిగి ఉంటుంది. పైత్య దోషాన్ని నివారిస్తుంది. స్త్రీలు ఈ మాసంలో తులసిని పూజించి దీపాలు వెలిగించాలి. తులసిమూలంలో సర్వతీర్థాలు - మధ్యకాండంలో దేవతలు - చివుళ్ళలో సర్వవేదాలూ ఉన్నాయని శాస్త్రవచనం. విష్ణు పత్ని తులసి మాత పూజ పాపాలను హరించి, ధర్మార్థ, కామమోక్షాలు కలిగిస్తుంది.

 
దీపారాధనం.. మోక్షకరం: ఈ మాసం అంతా శివాలయాలలో ఆకాశ దీపాలు వెలిగించాలి. దీపదానం చేయాలి. నదీ ప్రవాహాలలో దీపాలు వెలిగించి వదలాలి. శివ కేశవుల ప్రీతి కోసం దీపదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.


దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం  దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ॥ దీపారాధన చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. జ్ఞానవ్యాప్తికి - వితరణకు సంకేతం. వాతావరణం తేమగా ఉండి క్రిమికీటకాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి,  దీపం వెలిగించడం వల్ల అవి నశిస్తాయి. వాతావరణం శుభ్రం అవుతుంది. జ్ఞానాన్ని వితరణ చేయడం దీపదానంలోని విశిష్టత. ప్రమిదలో వత్తులు వేసి - నువ్వుల నూనె వేసి తాళ్ల సాయంతో దీపాలు వెలిగించమే ఆకాశదీపం. విశిష్టమైన వనభోజనాలు: కార్తీకమాసంలో వన భోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. వన భోజనాలు శాస్త్రీయమైనవి. ఉసిరిచెట్టు నీడన, పనస ఆకులో భోజనం చేయాలి. ఉసిరిని ఔషధీ భాషలో ‘ధాత్రి’ అంటారు.      

      

ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రక దేహి మహాప్రాజ్ఞే యవోదేహి బలం చ మే ॥ ఉసిరి చెట్టు క్రింద చిత్రాన్నాలు చేసుకొని హరికి నివేదించి, పండిత భోజనం చేయించాలి. బంధువులతో కలిసి భుజించడం వల్ల మహాఫలం లభిస్తుంది. దేవతలు-ఋషులు-సర్వతీర్థాలు అచటనే ఉంటాయని, ఈ మాసంలోనే హరి జాగరణ చేయాలని శాస్త్రం. ఈ కార్తిక మాసంలో శివ - విష్ణ్వాలయదర్శనాలు చేయాలి. అవిలేని చోట ఇతర దేవాలయాల్లో రావి చెట్టు మొదట - తులసి వనంలో విష్ణుచరితలు పాడాలి. దేవపూజ ప్రశస్తం. దీప దానం చేయాలి. తులసి మంజరులచే హరిహరులను అర్చిస్తే ముక్తి లభిస్తుంది. తులసిచే అలంకృతమైన గృహానికి యమకింకరులు కూడా రాలేరనీ తులసీ మాహాత్మ్యం తెలుపుతుంది.

 
ఈ మాసంలో మంత్ర దీక్ష జన్మరాహిత్యం కలిగిస్తుంది. ఈ నెలలో విష్ణువు దామోదర నామంతో పూజింపబడతాడు గాన సంకల్పంలో ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం’ అని చెబుతారు. అన్ని దానాలు ఒక వైపు, దీపదానం ఒక వైపు అని శాస్త్రం.  ‘ఏకతస్సర్వదాని - దీపదానం తథైకతః’ అని శాస్త్రవచనం. ఉసిరికాయపై వత్తిని పెట్టి వెలిగించడం విష్ణువుకు ప్రీతికరం. వేకువనే విష్ణు-శివ-గంగ-సూర్యదేవతల ఉపాసన చేయాలి.

 
శివాయ విష్ణురూపాయ - శివరూపాయ విష్ణవే   నమో వైబ్రహ్మ నిధయే - వాసిష్ఠాయ నమోన్నమః ॥  క్షీరాబ్ధికన్నియకు...శ్రీ మహావిష్ణువుకు... ఈ మాసంలోనే క్షీరాబ్ధి ద్వాదశి. అదే కార్తిక శుద్ధ ద్వాదశి. ఆ రోజు క్షీరసాగరశయనుడైన విష్ణువు లక్ష్మీయుతుడై తులసి వనానికి వస్తాడని చెబుతాడు. బృందావనంలో సంచరించే విష్ణువు భోగభోగ్యాలనందిస్తాడు. ఈ మాసంలో శివార్చన - అభిషేకం - ఉపవాసం - సాయంపూజ అన్నాదుల నివేదన నక్షత్ర దర్శనం ఎంతో పుణ్యప్రదం.

 
భగినీ హస్తభోజనం... ఈ నెలలోనే యమ విదియ. ఆ రోజున సోదరి చేతివంట తినడమే భగినీ హస్తభోజనం. గోష్టాష్టమి రోజున గోవులను పూజించి ప్రదక్షిణం చేయాలి. శివదీక్షలు - విష్ణు ఆరాధనలకు కార్తిక మాసం పుణ్యఫల మాసంగా చరిత్రలో ప్రసిద్ధమైన కలిజనులకు భక్తినీ ముక్తినీ ప్రాప్తింపజేస్తుంది. కార్తిక పురాణం పఠనం చేయాలి.

 - పి.వి.బి. సీతారామమూర్తి

 

మరిన్ని వార్తలు