ఆలివ్ నూనెలు... అన్నీ ఒకటి కాదు!

31 Mar, 2015 23:53 IST|Sakshi
ఆలివ్ నూనెలు... అన్నీ ఒకటి కాదు!

కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే సమస్యలు అధికమవుతూ ఉండటంతో... ఆలివ్ నూనెను వాడమని వైద్యులు సలహా ఇస్తున్నారు. అందుకే ఇటీవల ఆలివ్ నూనె వినియోగం పెరుగుతోంది. అయితే షాపులో కనిపించిన ఆలివ్ నూనెను కొనుక్కొచ్చేయ కండి. ఆలివ్ నూనెలోనూ రకాలున్నాయి. ఒక్కో రకం వల్ల ఒక్కో ఉపయోగం ఉంటుంది. కాబట్టి ముందు ఆలివ్ నూనెలో రకాల గురించి తెలుసుకోండి.
 ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్: ఇది అత్యుత్తమ క్వాలిటీ. కెమికల్స్ వాడకుండా తయారు చేస్తారు దీన్ని.

ఇందులో ఫ్యాటీ యాసిడ్ శాతం 0.8 శాతానికి మించదు. మరిగిస్తే చాలా నూనెలు వాసనను, రుచిని కోల్పోతాయి. దీనితో ఆ సమస్య రాదు. స్మోకింగ్ పాయింట్ తక్కువ ఉండటం వల్ల ఈ నూనెను మళ్లీ మళ్లీ వాడినా ప్రమాదం ఉండదు. ఇది అంత త్వరగా పాడవదు కూడా. అయితే ఆలివ్ జ్యూస్ నుంచి చేయడం వల్ల దీనికి ఘాటైన వాసన ఉంటుంది. రుచి కూడా కొంచెం వగరుగా అనిపిస్తుంది. దాంతో ఈ నూనెతో చేసిన వంటల్ని తినడం మనకు కాస్త కష్టమే. సలాడ్లపై చల్లుకోడానికి, ఒంటికి రాసుకోవడానికైతే ఓకే.

 వర్జిన్ ఆలివ్ ఆయిల్: ఎక్స్‌ట్రా వర్జిన్ తర్వాతి స్థానం దీనిదే. దీనిలో యాసిడ్ లెవెల్స్ రెండు శాతానికి మించవు. ఇది కూడా డీప్ ఫ్రయింగ్‌కి పనికి రాదు. సలాడ్‌‌స వంటి వాటికే బాగుంటుంది. రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్: వర్జిన్ ఆయిల్‌ని రిఫైన్ చేయగా ఏర్పడిన నూనె. మన రిఫైన్‌‌డ ఆయిల్స్‌లానే ఉంటుంది. కాబట్టి  భారతీయ వంటలకి ఇదే తగిన నూనె. అయితే యాసిడ్ స్థాయి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని సలాడ్ల ద్వారా నేరుగా తీసుకోకపోవడమే మంచిదంటారు వైద్యులు.

ప్యూర్ ఆలివ్ ఆయిల్: దీన్ని ప్రాసెసింగ్ చేయరు. కెమికల్స్ వాడరు. కాబట్టి ఈ నూనె కూడా మంచిదే. ఇది మన భారతీయ వంటలకు బాగా సూటవుతుంది. ఆలివ్ పొమేస్ ఆయిల్: ఆలివ్స్ నుంచి స్వచ్ఛమైన నూనెను తీసేసిన తర్వాత... మిగిలిన పిప్పిలోంచి తీస్తారు దీన్ని. అందువల్ల ఇందులో పెద్దగా పోషకాలు ఉండవు. రుచి, వాసన అంతగా ఉండవు. అందుకే దీనిలో కొద్దిగా వర్జిన్ ఆయిల్‌ని కలిపి వంటనూనెగా అమ్ముతుంటారు. వడియాల్లాంటివి వేయించుకోవడానికి, ఆమ్లెట్/దోసెలు కాల్చుకున్నప్పుడు వేసుకోవ డానికి తప్ప మామూలు వంటకి అంత బాగోదు.

లైట్ ఆలివ్ ఆయిల్: ఇది చాలా తక్కువ గ్రేడ్ నూనె. సాధారణ ఆలివ్ నూనెగా మాత్రమే దీన్ని పరిగణించగలం తప్ప పెద్ద ప్రత్యేకతలేమీ లేవు దీనికి. స్నాక్స్ వేయించుకోవడానికి, బేకింగ్‌కి, గ్రిల్లింగ్‌కి ఉపయోగిస్తారు దీన్ని.
 
 

మరిన్ని వార్తలు