ఆల్‌రౌండర్

8 Mar, 2014 00:42 IST|Sakshi
ఆల్‌రౌండర్

 టీటీలో సబ్ జూనియర్ నంబర్‌వన్ బుల్లెట్ నడుపుతుంది... రెండు చేతుల్తో ఒకేలా రాస్తుంది... సరిగమలు పలికిస్తుంది మహాభారతం కంఠతా చెబుతుంది 14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసుకుంటోందిఅసలు సిసలు ఆల్‌రౌండర్ నైనాజైస్వాల్
 

నైనాకు మూడేళ్ల వయసులో తల్లిదండ్రులు అశ్విన్‌కుమార్, భాగ్యలక్ష్మి ఇంట్లోనే చదువు చెప్పడం ప్రారంభించారు. రెండే సంవత్సరాల్లో ఇంగ్లిష్, హిందీ, తెలుగు నేర్చేసుకుంది. మరో మూడేళ్లలోనే గణితం, సైన్స్, సోషల్ పాఠాలను అలవోకగా నేర్చేసుకుంది. 8 ఏళ్ల వయసులో 2008లో నైనాను టెన్త్ క్లాస్ పరీక్షలు రాయించాలని భావించారు. కానీ రాష్ట్ర విద్యాశాఖ నిబంధనలు దీనికి అనుమతించలేదు. దాంతో  ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజీసీఎస్‌సీ) పరీక్షకు హాజరయ్యేందుకు నైనాను సిద్ధం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఈ పరీక్షకు (ఎస్‌ఎస్‌సీతో సమానం) హైదరాబాద్‌లోని రెండు పాఠశాలల్లో మాత్రమే అవకాశముంది.

ఐజీసీఎస్‌సీ సీఈఓ ప్రత్యేక అనుమతితో ఈ పరీక్షకు హాజరైన నైనా ‘ఎ’ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత ఇంటర్మీడియెట్... ఇప్పుడు డిగ్రీ పూర్తి కావచ్చిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. నైనా 14 ఏళ్ల వయసులో ఈ నెలల్లోనే బీఏ (మాస్ కమ్యూనికేషన్) చివరి సంవత్సరం పరీక్షలకు హాజరు కానుంది.
 
 ్యసాచి...
 చదువులో మేటిగా మారిన నైనా... విభిన్న అంశాలలో వయసుకు మించిన ప్రజ్ఞతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే సారి రెండు చేతులతో ఒకే రకంగా రాయగలగడం ఆమె ప్రత్యేకత. కీబోర్డుపై సరిగమలు పలికించడంతో పాటు చక్కగా పాడటంలో కూడా ఆమె దిట్ట. 2.7 సెకన్లలో కంప్యూటర్ కీబోర్డుపై ఎ టు జెడ్ అక్షరాలను టైప్ చేస్తుంది. రామాయణ, మహాభారతాల్లోని అన్ని శ్లోకాలు (హిందీ) ఈ చిన్నారికి కంఠతా వచ్చు. పెద్దలకే సాధ్యమయ్యే భారీ సైజు బుల్లెట్‌ను ఆమె అలవోకగా నడిపించగలదు.  ఇంట్లో అందరికీ ప్రీతిపాత్రమైన హైదరాబాద్ బిర్యానీని 25 నిమిషాల్లో తయారు చేస్తుంది.
 
 నైనా జైస్వాల్ భిన్నమైన అంశాల్లో తన ప్రతిభను ప్రదర్శిస్తున్నా...ప్రొఫెషనల్ క్రీడాకారిణిగానే ఆమెకు అసలు గుర్తింపు.  ఎనిమిదేళ్ల వయసులో టేబుల్ టెన్నిస్‌లో అడుగు పెట్టిన ఆమె అంతే వేగంగా దూసుకుపోయింది. రాష్ట్ర స్థాయిలో అనేక విజయాలు అందుకున్న నైనా... జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో ఇప్పటికే 15 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్యాలు నెగ్గింది. అండర్-15లో ఆమె ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో ఉంది. అండర్-18లో 7, అండర్-21లో 10వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.  నైనా కెరీర్‌లో దూసుకుపోయే మరో గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య 2020 ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో నైనా జైస్వాల్‌కు అవకాశం దక్కింది. రాష్ట్రంనుంచి దీనికి ఎంపికైన ఒకే అమ్మాయి నైనా కావడం విశేషం.

మరిన్ని వార్తలు