హిట్‌ మూడు

30 Apr, 2019 02:14 IST|Sakshi

ముచ్చటగా మూడు... ఇచ్చటనే ఉండు... వేరెచ్చటనో దొరకపోదు. ఇది ట్రిపుల్‌ ధమాకా జోరు. అందరితో కలిసినా ఈ కాంబినేషనే స్పెషల్‌ అన్నప్పుడు చూసేవాళ్లకి ఆ ‘హిట్‌ మూడు’ వేరు.

ఇప్పుడు కాంబినేషన్స్‌ రిపీట్‌ కావాలంటే చాలా కలిసి రావాల్సి ఉంటుంది కానీ గతంలో కాంబినేషన్స్‌ చాలా ఈజీగా కొనసాగేవి. ఎన్‌.టి.ఆర్‌–రాఘవేంద్రరావు, అక్కినేని–దాసరి నారాయణరావు, చిరంజీవి–కోదండరామిరెడ్డి, బాలకృష్ణ–కోడి రామకృష్ణ, రాజేంద్రప్రసాద్‌–రేలంగి నరసింహారావు, నరేష్‌–జంధ్యాల... ఇవన్నీ చాలా సులువుగా కొనసాగిన కాంబినేషన్‌లు. నిన్న మొన్న కూడా మహేష్‌బాబు– గుణశేఖర్, రవితేజ– పూరి జగన్నాథ్, త్రివిక్రమ్‌–పవన్‌ కల్యాణ్‌ తదితర కాంబినేషన్‌లు వెంటవెంటనే రిపీట్‌ అయ్యాయి. కాని ఇప్పుడు సేమ్‌ కాంబినేషన్‌ కోసం చాలా రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. 

‘జయం’, ‘ధైర్యం’ సినిమాలు చేసిన తేజ–నితిన్‌ మళ్లీ ఇప్పటి వరకూ కలిసి పని చేసే వీలు రాలేదు. సిద్దార్థకు ‘బొమ్మరిల్లు’ వంటి పెద్ద హిట్‌ ఇచ్చిన భాస్కర్‌ తిరిగి ఆ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాలేదు. అల్లు అర్జున్‌తో ‘బన్ని’, ‘బద్రినాథ్‌’ చేసిన వి.వి.వినాయక్‌ మళ్లీ అల్లు అర్జున్‌తో కలిసి పని చేయాలంటే ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. విజయ్‌ దేవరకొండ–సందీప్‌ రెడ్డిల ‘అర్జున్‌ రెడ్డి’ వచ్చి అప్పుడే రెండేళ్లు గడిచిపోతున్నా వీరిరువురి కాంబినేషన్‌లో మరో సినిమా ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని కాంబినేషన్‌లు మాత్రం మూడోసారి, నాలుగోసారి సెట్‌ కావడం ప్రేక్షకులకు ఆనందం కలిగించే అంశమే.

త్రి–అర్జున్‌
విశాఖ సముద్రంలో తుఫాను పుట్టించిన ‘జులాయి’ (2012) కలెక్షన్లు అల్లు అర్జున్‌– త్రివిక్రమ్‌లది మంచి కాంబినేషన్‌ అని తేల్చాయి. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2015లో చిత్తూరు బోర్డర్‌లో బాక్సాఫీసును చింతపండు పితికినట్టు పితికి ఇదే కాంబినేషన్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ (2015)తో కలెక్షన్లు రాబట్టాయి. వీరు మళ్లీ కలిసి పని చేయడానికి మూడేళ్లు పట్టింది. ఈ 2019లో త్రివిక్రమ్‌–అల్లు అర్జున్‌ కలిసి పని చేస్తున్నారు.  పూజా హెగ్డే కథానాయిక. ఈసారి కథ ఎలా ఉంటుందో ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారో అని ప్రేక్షకులకు కుతూహలంగా ఉంది. లెటజ్‌... వెయిట్‌ అండ్‌ సీ.

బి ఫర్‌ బాలయ్య అండ్‌ బోయపాటి
 2010లో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సింహా’ వచ్చినప్పుడు ఆ మాస్‌కు ప్రేక్షకులు విపరీతంగా క్లాప్స్‌ కొట్టారు. బాలకృష్ణను డాక్టర్‌గా, లెక్చరర్‌గా కొత్త పాత్రల్లో చూపి యాక్షన్‌ను మిళితం చేసి హిట్‌ కొట్టాడు డైరెక్టర్‌. మళ్లీ∙నాలుగేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్‌’(2014) మాస్‌ క్రేజ్‌ను డబుల్‌ చేసింది. జగపతిబాబుకు విలన్‌గా ఈ సినిమా కొత్త కెరీర్‌ను ప్రసాదించింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత అంటే 2019లో బాలయ్య– బోయపాటి కాంబినేషన్‌లో మూడో సినిమా సిద్ధమవుతూ ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానుంది. దాని కోసం ఎటువంటి కథను బోయపాటి సిద్ధం చేశారో.

హీరో విలనయ్యాడు
‘అష్టా చమ్మా’ (2008)తో నానీని హీరోగా మలిచారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇందులో అవసరాల శ్రీనివాస్‌ మరో హీరో. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కడానికి ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. 2016లో నాని హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో తయారైన ‘జెంటిల్‌మన్‌’ పెద్ద హిట్‌ అయ్యి ఈ జోడీకి ప్రేక్షకుల్లో వాడి ఉందని నిరూపించింది. మూడేళ్ల తర్వాత నాని–ఇంద్రగంటి కాంబినేషన్‌లో ‘వ్యూహం’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా తెరకెక్కుతోంది.

సుధీర్‌బాబు మరో హీరో. విశేషం ఏంటంటే.. ఇది నాని కెరీర్‌లో 25వ సినిమా. అంతకంటే స్పెషల్‌ ఏంటంటే.. ఈ సినిమాలో నాని విలన్‌గా నటించనున్నారు. అంటే ‘అష్టా చమ్మా’లో ఇద్దరు హీరోలు. ‘వ్యూహం’లో ఇద్దరు హీరోలు. సెంటిమెంట్‌గా కూడా కలిసి రావచ్చు. ప్రస్తుతం విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి
2014లో నాగశౌర్య హీరోగా శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’. యూత్‌ అండ్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రం తెగ నచ్చేసింది. రెండేళ్ల తర్వాత నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘జ్యో అచ్యుతానంద’ వస్తే దానిని ఆదరించారు ప్రేక్షకులు. ఈ చిత్రంలో నారా రోహిత్‌ మరో హీరో. తాజాగా మూడో చిత్రం కోసం చేతులు కలిపారు నాగశౌర్య, అవసరాల. ఇందులో మాళవికా నాయర్‌ కథానాయికగా నటించనున్నారు. గతంలో  ‘కల్యాణ వైభోగమే’ సినిమాలో నాగశౌర్య అండ్‌ మాళవిక జంటగా నటించారు.

ఇప్పుడు ఏ హీరో హీరోయిన్‌ ముచ్చటగా మూడోసారి జోడి కట్టబోతున్నారో తెలుసుకుందాం. మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా వస్తున్న ‘దర్బార్‌’లో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇంతకుముందు ‘చంద్రముఖి’ (2005)లో హీరోయిన్‌గా, ‘శివాజీ’, ‘కథానాయకుడు’ (2008) చిత్రాల్లో వీళ్లు స్పెషల్‌ సాంగ్‌లో కలిసి నటించారు. అలాగే తెలుగులో సమంత కూడా నాగార్జునతో మూడోసారి కనిపించనున్నారు. అయితే జంటగా కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014లో వచ్చిన ‘మనం’లో తొలిసారి వీరు కలిసి నటించారు. ‘రాజుగారి గది 2’ (2017) వీరి రెండవ చిత్రం. ఇప్పుడు ‘మన్మథుడు 2’ కోసం స్క్రీన్‌ను షేర్‌ చేసుకోబోతున్నారు.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత ఓ స్పెషల్‌ రోల్‌ చేయనున్నారు. ‘సారొచ్చారు’, ‘వీర’ చిత్రాల్లో రవితేజ– కాజల్‌ జంటగా నటించిన విషయం తెలిసిందే.‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న తాజా సినిమాలో ఆయన సరసన కాజల్‌ నటిస్తున్నారని సమాచారం. ‘కత్తి సండై’ (2016) సినిమాలో ఫస్ట్‌ టైమ్‌ జంటగా నటించారు తమన్నా, విశాల్‌. తాజాగా సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమా కోసం ఈ ఇద్దరూ జోడీ కట్టారు. అలాగే తమన్నా ప్రధాన పాత్రలో రూపొందనున్న ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో ఆమె సరసన కనిపించనున్నారట విశాల్‌. మరి.. వచ్చే ఏడాది ఎవరెవరు ముచ్చటగా మూడోసారి జంటగా కనిపిస్తారో చూడాలి.

‘తేరి’ (2016) కోసం హీరో విజయ్, దర్శకుడు అట్లీ మొదటిసారి పని చేస్తే ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది.  వెంటనే వీరిద్దరూ కలిసి ‘మెర్సెల్‌’ (2017) (తెలుగులో ‘అదిరింది’) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించింది. దాంతో ఆలస్యం చేయకుండా హ్యాట్రిక్‌ కోసం మూడో సినిమాను పట్టాలెక్కించారు విజయ్‌ అండ్‌ అట్లీ. చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఇందులో పదేళ్ల తర్వాత విజయ్‌కు జోడీగా నటిస్తున్నారు నయనతార. మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ ‘కత్తి’, ‘తుపాకీ’, ‘సర్కార్‌’ చిత్రాలు చేసి హ్యాట్రిక్‌ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇక బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ల కాంబినేషన్‌ కూడా ఇంతే. ‘టైగర్‌ జిందాహై’ చిత్రం వీరిద్దరి స్నేహం కుదిర్చింది. ఆ తర్వాత సల్మాన్‌–అలీ కలిసి 2016లో ‘సుల్తాన్‌’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ ఏడాది ఈ రంజాన్‌కు ‘భారత్‌’ చిత్రాన్ని రెడీ చేశారు. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. హీరో రణ్‌బీర్‌ కపూర్, దర్శకుడు అయాన్‌ ముఖర్జీల కాంబినేషన్‌లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న మూడో సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఇంతకుముందు రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో  ‘వేకప్‌ సిద్‌’, ‘ఏ జవానీ హై దివానీ’ సినిమాలు వచ్చాయి. వచ్చే ఏడాది ఏ కాంబినేషన్‌లో ‘హిట్‌ మూడు’ వస్తుందో చూడాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా