కొండంత విలువ

1 Aug, 2017 23:44 IST|Sakshi
కొండంత విలువ

కురులు

కొండకు వెంట్రుక వేశాను... వస్తే కొండ పోతే వెంట్రుక... అని సామెత. వెంట్రుక అంటే మనవాళ్లకు వెంట్రుకతో సమానం. అందుకే ‘నువ్వు నాకు వెంట్రుకతో సమానం’ అని తీసి పడేస్తుంటాం. తల నిండా నెల తిరిగే సరికి గుట్టలు గుట్టలుగా ఉత్తపుణ్యానికి వెంట్రుకలు పెరిగిపోతాయి కనుక మనకు వెంట్రుకలంటే లెక్కలేదు. కాని ప్రపంచంలో తల మీద వెంట్రుకలు లేని వాళ్లు, మొలవని వాళ్లు, మొలిచినా రాలిపోయిన వాళ్లు ఒక్కో వెంట్రుక కోసం అర్రులు చాస్తూ ఉంటారు. తల మీద వెంట్రుకలు అందానికే కాదు ఆత్మ విశ్వాసానికి కూడా చిహ్నం. ఈ ఒక్క పాయింట్‌ మీదే ప్రపంచంలో వేల కోట్ల రూపాయల వెంట్రుకల వ్యాపారం జరుగుతోంది. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే... అంతగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

ఇందులో మంచి వార్త ఏమిటంటే ప్రపంచానికి అవసరమైన వెంట్రుకల ఎగుమతిలో 80 శాతం వాటాతో భారతదేశం ముందు వరుసలో ఉంది. మరి ఈ వెంట్రుకలు ఎక్కడి నుంచి వస్తాయి? మన సంప్రదాయమే. హైందవ సాంప్రదాయంలో తల నీలాలు సమర్పించడం ఒక ముఖ్యమైన ఆనవాయితీ. తన అహాన్ని, భగవంతుని ముందు తల ఒంచి తల నీలాలు ఇవ్వడం ద్వారా ఆత్మని అర్పిస్తాడు భక్తుడు. ఇలా భారతదేశంలోని ఆలయాలకు చేరుతున్న టన్నుల కొద్ది వెంట్రుకలు భారతదేశానికి వేల కోట్ల రూపాయల రాబడిని సంపాదించి పెడుతున్నాయి.

ఏడాదికి 1300 టన్నులు
భారతదేశం నుంచి సంవత్సరానికి దాదాపు 1300 టన్నుల శిరోజాలు ప్రపంచానికి ఎగుమతి అవుతన్నాయని అంచనా. దేశంలో 200 సంస్థలు ఈ వ్యాపారంలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం చెన్నైలో ఉన్నాయి. విదేశీ ఎగుమతుల ద్వారా కాని దేశీయ మార్కెట్‌ వల్లగానీ మొత్తం మీద మన దేశంలో 2500 కోట్ల వ్యాపారం వెంట్రుకల మీద జరుగుతోంది. మళ్లీ ఇందులో సంవత్సరానికి 10 నుంచి  30 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఇంత వ్యాపారానికి అవసరమైన వెంట్రుకల సేకరణకు ప్రధాన కేంద్రం వేరే ఏదో కాదు... మన తిరుపతి కొండే. రోజుకు సగటున 25 వేల మంది అర్పిస్తున్న తల నీలాల ద్వారా  సంవత్సరానికి 700 నుంచి 1000 కోట్ల రాబడి సమకూరుతోంది.

చైనా పోటీ
చైనా వాళ్ల తల వెంట్రుకలు భారతీయుల వెంట్రుకలతో పోల్చితే రెట్టింపు మందంగా ఉంటాయి. ఇవి విగ్గుల తయారీలో బాగా ఉపయోగ పడతాయి. అయితే వీటిని మెత్తగా చూపించాలంటే మాత్రం భారతీయ శిరోజాలను కలపక తప్పదు. ఎగుమతుల్లో భారత్‌ ముందంజలో ఉన్నా వ్యాపారంలో మాత్రం చైనా భారీ లాభాల్లో ఉంది. దీనికి కారణం అక్కడ వెంట్రుకలతో తయారయ్యే ఉత్పత్తుల కర్మాగారాలు ఎక్కువగా ఉన్నాయి. మనం వెంట్రుకలను విక్రయిస్తుంటే అది వెంట్రుకలతో తయారయ్యే విగ్గులను, సవరాలను, వంకీల జుట్టు వరుసలను విక్రయిస్తోంది. కనుక ఇక మీద తల దువ్వుకున్నప్పుడు దువ్వెనలో వెంట్రుక కనిపిస్తే తీసి పడేయకండి. నాలుగు వెంట్రుకలు వెనకేసి సిరి మూటగట్టుకోవచ్చని గ్రహించండి.

రెండు రకాలు
వెంట్రుకలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి ఇళ్ల నుంచి సేకరించినవి. ఇవి పొట్టిగా చిక్కుతో ఉంటాయి. మరొకటి తల నీలాల ద్వారా సేకరించినవి. ఇవి పొడవుగా శుద్ధి చేయడానికి అనువుగా ఉంటాయి. శుద్ధి చేసిన వెంట్రుకలు 7 నుంచి 11 అంగుళాల పొడవు ఉన్నవి కిలో 7000 రూపాయలు పలుకుతున్నాయి. 30 అంగుళాల పొడువున్న వెంట్రుకలు కిలో 50 వేలు ధర చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు