హమార యాడ్‌గురు

18 Nov, 2018 00:35 IST|Sakshi

అలేక్‌ పదమ్‌సీ   1928–2018

1980ల టైమ్‌.. కొడైకెనాల్‌ ప్రాంతం.. చలికాలం.. నాలుగు డిగ్రీల టెంపరేచర్‌.. ఒక జలపాతం దగ్గర.. పదిహేడు, పద్దెనిమిదేళ్లున్న ఒక అమ్మాయిని పైనుంచి దూకుతున్న నీటి కింద మడుగులోకి తోస్తున్నారు.. గడ్డకట్టుకుపోతున్నట్టున్న ఆ నీటిలో ఊపిరి పీల్చుకుంటూ తల పైకి పెడుతోంది.. మళ్లీ ఆమెను బయటకు లాగుతున్నారు.. వెచ్చటి టవల్‌ కప్పి తుడుస్తున్నారు.. శరీరం వేడిగా ఉండటానికి రమ్‌ తాగిస్తున్నారు.. కాస్త వెచ్చబడ్డాక మళ్లీ తోస్తున్నారు.

ఫైనల్‌ అవుట్‌పుట్‌..
ఎనభైల యువతను ఉర్రూతలూపిన లిరిల్‌ గర్ల్‌ యాడ్‌ ప్లే అయింది. పదిహేడు, పద్దెనిమిదేళ్ల ఆ అమ్మాయి కారెన్‌ లూనెల్‌ చాలామందికి ఆరాధ్య దేవత అయింది. కొన్నేళ్లకు కనిపించకుండా పోయింది. చనిపోయిందనే పుకారూ లేచింది. కాని.. కారెన్‌ లూనెల్‌ బతికే ఉంది. పెళ్లి చేసుకుని, ఆస్ట్రేలియాలో పిల్లాపాపలతో సంతోషంగా ఉంది. వీలున్నప్పుడల్లా ఆ యాడ్‌ డైరెక్టర్‌కి ఉత్తరాలు రాసింది. తర్వాత మెయిల్స్‌ కూడా చేసింది. ఆ డైరెక్టర్‌ కూడా ప్రతి క్రిస్మస్‌కు ఆమెను గ్రీట్‌ చేస్తూ మెస్సేజ్‌  పంపుతాడు. ‘‘ఆ యాడ్‌ షూటింగ్‌లో కారెన్‌తో ప్రేమలో పడ్డా.. ఇప్పటికీ నా మనసులో ఉంది’’ అంటాడు ఆ యాడ్‌ డైరెక్టర్‌.

హిందుస్తాన్‌ లీవర్‌ మార్కెటింగ్‌ సెక్షన్‌తో లింటాస్‌ యాడ్‌ ఏజెన్సీ వాళ్ల మీటింగ్‌ జరుగుతోంది. సర్ఫ్‌ యాడ్‌ ఫిల్మ్‌ చూసి పెదవి విరిచాడు మార్కెటింగ్‌ హెడ్‌. ‘‘ఇలా జనాల్లోకి వెళితే సర్ఫ్‌ అమ్ముకున్నట్టే’’ వెటకారం అతని నోటి వెంట. అసహనం డైరెక్టర్‌లో. ఒకవేళ ఇది వర్కవుట్‌ కాకపోతే.. దీని మీద పెట్టిన ఖర్చు లింటాస్‌ భరిస్తుందా? ఆందోళన ఆయన మనసులో. ఇటూ అటూ వాదోపవాదాలు, తర్జనభర్జనల తర్వాత అతి కష్టమ్మీద ఒక షరతుతో అంగీకారానికి వచ్చింది. ముందు యాడ్‌ రిలీజ్‌ చేశాక రెస్పాన్స్‌ను బట్టి కంటిన్యూ కావాలా వద్దా అని. రిలీజ్‌ అయింది.

(‘గాంధీ’ చిత్రంలో మహమ్మద్‌ అలీ జిన్నా పాత్రలో అలేక్‌ పదమ్‌సీ (కుడి చివర))

‘‘దేఖో భాయీ సాబ్‌.. సస్తే చీజ్‌ ఖరీద్‌నేమే అచ్ఛే చీజ్‌ ఖరీద్‌నేమే ఫర్ఖ్‌ హోతా హై.. సర్ఫ్‌ కే ఖరీదారీ మే హీ సమర్‌nుదారీ హై’’ (‘తెలివైనవారు సర్ఫ్‌ కొంటారు’ అని సంక్షిప్తార్థం) అంటూ లలితాజీ.. చెప్పిన మాటలు సామాన్య గృహిణుల మెదడులో నాటుకుపోయాయి. ఏ యాడ్‌కూ రానంత రేటింగ్‌ వచ్చింది. లలితాజీ లాగా వాళ్లూ సమర్‌nుదారీ అని నిరూపించుకోవడానికి సర్ఫ్‌ను ఎంచుకున్నారు. ‘‘దేఖో భాయీ సాబ్‌’’ అని లలితాజీ పిలిచిన పిలుపు చాలా సినిమాల్లో ప్యారడీగా మారింది. ఇప్పటికీ ఎక్కడో అక్కడ స్పూఫ్‌లూ వినపడుతున్నాయ్‌.. కనపడుతున్నాయ్‌.   దీని సృష్టికర్తా లిరిల్‌ యాడ్‌ఫిల్మ్‌ మేకరే.

1980ల ప్రాంతమే. ఓ గవర్నమెంట్‌ గుమస్తా.. సైకిల్‌ నుంచి మోటార్‌ సైకిల్‌కు మారాలనుకుంటున్నాడు. ఇంట్లో పిల్లలంతా ‘బజాజ్‌ చేతక్‌’కే ఓటేశారు. ఇంకో ఇంట్లో.. బజాజ్‌ బండి కొనమని భర్తతో పోరుపెడుతోంది భార్య. మరో చోట.. ఓ ప్రేమికుడు ప్రియురాలికి ప్రామిస్‌చేస్తున్నాడు.. ‘‘రేపు మా నాన్న బజాజ్‌ చేతక్‌ తీసుకొని వస్తాను.. సినిమాకెళదాం’’ అంటూ! వీళ్లందరూ బజాజ్‌ను హమారా అనుకోవడానికి కారణం.. దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘‘యే.. జమీ...యే ఆస్మా..   హమారా కల్‌.. హమారా ఆజ్‌.. బులంద్‌ భారత్‌కి బులంద్‌ తస్వీర్‌.. హమారా బజాజ్‌..’’ యాడ్‌!  

కామన్‌ మ్యాన్‌ కారుగా.. కట్నం కింద వరుడి డిమాండ్‌గా స్కూటర్‌ మారింది ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌తోనే. దీన్ని మలిచిందీ లిరిల్‌యాడ్‌ డైరెక్టరే. అతని పేరు అలేక్‌ పదమ్‌సీ. ఫాదర్‌ ఆఫ్‌ మోడర్న్‌ ఇండియన్‌ అడ్వర్టయిజింగ్‌ అని పేరు. బాంబే అడ్వర్టయిజింగ్‌ క్లబ్‌ ‘అడ్వర్టయిజింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సెంచురీ’ అనే బిరుదు ఇచ్చింది. యాడ్‌ ఇండస్ట్రీలో వాళ్లు.. ఔత్సాహికులు ప్రేమగా ‘యాడ్‌ గురూ’అని పిలుచుకుంటారు. తొంభై ఏళ్ల ఆ లెజెండ్‌ శనివారం అంటే పదిహేడో తారీఖున ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నాడు.

సంస్మరణగా అలెక్‌ పదమ్‌సీ గురించి కొన్ని విషయాలు.
1928లో జననం. బాంబే. ధనిక కుటుంబం. తండ్రి జఫర్‌భాయ్‌ పదమ్‌సీ, వ్యాపారస్తుడు. తల్లి కుల్సుమ్‌బాయి పదమ్‌సీ కూడా బిజినెస్‌ చూసుకునేవారు. నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన మగపిల్లాడు అలేక్‌. కాబట్టి చాలా గారంగా పెరిగాడు. అతను ఏదడిగినా కాదనే వారు కాదు తల్లిదండ్రులు. అందుకే తను స్పాయిల్డ్‌ చైల్డ్‌ అని చెప్పుకుంటాడు అలేక్‌. అతని అసలు పేరు రోషన్‌. ముద్దు పేరు అలేక్‌. చిన్నప్పుడు ముంబైలోనే మర్ఫీ అనే ఐరిష్‌లేడీ స్థాపించిన బోర్డింగ్‌ స్కూల్లో  చదివాడు. మర్ఫీకి భారతీయ పేర్లు పలకడం రాక హరిని హ్యారీ అని, శ్యామ్‌ను సామ్‌ అని రిజిస్టర్‌లో నమోదు చేసుకునేదట.

ఆ విషయం తెలిసిన అలేక్‌ వాళ్ల అమ్మ కుల్సుమ్‌.. ముద్దు పేరుతోనే అలేక్‌ను స్కూల్లో జాయిన్‌ చేసింది. దాంతో అలేక్‌గానే ప్రపంచానికి పరిచయమ్యాడు రోషన్‌. ఇంగ్లండ్‌లోని వరల్డ్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమాటిక్‌ ఆర్ట్స్‌లో పట్టా తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచీ షేక్‌స్పియర్‌ అంటే వల్లమాలిన ప్రేమ. అందుకే ఇంగ్లండ్‌ నుంచి రాగానే థియేటర్‌ ప్రాక్టీస్‌ స్టార్ట్‌ చేశాడు. అప్పుడే పర్ల్‌ అనే థియేటర్‌ ఆర్టిస్ట్‌ను కలిశాడు. ఆమె ఇద్దరు పిల్లలున్న డైవోర్సీ. ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంటిని, తన వాటా ఆస్తినీ వదులుకోవాలని చెప్తుంది తల్లి. సరేనని బయటకు వెళ్లిపోయి స్నేహితుడి సహాయంతో లింటాస్‌ అనే యాడ్‌ కంపెనీలో చేరుతాడు. నెలకు మూడువందల రూపాయల జీతంతో. ఒకవైపు యాడ్స్‌.. ఇంకో వైపు థియేటర్‌.

జిన్నా.. జీసస్‌.. ఎవీటా...
పదేపదే ప్రేమలో పడడం అలెక్‌ పదమ్‌సీ బలహీనత.. బలం కూడా. అమ్మాయిలతోనైనా.. పనితోనైనా! జీవితంలో పర్ల్‌ తర్వాత, డాలీ.. తర్వాత షరాన్‌ ప్రభాకర్‌. ముగ్గురు సొంతపిల్లలు.. చాలామంది సవతి పిల్లలు. కెరీర్‌లో.. హమారా బజాజ్, లిరిల్, సర్ఫ్, చార్లీ బ్లాసమ్‌ (షూపాలిష్‌) లాంటి యాడ్స్‌. థియేటర్‌లో జీసస్‌క్రైస్ట్‌ సూపర్‌స్టార్, ఎవీటా!  సంగీతంతోనే ప్రపంచం అనుకున్నచోట రాక్‌ మ్యూజిక్‌ను మిక్స్‌ చేసి జీసస్‌క్రైస్ట్‌ను సూపర్‌హిట్‌ చేశాడు. రాజకీయాలే సర్వస్వం అనుకున్నచోట పాలిటిక్స్‌ను కలిపి ఎవీటాను ప్లే చేశాడు. ఇది ఇందిరాగాంధీ మీద సాగిన నాటకం. ఏకంగా అయిదేళ్లు నిరవధిక ప్రదర్శనలు సాగాయి.

‘‘అయినా ఇందిరాగాంధీ నుంచి ఒక్క ప్రశంస.. ఒక్క పొలైట్‌ లెటర్‌ను కూడా అందుకోలేదు’’ నిట్టూర్చాడు. ఒక కాక్‌టైల్‌ పార్టీలో ఇంగ్లిష్‌ యాక్టర్, ఫిల్మ్‌మేకర్‌ రిచర్డ్‌ అటెన్‌బరో కంట్లోపడ్డాడు అలేక్‌. ఫస్ట్‌లుక్‌లోనే తను తీయబోయే గాంధీ బయోగ్రఫీ మూవీలో జిన్నాగా అలేక్‌ను ముద్ర వేసేసుకున్నాడు. రోల్‌ ఇచ్చాడు కూడా. చాలామందికి అలేక్‌.. జిన్నా వేషగాడిగానే తెలుసు. తనను బాగా ప్రభావితం చేసిన మనుషులు ఇద్దరే.. ఓషో, అమెరికన్‌ మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ అని చెప్తాడు.  యాడ్‌ ఫీల్డ్‌లో చాలామంది ఆయనను గాడ్‌ఫాదర్‌గా భావిస్తారు. ‘‘వాళ్ల అభిమానం.. నేను ఎవరికీ గాడ్‌ఫాదర్‌ను కాను. కనీసం నా పిల్లలకు గుడ్‌ ఫాదర్‌ని కూడా కాదు. వాళ్లతో గడపాల్సినంత సమయం గడపలేదు.

ఈ నిజాన్ని లేట్‌గా గ్రహించా. రిపెంట్‌ అవుతున్నా. అలాగని ఎమోషనల్‌ కాదనుకునేరు. వాళ్ల దగ్గరున్నంత సేపు ఎమోషనల్‌గానే ఉండేవాడిని. సెల్ఫ్‌ సెంట్రిక్‌ని. నా థర్డ్‌ వైఫ్‌ షరాన్‌ ప్రభాకర్‌కు చాలా థ్యాంక్స్‌ చెప్పాలి. ఎందుకంటే తనే నా ఇద్దరి మాజీ భార్యలను, పిల్లలను అందరినీ కలిపి.. పార్టీలు అరెంజ్‌ చేస్తుంటుంది. ఆమె వల్లే అందరినీ కలిసి.. కావల్సినంత టైమ్‌ కేటాయించగలిగాను. గడపగలుగుతున్నాను. దురదృష్టమేమంటే ప్రాణంలా ప్రేమించిన పర్ల్‌ ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఎక్కడున్నా.. షీ ఈజ్‌ మై లవ్‌’’ అని చెప్పాడు అలేక్‌ పదమ్‌సీ ఒక ఇంటర్వ్యూలో. ఆరెంజ్‌ అనే తెలుగు సినిమా, దిల్‌తో బచ్చా హైజీ అనే హిందీ సినిమాలో నటించిన షాజన్‌ పదమ్‌సీ ఆయన కూతురే. షరాన్‌ ప్రభాకర్‌తో పుట్టిన కూతురు. 


- సరస్వతి రమ

మరిన్ని వార్తలు