మదిలో ఒలికే ముత్యాలు

29 Mar, 2018 00:55 IST|Sakshi

మేఘన్‌ మార్కల్‌ ఈ ఏడాది మే 19న ప్రిన్స్‌ హ్యారీని వివాహం చేసుకుని, బ్రిటష్‌ రాజ వంశ కుటుంబంలో సభ్యురాలు కాబోతున్నారు. మార్కల్‌ అమెరికా అమ్మాయి. టీవీ నటి. కొన్ని హాలీవుడ్‌ చిత్రాలలో కూడా నటించారు. ఇవన్నీ అందరికీ తెలిసిన సంగతులే. అయితే కొద్దిమందికే తెలిసిన విషయం ఏంటంటే.. మార్కల్‌ కాలిగ్రఫీలో ఎక్స్‌పర్ట్‌. చేతిరాతలో ప్రవీణురాలు. టీవీ ఆడిషన్‌కి వెళ్లడానికి ముందు పార్ట్‌ టైమ్‌ జాబ్‌గా ప్రతిరోజూ రెండు గంటలసేపు కొందరు కస్టమర్లకి కాలిగ్రఫీ నేర్పారు మార్కల్‌. నేటికీ ఫ్రీలాన్స్‌ కాలిగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

గతంలో ఆమె అనేకసార్లు తన సన్నిహితుల పెళ్లికి తన చేతిరాతతోనే అందంగా శుభలేఖను రాసి ఇచ్చారు. దానిని వారు ఎంతో ఆపేక్షగా ప్రింట్‌ చేయించుకున్నారు. మార్కల్‌ తన ప్రేమలేఖను కూడా స్వదస్తూరితో రాసి ప్రిన్స్‌ హ్యారీ మనసు దోచుకున్నారు. ప్రస్తుతం చేతి రాతతో వచ్చే లేఖలు కనుమరుగై పోతున్నాయి. ‘‘నేను మొట్టమొదటి టీవీ కొనడానికి ముందు, మా నాన్న నాకో ఉత్తరం రాశారు. ఇప్పటికీ అది నా దగ్గరుంది. కొంత సమయం కేటాయించి పేపర్‌ మీద పెన్ను పెట్టి, మనకు ఇష్టమైన వాళ్ల కోసం ఉత్తరం రాయడమనేది నిజంగా బాగుంటుంది’’ అంటూ ఒక బ్లాగ్‌లో గుర్తు చేసుకున్నారు మార్కల్‌.

ఇంతకీ వాళ్ల నాన్నగారు రాసిన ఉత్తరంలో ఏముంది? క్రియేటివ్‌గా ఉంటే లైఫ్‌ బోరుకొట్టదని రాశారు.  ఇతరులకు సహాయం చేయడం, ఎలాంటి ఉద్యోగంలోనైనా సృజనాత్మకంగా పనిచేయడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తుంది అంటారు మార్కల్‌. తన వివాహానికి కూడా స్వయంగా తన చేతి రాతతో రూపొందించిన కార్డులను తనకు అత్యంత ఆప్తులైనవారికి పంపించారామె. ఆ కవర్లకు అతికించే స్టాంపుల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు.  అన్నట్లు.. కాలిగ్రఫీని నేర్చుకోవడానికి ముందు మార్కల్‌ 2005 ప్రాంతంలో బెవర్లీ హిల్స్‌లో గిఫ్ట్‌ ర్యాపింగ్, బుక్‌ బైండింగ్‌ కూడా నేర్చుకున్నారు.

మరిన్ని వార్తలు