సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

10 Jul, 2019 09:05 IST|Sakshi

ఒంటిని శుభ్రం చేసుకునేందుకు వాడుకునే సోపు మొదలుకొని.. జుట్టుకోసం వాడే షాంపూ, పాత్రలకు ఉపయోగించే డిష్‌ సోప్‌లతోపాటు అనేక ఇతర పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకునేందుకు అమెరికాలోని మియామీకి చెందిన నిక్‌ మాథ్యూ, మార్క్‌ గునియా ఓ వినూత్నమైన పరికరాన్ని సిద్ధం చేశారు. ఈ పదార్థాలన్నీ ప్లాస్టిక్‌ ట్యూబుల్లో వస్తూండటం ఈ అన్నదమ్ములకు అసలు నచ్చలేదు. అన్నీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగితే.. ప్యాకింగ్‌ కూడా కలిసి వస్తుంది కదా అనుకున్నారు. నాలుగేళ్లపాటు శ్రమించి ఈ యంత్రాన్ని సిద్ధం చేశారు. క్లీనిస్ట్‌ అని పేరు పెట్టారు. 2015లో తాము ఓ వినూత్నమైన సీసాను చూశామని... నేలను శుభ్రం చేసుకునే ద్రవాలను అవసరానికి తగ్గట్టుగా కలిపి ఇవ్వగలిగిన ఈ సీసాలను చూసిన తరువాత తమకు క్లీనిస్ట్‌ తయారీకి స్ఫూర్తి వచ్చిందని వీరు అంటున్నారు. క్లీనిస్ట్‌లో నీళ్లు ఉంచే పాత్ర ఒకటి ఉంటుంది. దీంతోపాటు ప్యాకెట్లలో వచ్చే వేర్వేరు మిశ్రమాలను మనం కొనుగోలు చేయాలి. అన్నీ సహజ సిద్ధమైనవి కావడం గమనార్హం. నీటిపాత్రను నింపేసి ప్యాకెట్‌ను పరికరంలో ఉంచాలి. ఆ తరువాత ఎల్‌ఈడీ తెరపై కావాల్సిన బటన్‌ను నొక్కితే చాలు. షాంపూ, సోపు, డిష్‌ సోపు వంటివి రెడీ అయిపోతాయి. అంతేకాదు.. నచ్చిన సువాసనను చేర్చుకోగలగడం ఇంకో విశేషం. దాదాపు 5.5 కిలోల బరువుండే క్లీనిస్ట్‌ ఖరీదు దాదాపు పద్నాలుగు వేల రూపాయల వరకూ ఉండవచ్చు.

మరిన్ని వార్తలు