అమీబియాసిస్ తగ్గుతుందా?

12 Dec, 2016 15:19 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్

నా వయసు 35 ఏళ్లు. నాకు కడుపునొప్పి వచ్చి, మూడు నుంచి నాలుగుసార్లు మలవిసర్జన అవుతుంది. ఇలా గత రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి. ఎక్కడికి వెళ్లాలన్నా భయంగా, ఆందోళనగా ఉంది. దీనికి పరిష్కారం చెప్పండి. - రమేశ్, నల్లగొండ
సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి సాధారణ వ్యాధుల్లో అమీబియాసిస్ ఒకటి. ఈ వ్యాధి హిస్టలిటికా అనే క్రిమి వల్ల ఒకరి నుంచి మరొకరికి అపరిశుభ్రమైన తాగునీటి ద్వారా, సరిగా ఉడకని కలుషితమైన ఆహార పదార్థాల వల్ల సంక్రమిస్తుంది. ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. అమీబియాసిస్‌ను కలగజేసే క్రిమి సిస్ట్ రూపంలోనూ, ట్రోఫో జువాయిట్ రూపంలోనూ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. పేగుల్లోని కొన్ని ఎంజైమ్‌ల వల్ల సిస్ట్ చుట్టూ ఉన్న పొర పలచబారుతుంది. తద్వారా ట్రోఫోజువాయిట్‌లు బయటకు వెలువడుతాయి. ఇవి మలం ద్వారా వెలుపలికి వచ్చిన తర్వాత జీవించలేవు. ఇవి ప్రధానంగా ద్రవరూపంలో ఉన్న మలం ద్వారా బయటకు వస్తాయి. మలం ద్వారా బయటకు వచ్చి సిస్ట్‌లు నీటిలోనూ, మట్టిలో చాలాకాలం సజీవంగా ఉండి, అనుకూల పరిస్థితుల కోసం ఎదురుచూస్తుంటాయి. ఈ వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు రెండు వారాల నుంచి రెండు నెలల లోపు బహిర్గతమవుతాయి. ఈ క్రిములు పేగుల్లో ఉండి, వ్యాధి లక్షణాలను బహిర్గతం చేస్తుంటే ఇంటస్టినల్ అమీబియాసిస్ అని, ఇతర భాగాల్లో వ్యాపించి ఉండి వ్యాధి లక్షణాలను బహిర్గత పరుస్తుంటే ఎక్స్‌ట్రా ఇంటెస్టినల్ అమీబియాసిస్ అని అంటారు. ఇన్ఫెక్షన్ ఎక్కువై వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు దుర్వాసనతో కూడిన ద్రవరూప మలం వెలువడుతుంది. రక్తం, జిగురులతో కలిసి  రోజూ ఎక్కువసార్లు విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. తీవ్రత మరింత ఎక్కువైనప్పుడు 105 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకూ జ్వరం వస్తుంది.

కారణాలు:  కలుషితమైన నీరు, ఆహారపదార్థాల వల్ల  ఇన్ఫెక్షన్స్ వల్ల  దీర్ఘకాలికంగా నీరసంగా ఉండడం వల్ల  కొన్నిసార్లు వ్యాధి క్రిములున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వారి వల్ల ఇతరులకు వ్యాధి సోకుతుంది. ఇలా తమలో వ్యాధి కారక క్రిములను కలిగి ఉన్నవారిని ‘క్యారియర్స్’ అంటారు.

లక్షణాలు:  కడుపునొప్పి, కడుపు ఉబ్బరం  దీర్ఘకాలికంగా విపరీతమైన నీరసం బరువు కోల్పోవడం, మలబద్ధకం  జ్వరం, దగ్గు, ఆకలి లేకపోవడం

వ్యాధి నిర్ధారణ:  రక్త పరీక్షలు, మలపరీక్ష , ఎక్స్‌రే, సిగ్మాయిడోస్కోపీ

చికిత్స: హోమియోపతిలో అమీబియాసిస్‌ను తగ్గించడానికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి మందులను సూచిస్తారు. హోమియోలో దీనికి అకోనైట్, ఆర్సినికమ్ ఆల్బమ్, లకెసిస్, సల్ఫర్ మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాల్సి ఉంటుంది.

డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్

ఆస్తమా అంటున్నారు. జాగ్రత్తలు ఏమిటి?
పల్మునాలజీ కౌన్సెలింగ్

నా వయసు 29 ఏళ్లు. నాకు చలికాలం రాగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, ఆయాసం వంటివి కలుగుతుంటాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆస్తమా అన్నారు. ఇది ఎందుకు వస్తుంది? కారణాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించండి.  - రాంప్రసాదరావు, చోడవరం
శ్వాసమార్గంలో వాపు, శ్వాసకోశమార్గం కుంచించుకుపోవడం వంటివి ఏర్పడి... దీర్ఘకాలికంగా శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడితే దాన్ని ఆస్తమా అంటారు. ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో అలర్జిక్ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తులలోని గాలి మార్గానికి అడ్డంకులు ఏర్పడతాయి. దాంతో శ్వాస తీసుకునే సమయంలో పిల్లికూతలు, దగ్గు, ఆయాసం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి.

ఆస్తమా వ్యాధికి కారణాలు: ఆస్తమా వ్యాధి అలర్జీలకు సంబంధించినది. అలర్జీ ఉన్నవారిలో మనకు వ్యాధి నిరోధక శక్తిని కలిగించే అంశాలు మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల అది వ్యాధిగా కనిపిస్తుంది. శరీరానికి సరిపడని పదార్థాలు మన ఒంటిలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు రక్షణ ప్రక్రియలో భాగంగా మన శరీరం నుంచి కొన్ని యాంటీబాడీలను వెలువరిస్తుంది. అవి మన శరీరంపైనే ప్రతికూలంగా ప్రవర్తించడం వల్ల ఆస్తమా వస్తుంది. ఈ ప్రక్రియలో కణాల నుంచి ఉత్పత్తి అయ్యే వివిధ రసాయనాల వల్ల శ్వాసనాళాలలో శ్లేష్మం జమ కావడం, తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి. దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం వంటివి కూడా జరుగుతాయి. ఈ లక్షణాలతో పాటు కొంతమందిలో తరచూ తుమ్ములు, ముక్కు దిబ్బడ వేయడం, నీరు కారడం, కంట్లో దురద, చర్మంపై దద్దుర్లు, అలర్జిక్ డర్మటైటిస్, ఎక్జిమా లాంటి చర్మవ్యాధులు వస్తాయి. అయితే అలర్జీ వల్ల వచ్చే ఈ వ్యాధులన్నీ ఒకరిలోనే కనిపించవచ్చు. వాటిలో ఒకటి రెండు లక్షణాలు మాత్రమే కూడా ఉండవచ్చు.

కారణాలు: చల్లగాలి (చల్లటి వాతావరణం), దుమ్ము, ధూళి, పొగ, అలర్జీ కారకాలైన గడ్డి, ఫంగస్, కాలుష్యం, రసాయనాలు, ఘాటు వాసనలు, శారీరక శ్రమ, వైరల్ ఇన్ఫెక్షన్లు, పెంపుడు జంతువుల విసర్జక పదార్థాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు... ఇవన్నీ ఆస్తమాకు కారణాలు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:  చల్లటి గాలిలో తిరగకూడదు వర్షం / నీళ్లలో తడవకూడదు  సరిపడని పదార్థాలు తినకూడదు  మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మాటిమాటికీ ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాక్సినేషన్‌లు తీసుకోవాలి. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రతించాలి.

డాక్టర్ ఎ. జయచంద్ర
పల్మునాలజిస్ట్ , సెంచరీ హాస్పిటల్స్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు... సలహా ఇవ్వండి!
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

నేను నెల రోజుల క్రితం కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌లో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. అయితే నాకు ఎప్పుడూ కడుపు నొప్పి రాలేదు. ఇలా రాళ్లు ఉన్నవారు ఆపరేషన్ చేయించుకోవాలని తెలిసిన వారు కొందరు సలహా ఇస్తున్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి దీనికి చికిత్స ఏమిటో చెప్పండి.  - చంద్రారెడ్డి, నకిరెకల్
మీరు చెప్పిన వివరాల ప్రకారం మీకు ‘ఎసింప్టమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్’ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి, వ్యాధి లక్షణాలే ఏమీ లేనివారిలో ఏడాదికి వందమందిలో సుమారు ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. మీకు వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఒకసారి మీకు దగ్గర్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిస్తే, వారు మీ కండిషన్‌ను ప్రత్యక్షంగా చూసి తగిన సలహా ఇస్తారు.

నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్నడాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.- రాధాకృష్ణమూర్తి, నెల్లూరు
మీకు లివర్ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. దాని రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రతిస్తే మీకు తగిన చికిత్స అందిస్తారు.

డాక్టర్ భవానీరాజు,  సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు