ఒక ఒంటరి జీవితగంధం

21 Jan, 2019 00:21 IST|Sakshi

కొత్త బంగారం

‘ఫ్రెంచ్‌ స్త్రీ రాబోయే ముందు, నేను సాధించవలసిన పనులు ఎన్నో ఉన్నాయి,’ అంటూ ప్రారంభమయ్యే ‘ఫ్రెంచ్‌ పెర్‌ఫ్యూమ్‌’ నవల్లో, అలీ జర్జర్‌ ఏనాటి నుండో తన మూత్రకోశాన్ని అదుపులో ఉంచుకుని, తన్ని తాను దృఢపరచుకున్న వ్యక్తి. దగ్గు రాకుండా, తన ఊపిరితిత్తులని నిరోధించగలుగుతాడు. తన జ్ఞాపకాల చిత్తభ్రమని నిర్దేశించగలిగేవాడు. అతని ఉనికే స్వీయ నియంత్రణతో ముడిపడి ఉంటుంది. పేదవారికి టీ అమ్మే స్థానిక స్త్రీల, పనికత్తెల, వలసదారులైన స్త్రీల ముందే అస్తమానం వేళ్ళాడుతుంటాడు. అతను విడిచిపెట్టిన ఆడవాళ్ళు, ‘ఒక వెచ్చని కలని చుట్టుకొని, సంతోషకరమైన జీవితం గురించి కలలు కనే వారు’. ‘ఘాలిబ్‌’ (ఉనికిలో లేనిది) అన్న తన ‘ఊరి గోడల మీదుండే బీటల్లా వారు ఉపేక్షింపదగ్గవారు’ అన్నది అతని అభిప్రాయం. ‘నిశ్శబ్దంగా, మృదువుగా తెరుచుకునే తలుపులని ఎవరూ గౌరవించరు’ అంటాడు. అందమైన ఫ్రెంచ్‌ యువతైన కాతియా, జింబాబ్వేలో నర్స్‌గా పని చేస్తుంటుంది. ఒక విదేశీ మందుల కంపనీ, నకిలీ మందులను ఆఫ్రికా ఎగుమతి చేస్తోందని యాదృచ్ఛికంగా కనుక్కుంటుంది. ఆ తరువాత, అంతర్జాతీయ కీర్తి పొంది, ఆఫ్రికా ఖండం యొక్క ప్రచార పర్యటన మొదలుపెడుతుంది.

ఆమె సూడాన్‌లో ఉన్న ఘాయిబ్‌కు రావలసి ఉన్నప్పుడు, ఆమెకు తగిన వసతి అవీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రిటైర్‌ అయిన అలీ జర్జర్‌ మీద పడుతుంది. అలీ– పుష్టిగా ఉంటాడు. బట్టతల ఉన్న బ్రహ్మచారి. నెట్లో చూసిన పట్ల వ్యామోహం పెంచుకుని, ఆమెను ట్రాల్‌ చేయడం ప్రారంభిస్తాడు. ఆమెని కలుసుకుని, పెళ్ళి చేసుకుంటానన్న భ్రమలో మునిగి ఉంటాడు. కాతియా రాక ఆలస్యం అవుతూ ఉండగా, ఆమెకి ఇష్టమైన నీలం రంగు తన ఇంటి లోపలా, బయటా వేయిస్తాడు. ఇంటర్నెట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఆమె ఫొటోలను ప్రింట్‌ చేసి, ఆమె స్వాగతం కోసం అందిన డబ్బుని తన పెళ్ళికొడుకు వేషం కోసం ఖర్చు పెట్టి, కాతియా ఫొటోలతో పెళ్ళి చేసుకుంటాడు. ఫొటోషాప్‌ చేసిన ఆ ఫొటోలను ఊళ్ళో తిప్పి, ఆమెను తన భార్యగా అందరికీ పరిచయం చేస్తాడు. ఆమె గర్భిణి అయిందన్న చాటింపు వేస్తాడు. ఒంటరితనం అతన్ని పూర్తిగా పిచ్చివాడిని చేసినప్పుడు– కాతియా వ్యభిచరించి తన్ని మోసం చేసిందని నిరూపించడానికి, తన యవ్వనంలో చూసిన సినిమా సీన్‌ అభినయించి అందరికీ చూపుతాడు. అసూయతో, వీధిలో ఒక ‘మగ భూతాన్ని’ వంటింటి కత్తితో హత్య చేస్తాడు. కాతియా ఫొటోని అదే కత్తితో పొడిచి, అరెస్ట్‌ అవతాడు. అతన్ని జైలుకి తీసుకు వెళ్తుండగా కాతియా కారు దిగుతుంది.

‘ఎవరినీ పెళ్ళి చేసుకోకపోవడం కన్నా ఒక ఆడ భూతంతో సహవాసం పెంచుకోవడం నయమే’ అని అలీ అన్నప్పుడు– ఒంటరితనం అతన్ని తినేస్తున్నప్పటికీ, అతను స్పష్టంగానే మాట్లాడుతున్నాడని తెలుస్తుంది. కానీ, చివరి వరకూ కాతియా పాత్ర నిజమైనదో, అలీ ఊహించుకున్నదో అర్థం కాదు. సూడాన్‌ రచయిత అమీర్‌ తాగ్‌ ఎల్సిర్, అరబిక్‌లో రాసిన యీ పుస్తకాన్ని, విలియమ్‌ మేనార్డ్‌ హచిన్స్‌ అనువదించారు. మూల పుస్తకంనుండి ‘అసంబద్ధత’ అన్న భావాన్ని రాబడతారు హచిన్స్‌. అలీ ప్రత్యక్ష వ్యాఖ్యానం – సాంకేతికతకూ, సాంకేతిక పరికరాలకూ బానిసైన మన సమాజాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తుంది. డార్క్‌ కామెడీ. ప్రతినాయకుడైన అలీ ద్వారా నవల– అనేకమైన ఇతర సామాజిక రుగ్మతలను ఎత్తి చూపుతుంది. దీన్ని 2015లో ప్రచురించింది ఏంటీ బుక్‌ క్లబ్‌.
 కృష్ణ వేణి

మరిన్ని వార్తలు