వనాలలో... వెరైటీగా!

16 Nov, 2015 22:42 IST|Sakshi
వనాలలో... వెరైటీగా!

పసిరిక తొక్కడం, ఉసిరిక నమలడం రెండూ ఆరోగ్యమే.
ఉసిరిచెట్టు కింద సహపంక్తి అంటేనే స్నేహాలు పురివిప్పడం.
సిరి నాథుడినీ, హర దేవుడినీ విరివానతో తడపడం.  
లాలాజలాభిషేకంతో పరబ్రహ్మస్వరూపాన్ని పూజించడం.
ఆరోగ్యప్రదాతలూ, అశ్వనీదేవతల అనుగ్రహం పొందడం.
రండి... ఈ కార్తికంలో స్నేహామృతాలను ఆస్వాదిద్దాం.  
 రుచులతో పాటు ఆరోగ్య సిరుల మూట విప్పుదాం.

 
సెసేమ్ వెజ్ టోస్ట్
కావలసినవి: క్యారట్ తురుము - పావు కప్పు, ఫ్రెంచ్ బీన్స్ తరుగు - పావు కప్పు, బంగాళదుంప - 1, క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు, ఉల్లి తరుగు - పావుకప్పు, కొత్తిమీర తరుగు - టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, అల్లం తురుము - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, కార్న్ స్టార్చ్ - టేబుల్ స్పూను, సోయా సాస్  - అర టేబుల్ స్పూను, నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, బ్రెడ్ స్లైసులు - 5 (బ్రౌన్ లేదా గోధుమ బ్రెడ్), నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
 
తయారీ:  ముందుగా బంగాళదుంపలను ఉడకబెట్టి, తొక్క తీసి మెత్తగా మెదపాలి  క్యారట్, బీన్స్ ముక్కలను కూడా ఉడకబెట్టి, గరిటెతో మెత్తగా మెదపాలి  ఒక పాత్రలో బంగాళదుంప ముద్ద, క్యార ట్, బీన్స్ ముద్ద వేసి కలపాలి  అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కార్న్‌ఫ్లోర్, సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, పూర్తిగా చల్లారేవరకు పక్కన ఉంచాలి  వేరొక పాత్రలో కార్న్‌ఫ్లోర్‌కి తగినన్ని నీళ్లు జత చేసి ముద్దలా చేసి పక్కన ఉంచాలి  బ్రెడ్ స్లైసులను త్రికోణాకారంలో కట్ చేయాలి  బ్రెడ్ మీద ముందుగా కార్న్‌ఫ్లోర్ ముద్దను కొద్దిగా పూసి, ఆ పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వీటి మీద సమానంగా పరిచి, చేతితో కొద్దిగా ఒత్తి ఆ పైన మళ్లీ కార్న్‌ఫ్లోర్ ముద్దను ఉంచాలి  పైన నువ్వులను చల్లి తేలికగా ఒత్తాలి. ముద్ద మీద చల్లడం వల్ల బాగా అతుక్కుంటాయి  బాణలిలో నూనె కాగాక, నూనెలో వేసి, రెండువైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ నాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.
 
 ఖజూర్ హల్వా
 కావలసినవి: బాదం తరుగు-టేబుల్ స్పూను, ఖర్జూరం తరుగు-పావు కేజీ, నెయ్యి-2 టేబుల్ స్పూన్లు, పాలు-అర లీటరు, మిల్క్ మెయిడ్-200 గ్రా. తయారీ:  ఖర్జూరం తరుగును పాలలో సుమారు గంటసేపు నానబెట్టి, మిక్సీలో వేసి ముద్దలా చేయాలి      బాణలిలో నెయ్యి వేసి కరిగాక, మిల్క్‌మెయిడ్, మెత్తగా చేసిన ఖర్జూరం ముద్ద వేసి ఆపకుండా కలుపుతూ, సన్నని మంట మీద ఉడి కించాలి  బాదం తరుగుతో అలంకరించి అందించాలి.
 
 పనీర్ మంచూరియన్ డ్రై
 కావలసినవి: పనీర్ - 250 గ్రా., కార్న్ స్టార్చ్ - 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, పంచదార - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 3 టేబుల్ స్పూన్లు, సాస్ కోసం, టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ - అర టేబుల్ స్పూను, మిరియాల పొడి - పావు టీ స్పూను, రైస్ వెనిగర్ - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, నీళ్లు - పావు కప్పు, ఉల్లి తరుగు - కప్పు, క్యాప్సికమ్ తరుగు - అర కప్పు, అల్లం తురుము - టీ స్పూను, వెల్లుల్లి తరుగు - టీ స్పూను, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను, ఉప్పు - తగినంత. తయారీ:  పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి, పొడిగా ఉన్న కిచెన్ టవల్ మీద సుమారు అరగంట సేపు ఆరబెట్టి, ఆ తరవాత పెద్ద పాత్రలోకి తీసుకోవాలి  కారం, మిరియాల పొడి, ఉప్పు, కార్న్ స్టార్చ్ జత చేసి జాగ్రత్తగా కల పాలి  బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక, పనీర్ ముక్కలు వేసి గోధుమ వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి  ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి  పావు కప్పు నీళ్లకి, కార్న్‌స్టార్చ్, మసాలా దినుసులు జత చేసి బాగా కలిపి, ఉడుకుతున్న మిశ్రమంలో వేయాలి  అర టేబుల్ స్పూను సోయా సాస్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ జత చేయాలి  ఉప్పు, కారం, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి మిశ్రమ మంతా పనీర్‌కి బాగా పట్టి, చిక్కబడే వరకు కలపాలి  వెనిగర్ జత చేసి, రెండు నిమిషాలు ఉంచి దించేయాలి  ఉల్లి కాడల తరుగుతో అలంకరించి అందించాలి.
 
షెజ్వాన్ పొటాటో చిల్లీ

కావలసినవి: బంగాళదుంపలు - 3 (మీడియం సైజువి), కార్న్ ఫ్లోర్ - టేబుల్ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తరుగు - టీ స్పూను, ఉల్లి తరుగు - అర కప్పు, అల్లం తురుము - అర టీ స్పూను, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, ఎండు మిర్చి - 4 (కొద్దిగా నీళ్లు జత చేసి పేస్ట్ చేయాలి), ఎండు మిర్చి - 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి), సోయాసాస్ - 2 టీ స్పూన్లు, నీళ్లు - 4 టేబుల్ స్పూన్లు, తెల్ల వెనిగర్ - అర టీ స్పూను, కార్న్‌ఫ్లోర్ - టేబుల్ స్పూను (2టేబుల్ స్పూన్ నీళ్లలో చిక్కగా కలపాలి), ఉప్పు, పంచదార, మిరియాల పొడి - తగినంత, కొత్తిమీర తరుగు - టీ స్పూను. తయారీ:  బంగాళదుంపలను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి, చన్నీళ్లలో అరగంట సేపు ఉంచి, నీళ్లు వడకట్టి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి  బాణలిలో నూనె వేడయ్యాక, ఈ ముక్కలను అందులో వేసి బంగారు వర్ణంలోకి  వచ్చేవరకు డీప్ ఫ్రై చేసి, పేపర్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి  వేరొక బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి తురుము వేసి బాగా కలపాలి  మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు బాగా కలపాలి  సోయాసాస్, ఎండు మిర్చి ముద్ద, ఉప్పు, పంచదార జత చేసి బాగా కలపాలి  నీళ్లు జత చేసి సన్నని మంట మీద సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి  రెండు టేబుల్ స్పూన్ల నీళ్లలో టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న మిశ్రమానికి జత చేయాలి   కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి, మిశ్రమం చిక్కబడేవరకు బాగా క లపాలి  తయారుచేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు జత చేసి బాగా కలిపి దింపేయాలి  కొత్తిమీర తరుగుతో అలంకరించి అందించాలి.
 
బనానా స్ట్రాబెర్రీ స్వీట్
కావలసినవి: అరటిపండు - 1 (చిన్నది), పెరుగు - అర కప్పు, వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను, స్ట్రాబెర్రీ పండ్లు - 10, బాదం తరుగు - టేబుల్ స్పూను
తయారీ:  ముందుగా ఒక పాత్రలో పెరుగు బాగా గొలక్కొట్టాలి  స్ట్రాబెర్రీ పండ్ల పై ఉన్న తొడిమల్ని తీసేయాలి అరటిపండు తొక్క తీసి మెత్తగా మెదపాలి  ఒక పాత్రలో పెరుగు, వెనిలా, బాదం తరుగు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని స్ట్రాబెర్రీల మీద ఉంచి, అందించాలి.
 
ధాపా దహీ
కావలసినవి: మిల్క్‌మెయిడ్ - 200 గ్రా., కిస్‌మిస్, జీడిపప్పులు - 25 గ్రా., పెరుగు - 3 కప్పులు, ఏలకుల పొడి - కొద్దిగా
 తయారీ:  పెరుగును పల్చటి వస్త్రంలో గట్టిగా మూట గట్టి, అరగంట సేపు వేలాడదీయాలి (నీరంతా పోతుంది)  మిల్క్‌మెయిడ్, ఏలకుల పొడి జత చేసిపైన వస్త్రంతో కప్పి ఉంచాలి  మరిగించిన నీటి పాత్రలో ఈ పాత్రను సుమారు 20 నిమిషాలు ఉంచి, తీసి చల్లారనివ్వాలి  కిస్‌మిస్, జీడిపప్పులతో అలంకరించి చల్లగా అందించాలి.
 
గమనిక: కార్న్ స్టార్చ్ తయారీ కోసం.
..
 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌కి 3 టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి బాగా కలిపితే స్టార్చ్ రెడీ.
 
 

మరిన్ని వార్తలు