సిరిభోజనం

12 Dec, 2016 15:12 IST|Sakshi
సిరిభోజనం

ఇది కార్తికమాసం. వనభోజన మాసం. ఇంటిల్లపాదీ వనభోజనం చేయాలి.
ఆ వనంలో ఉసిరిచెట్టు ఉండాలి. భోజనంలో ఉసిరి వంట ఉండాలి.
ఇది సంప్రదాయం. అది ఎందుకంటారా...? ఆగండాగండి...
ఉసిరి అంటే... ‘సి’ విటమిన్ రిచ్. ఆరోగ్యం వెరీ మచ్. అందుకే...
ఉసిరి ఉన్న భోజనం... సిరిభోజనం.

ఆమ్లా షర్బత్
కావలసినవి: ఉసిరికాయలు- 500 గ్రా, చక్కెర- 200 గ్రా, జీలకర్ర పొడి- అర టీ స్పూన్, ఉప్పు - అర టీ స్పూన్, పుదీన ఆకులు - మూడు, ఐస్- పది క్యూబ్‌లు

తయారీ:  ఉసిరికాయలను కడిగి తగినంత నీటిని పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత చేత్తో చిదిమి గింజలను తీసి వేయాలి.  ఉసిరిక గుజ్జులో చక్కెర, పుదీన ఆకులు, ఒక కప్పు చన్నీరు పోసి, మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అందులో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఐస్‌క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. దీనిని నిల్వ చేసుకోవచ్చు. గది వాతావరణంలో రెండు రోజులు, ఫ్రిజ్‌లో వారం తాజాగా ఉంటుంది.

గమనిక:  ఎప్పటికప్పుడు తాజాగా కావాలంటే ఉసిరి కాయలను తరిగి, గింజలు తీసి మిక్సీలో గుజ్జు చేయాలి. పలుచటి వస్త్రంలో వేసి రసం తీయాలి. ఆ గుజ్జుకు కొంత నీటిని చేరుస్తూ, మరలా మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. తేనె కలిపి సర్వ్ చేయాలి.

ఆమ్లా  మురబ్బా
కావలసినవి: ఉసిరికాయలు- 100 గ్రా, చక్కెర- 100 గ్రా, నీరు- 125 మి.లీ, కుంకుమ పువ్వు- ఐదు రేకలు, ఏలకుల పొడి- పావు టీ స్పూన్

తయారీ:  ఉసిరికాయలను కడిగి, తురమాలి. గింజలు లేకుండా మొత్తం కోరుకోవాలి.  ఒక పాత్రలో చక్కెర, నీరు కలిపి కరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ కోరు వేసి, సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి.  ఈ మిశ్రమం ఉడికి దగ్గరయ్యే వరకు అడుగు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.  మిశ్రమం తీగలాగ సాగిన తర్వాత దించేసి కుంకుమ పువ్వు, ఏలకుల పొడి వేసి కలిపితే మురబ్బా రెడీ.  ఇది చల్లారిన తర్వాత తడిలేని గాజు జాడీలోకి తీసుకోవాలి. దీనిని తేమ తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.ఉసిరి మురబ్బాను అలాగే తినవచ్చు. బ్రెడ్, చపాతీల మీద పలుచగా రాసి తినవచ్చు.

ఉసిరి పులిహోర
కావలసినవి: బియ్యం- ఒక కప్పు, ఉసిరికాయ తురుము- ఒక కప్పు, కొత్తిమీర- రెండు రెమ్మలు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత

పోపు కోసం: ఆవాలు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, పచ్చి సెనగపప్పు- ఒక టీ స్పూన్, అల్లం తరుగు- అర టీ స్పూన్, ఎండు మిర్చి- రెండు, పచ్చి మిర్చి- రెండు (తరగాలి), కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె - ఒక టేబుల్ స్పూన్

తయారీ:  అన్నం వండి చల్లారబెట్టాలి.  బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగపప్పు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేయాలి.  అవి వేగిన తర్వాత ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి, రెండు నిమిషాల సేపు సన్న మంట మీద మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి.మిశ్రమం చల్లారాక అన్నంలో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లాలి.

ఉసిరి పప్పు
కావలసినవి: కందిపప్పు- ఒక కప్పు, టొమాటో ముక్కలు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, ఉసిరికాయ ముక్కలు- అరకప్పు, మిరప్పొడి- ఒక టీ స్పూన్, పసుపు- చిటికెడు

పోపు కోసం:  నూనె- రెండు టీ స్పూన్‌లు, ఆవాలు- అర టీ స్పూన్, సెనగపప్పు- ఒక టీ స్పూన్, మినప్పప్పు- ఒక టీ స్పూన్, జీలకర్ర-  అర టీ స్పూన్, వెల్లుల్లి రేకలు- మూడు, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు- ఒక టీ స్పూన్

తయారీ:  కందిపప్పును కడిగి ప్రెషర్‌కుకర్‌లో వేయాలి. అందులో టొమాటో, ఉల్లిపాయ, ఉసిరిముక్కలు, మిరప్పొడి, పసుపు, ఒకటిన్నర కప్పు నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత పప్పులో ఉప్పు వేసి పప్పు గుత్తితో మెదపాలి.  ఒక పాత్రలో నూనె వేడి చేసి, ఆవాలు వేయాలి.  అవి వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులన్నింటినీ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు పోపులో మెదిపి పక్కన ఉంచిన పప్పు వేసి కలపాలి.

గమనిక: మిరప్పొడి బదులు పచ్చి మిర్చి వేసుకోవచ్చు.

ఉసిరి ఊరగాయ
కావలసినవి: ఉసిరికాయలు- పావు కిలో, ఆవాల పొడి - 50 గ్రా, కారం - 50 గ్రా, పసుపు - ఒక టీ స్పూన్, ఉప్పు - 50 గ్రా, వెల్లుల్లి రేకలు - పది, నూనె - రెండు టేబుల్ స్పూన్‌లు పోపుదినుసులు  ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి

తయారీ:  ఉసిరికాయలను కడిగి తుడవాలి. బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఉసిరికాయలను వేసి సన్నమంట మీద మెత్తగా మగ్గనివ్వాలి. ఈ ఊరగాయకు ఉసిరి గింజలను తీయాల్సిన అవసరం లేదు.  మెత్తగా మగ్గిన కాయలను మరొక పాత్రలోకి తీసి అదే బాణలిలో పోపు దినుసులు వేయించాలి.  అందులో ముందుగా వేయించి పక్కన ఉంచిన ఉసిరికాయలను వేసి పైన కారం, పసుపు, ఆవాల పొడి, ఉప్పు , వెల్లుల్లి రేకలు వేయాలి. పైన మిగిలిన నూనె వేసి కలిపి చల్లారని వ్వాలి.  తర్వాత తేమలేని గాజు లేదా పింగాణి జాడీలో తీసుకోవాలి. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. తేమ తగలకుండా వాడితే ఆరు నెలలు తాజాగా ఉంటుంది. ఈ ఊరగాయ చేసిన రోజు పైకి నూనె కనిపించదు. రెండు రోజులకు కాయల్లోని నూనె పైకి తేలుతుంది.

మరిన్ని వార్తలు